నవతెలంగాణ – హైదరాబాద్: సామాజిక తెలంగాణ కోసం పని చేసేవారిని ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈరోజు ఆమె మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు మనమందరం ఐక్యంగా పోరాడి విజయం సాధించామని గుర్తు చేశారు. తదుపరి లక్ష్యమైన సామాజిక తెలంగాణను సాధించే దిశగా మనమందరం కలిసి ముందుకు సాగుదామని ఆమె పిలుపునిచ్చారు.
ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం పాటుపడదామని కవిత అన్నారు. పునరేకీకరణ కోసం ఐక్యంగా పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడి తాము పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని ముందుకు వచ్చిన రంగారెడ్డి జిల్లావాసులను ఆమె సాదరంగా ఆహ్వానించారు.
జాగృతిలో ఇదివరకే ఉన్న నాయకత్వంతో పాటు, కొత్తగా చేరుతున్న వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంతో సహా నగరంలోని హైడ్రా బాధితులైన పేదల తరఫున తాము పోరాడుతామని ఆమె తెలిపారు. భవిష్యత్తులో కూడా పేద ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.