Monday, January 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్రమశిక్షణతో కష్టపడదాం

క్రమశిక్షణతో కష్టపడదాం

- Advertisement -

ప్రజల్లో ఉన్న వారికే టికెట్లు
పైరవీలు అవసరం లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
బరిలో నిలిచే వారిని ఆర్థికంగానూ ఆదుకుంటాం : పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌
దేవుళ్ల పేరుతో ఓట్లడిగే వారికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘మున్సిపల్‌ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. సీరియస్‌గా ఉండాలి. క్రమశిక్షణతో కష్టపడి ముందుకు వెళ్దాం. టికెట్‌ కోసం ఎలాంటి పైరవీలు అవసరం లేదు. పార్టీకి విధేయుడిగా ఉంటూ ప్రజల్లో పలుకుబడి ఉన్న వారికి సర్వేల ఆధారంగా టికెట్‌లు కేటాయిస్తాం’ అని నీటిపారుదల శాఖ మంత్రి, నిజామాబాద్‌ పార్లమెంట్‌ మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ హౌటల్‌లో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, సంస్థాగత బలోపేతం, బూత్‌ స్థాయి కమిటీల కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. కార్పొరేషన్‌ డీసీసీ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అటు అభివృద్ధిలో, ఇటు సంక్షేమంలో ముందున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ వివరించాలని అన్నారు. రేషన్‌కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ దేశంలో ఎక్కడా లేదని, మన దగ్గరే అమలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యకర్తల త్యాగాల వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, మూల స్థంభాలైన వారిని మరవబోమని అన్నారు. ఏకాభిప్రాయం ఉన్న చోట అభ్యర్థులను ప్రకటించాలని, పోటీ ఉన్న చోట సర్వేల ఫలితాల ఆధారంగా టికెట్‌లు కేటాయించనున్నట్టు తెలిపారు.

మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపికకు జల్లెడ పడుతున్నామని, పాత వారితోపాటు కొత్త వారికి సైతం అవకాశం వస్తుందని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిని పార్టీ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బీజేపీ ఎన్నికల నినాదాలతో ప్రజల్లో మార్పు వచ్చిందని, లోక్‌సభ ఎన్నికల్లో అరవింద్‌కు నిజామాబాద్‌ అర్బన్‌లో తక్కువ ఓట్లు వచ్చినట్టు గుర్తుచేశారు. దేవుళ్ల పేరుతో ఓట్లడగబోమని మరోసారి పునరుద్ఘాటించారు. బీజేపీ, ఎంఐఎం రెండు పార్టీలను మతతత్వ పార్టీలుగానే చూస్తున్నట్టు, రెండు పార్టీలకు సమాన దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టికెట్‌ రాకపోతే సర్వం కోల్పోయినట్టు కాదని, అర్బన్‌ సీటును తాను త్యాగం చేస్తే ఎమ్మెల్సీ పదవి వరించిందని.. అదే విధంగా అవకాశాలు వస్తాయని భరోసా కల్పించారు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. విబేధాలు పక్కన పెట్టి ఐక్యంగా ఉంటేనే విజయం సాధిస్తామని అన్నారు. అలాగే ఆర్మూర్‌ పట్టణంలో ఆర్మూర్‌-బాల్కొండ నియోజకవర్గాలను కలిపి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -