జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసి పని చేద్దాం, యావత్ ప్రపంచం ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆయన జర్మనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ దేశాల రాజకీయ పార్టీలను ఒకచోట చేర్చి పురోగమన ఆలోచనా దిశలో నడిపించే మీ కృషిని మేము ఎంతో అభినందిస్తున్నామని జర్మన్ ప్రతినిధులకు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ రైట్ వింగ్ భావజాలం ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు, వాటి విలువలకు ప్రమాదం కలిగిస్తుందనీ, ఈ భావజాల వ్యాప్తి వల్ల ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. స్వేచ్ఛ, న్యాయం, ఐక్యత అనే సిద్ధాంతాలతో నడిచే సోషియల్ డెమోక్రటిక్ పార్టీ స్వతంత్ర సంస్థలా పని చేస్తూ ప్రపంచంలోని పలు రాజకీయ పార్టీలతో కలిసి ప్రోగ్రెసివ్ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం చాలా అభినందనీయమని చెప్పారు. సోషియల్ డెమోక్రటిక్ పార్టీకి 160 ఏండ్ల చరిత్ర ఉందని తెలిసి ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్‌కు కూడా వందేండ్ల చరిత్ర ఉన్నదని తెలిపారు.
ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకు రావటంతో పాటు దేశ నిర్మాణంలో అత్యంత కీలకంగా నిలిచిన పార్టీకి చెందిన వారమని భట్టి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని మీరు కలవడం మాకు ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రొగ్రెసివ్ భావజాల వ్యాప్తికి కషి చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ మార్గ దర్శకత్వంలో ఇటీవల హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించగలిగామనీ, అందులో 100కు పైగా దేశాలు పాల్గొని ప్రొగ్రెసివ్ ఆలోచనలు, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై విస్తత చర్చలు చేశాయని చెప్పారు. రైట్ వింగ్ భావజాలం వల్ల ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కల్గిస్తోందని తెలిపారు.
విద్వేశ భావం ప్రబలుతోందనీ, స్వేచ్ఛాభిప్రాయాలు లేకుండా బలవంతంగా వారి అభిప్రాయాలను, భావాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోందని వివరించారు. దీనివల్ల దేశంలోనే కాదు ప్రపంచమంతటా ఆందోళనలు, అస్థిరత పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను నమ్మే వాళ్లందరికీ ఇది బాధాకర విషయమని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ”విజన్ 2047 డాక్యుమెంట్ ను తీసుకువస్తోందనీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే ప్రజాప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, బలరామ్ నాయక్, సురేష్ షెట్కార్, జర్మనీకి చెందిన ఫ్రెడ్రిచ్ ఈబర్ట్ స్టిఫ్టింగ్ సంస్థకు చెందిన ప్రతినిధులు డాక్టర్ సబీనా, మిక్రో గ్యాంథర్, క్రిస్టోఫస్, మాండ్వి కులక్షేత్ర, అనురాగ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.



