వికలాంగుల కోసం ఏర్పాటు చేయబడిన గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాదు, అవి జ్ఞానం, ఆత్మవిశ్వాసం, సామాజిక సమ్మిళితానికి శక్తివంతమైన సాధనాలు. 2011 భారత జనగణన ప్రకారం మన దేశంలో సుమారు 50 లక్షల మంది దష్టి లోపం ఉన్న వ్యక్తులు ఉన్నారు. వీరి జీవితాల్లో వెలుగులు నింపడానికి సమాచార లభ్యతను మెరుగుపరచడం అత్యవసరం. జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) కూడా అందరికీ అందుబాటులో ఉండే సమగ్ర విద్యను నొక్కి చెబుతోంది. ఈ క్రమంలో, ప్రత్యేక గ్రంథాలయాలు విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను పూరించి, దష్టి లోపాన్ని అడ్డంకిగా కాకుండా ఒక ప్రత్యేక స్థితిగా పరిగణిస్తూ, వారికి సమాన అవకాశాలను కల్పిస్తున్నాయి.
గ్రంథాలయాల ప్రాముఖ్యత, సామాజిక ప్రభావం: ఈ గ్రంథాలయాలు వికలాంగులను సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టే మూలస్తంభాలు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం నుండి సాహిత్య రసాస్వాదన వరకు ఇవి ఎంతో తోడ్పడతాయి. కేవలం చదవడం మాత్రమే కాకుండా, ఈ కేంద్రాలు సామాజిక పరస్పర చర్చలకు వేదికలవుతాయి. పఠన సమూహాలు, రచయితలతో సమావేశాలు మరియు చర్చా వేదికల ద్వారా దష్టిహీనుల్లో ఉండే ఏకాంత భావన తొలగిపోయి, సంఘీభావం పెరుగుతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతో కీలకం.
బ్రెయిలీ నుండి ఆధునిక డిజిటల్ వరకు: నేటి గ్రంథాలయాలు సాంకేతికతను అందిపుచ్చుకుని బహుముఖ వనరులను అందిస్తున్నాయి.

బ్రెయిలీ పుస్తకాలు: స్పర్శ ద్వారా చదివే ఈ పద్ధతి ప్రామాణికమైనది. నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (NAB) వంటి సంస్థలు తెలుగుతో సహా అనేక భాషల్లో పాఠ్యపుస్తకాలను, సాహిత్యాన్ని బ్రెయిల్ రూపంలో అందుబాటులోకి తెస్తున్నాయి.
ఆడియో పుస్తకాలు: ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన రూపం. ‘సుగమ్య పుస్తకాలయ’ వంటి డిజిటల్ గ్రంథాలయాలు లక్షలాది ఆడియో పుస్తకాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా DAISY(డిజిటల్ యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ఫార్మాట్ నావిగేషన్ సౌలభ్యాన్ని కల్పిస్తుంది.
సహాయక సాంకేతికత: స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్ (JAWS, NVDA), మొబైల్ యాప్స్ (TalkBack) డిజిటల్ సమాచారాన్ని మాటలుగా మారుస్తాయి. ప్రభుత్వ ADIP పథకం ద్వారా ఇటువంటి పరికరాలను పొందేందుకు ఆర్థిక సహాయం అందుతోంది.
విద్యా వెలుగులు: మోడల్ స్కూల్ (MSVH): డెహ్రాడూన్‌లోని మోడల్ స్కూల్ ఫర్ ది విజువలీ హ్యాండిక్యాప్డ్ (MSVH) అంగ వైకల్యం వున్న పిల్లల కోసం ఒక ఆశాదీపం. ఇది బాలవాటిక నుండి 12వ తరగతి వరకు ఉచిత విద్యావకాశాలను కల్పిస్తుంది. ఇక్కడ విద్యార్థులకు ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్, యూనిఫారమ్లు, విద్యా పరికరాలు అందించబడతాయి. కేవలం పాఠ్యాంశాలే కాకుండా సంగీతం, క్రీడలు, ఇతర జీవన నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని ఆత్మనిర్భర పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాల ద్వారా 243 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు.
సమాచార ప్రాప్యత: ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలు: సమాచారాన్ని పొందడం అనేది సాధికారతకు మొదటి మెట్టు. భారత ప్రభుత్వం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిసెబిలిటీస్ (NIEPVD) ద్వారా అనేక చర్యలు చేపట్టింది. సుమారు 10,000 పేజీల ప్రభుత్వ దస్తావేజులు, చట్టపరమైన సమాచారాన్ని సులభంగా చదవగలిగే రూపంలోకి మార్చడానికి NAB తో ఒప్పందం చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం ద్వారా మొబైల్ యాప్‌లను మరింత అందుబాటులోకి తెస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు తమ అర్హతను గుర్తించడానికి AI ఆధారిత మార్గదర్శినిలను అభివద్ధి చేయడం ఒక విప్లవాత్మక అడుగు.

బ్రెయిలీ ఉత్పత్తి, జాతీయ మౌలిక సదుపాయాలు: బ్రెయిలీ సాహిత్యాన్ని ముద్రించడానికి దేశవ్యాప్తంగా బలమైన వ్యవస్థ ఉంది. 1951లో స్థాపించబడిన కేంద్ర బ్రెయిలీ ప్రెస్, చెన్నైలోని ప్రాంతీయ బ్రెయిలీ ప్రెస్‌తో పాటు మరో 25 ప్రెస్‌లు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇవి తెలుగు సహా 14 భారతీయ భాషల్లో సాహిత్యాన్ని ప్రచురిస్తున్నాయి.
జాతీయ సుపరిచిత గ్రంథాలయం (National Accessible Library): ఇది 55,000 కంటే ఎక్కువ మంది సభ్యులకు సేవలందిస్తోంది. ఇందులో సుమారు 1.5 లక్షల బ్రెయిల్ వాల్యూమ్‌లు వేల సంఖ్యలో ఆడియో శీర్షికలు ఉన్నాయి. అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ అయిన ‘సుగమ్య పుస్తకాలయ’ ద్వారా 6.7 లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
IGNOU, న్యూఢిల్లీ: వికలాంగులతో సహా అభ్యర్థులందరికీ వారి ఇంటి వద్దకే నాణ్యమైన విద్యను అందించాలి అనే లక్ష్యంతో నవంబర్ 2006లో IGNOU నేషనల్ సెంటర్ ఫర్ డిసేబిలిటీ స్టడీస్‌ను స్థాపించింది. వికలాంగుల సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమాజంలో వారు ప్రధాన స్రవంతిలో చేరడానికి సహాయపడేలా వారి నైపుణ్యాలను అభివద్ధి చేయడం ఈ కేంద్రం ప్రత్యేక ఉద్దేశ్యం.
విశ్వవిద్యాలయాల చొరవ: ఢిల్లీ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU), టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS), సెయింట్ జేవియర్స్ కాలేజీ (ముంబై) వంటి అనేక సంస్థలు, విశ్వవిద్యాలయాలు దివ్యాంగుల కోసం సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న దివ్యంగా విద్యార్థులు, పరిశోధకులు, సిబ్బంది కోసం ఇటువంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడంలో కొన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఇప్పటికే విజయం సాధించాయని దీని ద్వారా స్పష్టమవుతోంది. అదేవిధంగా ప్రతి విశ్వవిద్యాలయం గ్రంథాలయాలలో, బ్రెయిలీ పుస్తక వనరులు అందరికి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ప్రతి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బ్రెయిలీ పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చరిత్రలో గొప్ప మార్పు ఏమంటే సంగారెడ్డి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దివ్యాంగులకు ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు చేయడం మంచి పరిణామం దీనిని అన్ని జిల్లాలకు విస్తరించవలసిన అవసరం ఉన్నది.
స్వావలంబన దిశగా అడుగులు: ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థల ఉమ్మడి కషితో వికాలంగులు నేడు విద్యా, ఉద్యోగ రంగాల్లో రాణిస్తున్నారు. టెక్నాలజీ అడ్డంకులను తొలగిస్తుండటంతో వారు స్వతంత్రంగా సమాచారాన్ని సేకరించగలుగుతున్నారు. విజన్ దివ్యాంగ్ ఫౌండేషన్ వంటి సంస్థల సహకారంతో ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం సహాయం అందించడం మాత్రమే కాదు, వారిని దేశాభివద్ధిలో భాగస్వాములను చేయడం.
వికాలాంగుల గ్రంథాలయాలు, విద్యా సంస్థలు కేవలం సేవా కేంద్రాలు కావు, అవి సామాజిక మార్పుకు చోదక శక్తులు. బ్రెయిలీ నుండి AIవరకు సాగిన ఈ ప్రయాణం వారి జీవితాల్లో చీకటిని తొలగిస్తోంది. అయినప్పటికీ, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రత్యేక శిక్షణ పొందిన లైబ్రేరియన్ల నియామకంపై మరింత దష్టి సారించాల్సి ఉంది. ప్రతి దష్టి లోపం ఉన్న వ్యక్తి జ్ఞాన శక్తిని పొంది, గౌరవప్రదమైన, ఉత్పాదక జీవనాన్ని గడపగలిగినప్పుడే మనం నిర్మించాలనుకున్న సమగ్ర సమాజం సాధ్యమవుతుంది. అక్షరం తోడుంటే చీకటి కూడా వెలుగుగా మారుతుందనడానికి ఈ గ్రంథాలయాలే నిదర్శనం.
– డా|| రవికుమార్ చేగొని, 9866928327



