Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeసోపతిగ్రంథాలయ జ్ఞాన దీప్తి శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం

గ్రంథాలయ జ్ఞాన దీప్తి శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం

- Advertisement -

తెలుగు జాతికి భాష కేవలం భావ వినిమయ సాధనం కాదు, అది వారి ప్రాణశక్తి, అస్తిత్వానికి మూలం. తెలుగు ప్రజల సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ చైతన్యానికి ఒక మహత్తరమైన సాధనంగా, తెలుగు భాషా ఉద్యమం దీర్ఘ పయనంలో గ్రంథాలయాల పాత్ర అపారమైనది. ఈ పయనాన్ని పోషించి, తరాల తరబడి వ్యాప్తి చేయడంలో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఒక అమూల్యమైన సాంస్కృతిక వారధిగా నిలిచింది.

1901లో భాగ్యనగరంలో స్థాపించబడిన ఈ జ్ఞాన మందిరం, కేవలం పుస్తకాలను నిలవ చేసుకునే కేంద్రంగా మాత్రమే కాకుండా, తెలుగు జాతిని జాగృతం చేసి, వారిలో సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఒక శక్తివంతమైన ప్రేరణగా రూపాంతరం చెందింది. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమానికి ఇది ఒక మకుటాయమానమైన ప్రతీకగా నిలిచి, 125 సంవత్సరాల నుండి కొనసాగుతూ తెలుగు సాంస్కృతిక నిలయానికి బలమైన స్తంభంలా నిలిచింది.
ఈ మహత్తర సంస్థ ప్రారంభం 1901 సెప్టెంబర్‌ 1న, రావిచెట్టు రంగారావు గారి రామకోటి నివాసంలో ఆరంభమైంది. నిజాం పాలన కాలంలో హైదరాబాద్లో ఉర్దూ భాషా ప్రాబల్యం అధికంగా ఉన్న తరుణంలో, తెలుగు భాషాభిమానులు తమ మాతభాష ప్రాముఖ్యతను నిలిపి ఉంచేందుకు ఇలాంటి కేంద్రం అవసరాన్ని గుర్తించారు. ఆ సమావేశానికి పాల్వంచ సంస్థానాధిపతి పార్థసారధి అప్పారావు, సవాయి అశ్వరావు, బి. సర్ఫరాజ్‌ పంత్‌ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశంలో యువ మేధావులైన ఆదిరాజు వీరభద్రరావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ముత్యాల గోవిందరాజులు నాయుడు వంటివారు సంస్థ భవిష్యత్‌ లక్ష్యాలను రూపొందించారు. ఈ సంస్థ స్థాపన వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం, తెలుగు ప్రజలకు తమ భాషా వారసత్వాన్ని పరిచయం చేయడం, వారిలో సాహిత్య అభిరుచిని పెంచడం, రాజకీయ చైతన్యాన్ని ప్రోత్సహించడం. ఆర్థిక పునాదులు కూడా ప్రారంభ దశలోనే బలంగా వేయబడ్డాయి. నాయని వెంకటరంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు వంటి నాయకులు తమ ఉదారతతో ఈ సంస్థకు ఆర్థిక మద్దతు నిచ్చి, దాని స్థిరత్వానికి కారకులయ్యారు. ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ దీనిని ‘హైదరాబాద్‌ తెలుగు ప్రాణనాడి’గా వర్ణించారు. అది దాని నిజమైన ప్రాముఖ్యతను ఎత్తిచూపింది.

భాషా నిలయం కేవలం ఒక ఆలోచనగా కాకుండా, ఒక భౌతిక రూపం సంతరించుకోవడానికి అనేకమంది దాతల సహకారం అనిర్వచనీయం. సంస్థకు సొంత భవనం నిర్మించాలనే కల సాకారం కావడానికి రావిచెట్టు రంగారావు సతీమణి లక్ష్మీనరసమ్మ గారు మూడు వేల రూపాయల ఉదార విరాళంతో పునాది వేశారు. అప్పటి కాలంలో ఇది ఒక పెద్ద మొత్తం. తరువాతి సంవత్సరాలలో, మునగాల రాజా, కర్పూరం పార్థసారథి ఫౌండేషన్‌ వంటి సంస్థల సహకారంతో 1921లో సుల్తాన్‌ బజార్లో సొంత భవనం నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ నూతన భవనం తెలుగు ప్రజల ఆకాంక్షలకు నిదర్శనంగా నిలిచింది. ఈ భవనాన్ని విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి ప్రారంభించారు. సంస్థ ప్రాముఖ్యతను ప్రాచుర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి, దాని 125 వసంతాల ప్రస్థానంలో అనేక ఘనోత్సవాలను జరుపుకుంది. 1925లో రజతోత్సవాలు, ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రాంతం నుండి 63 గ్రంథాలయాల (భాషా నిలయాల) ప్రతినిధులు హాజరు అయ్యారు. వారిలో కోదండ రామారావు, ఎం రాజగోపాల మొదలియార్‌, వీర రాఘవమ్మ ట్రూ బజార్‌లో ఉన్న ఆంధ్ర సోదరీ సమాజ గ్రంథాలయం నుండి హాజరయ్యారు. రామచంద్రరావు, వెంకట వర సింహాచార్యులు, నెమలికంటి వెంకట కష్ణారావు, ఉన్నవ వెంకట్రామయ్య, నారాయణ వర్మ, సాల్వేగు రామయ్య, వారణాసి శేషగిరిరావు, పరచారంగారావు, తూము వరదరాజులు, జి రామయ్య, పులిజాల రంగారావు, మల్లెల లక్ష్మీనరసింహారావు, కంకిపాటి అచ్యుతరావు, మిర్యాల నారాయణరావు గుప్తా, జి రాధాకష్ణమూర్తి, చెన్నం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రజితోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సంచికలో తెలంగాణలో ఆనాటికే ఏర్పాటు చేయబడ్డ 63 గ్రంథాలయాలు వాటి కార్యదర్శులు ఏ ఏ గ్రామంలో భాషా నెలలు స్థాపించబడ్డవి అదేవిధంగా సభ్యుల సంఖ్య, ఆ గ్రంథాలయాల దగ్గర ఉన్న ఆదాయ వనరులు కూడా పేర్కొన్నారు. ఈ గ్రంథాలయ అభివద్ధికి తెలుగు వారు మాత్రమే కాకుండా గుజరాతీలు, మార్వాడిలు కూడా సహాయ సహకారాలు అందించారు. శ్రీ వామన రామచంద్రనాయక్‌, రాజా ధనరాజ జాకిర్దారు 200 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

స్వర్ణోత్సవాలు 1952 సెప్టెంబరు 1 నుండి మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆస్థానకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ప్రారంభోత్సవం చేశారు. ఉత్సవాలలో భాగంగా ఆనాటి తెలంగాణలోని 114 గ్రంథాలయాల ప్రతినిధుల సమావేశం, స్త్రీల సభ, వైజ్ఞానిక సభ, సాహిత్య సభ, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ సంచికను ప్రచురించారు.
వజ్రోత్సవాలు 1962 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య అధ్యక్షతన, మూడు రోజుల ఉత్సవాలలో వివిధ సాహిత్య, సాంస్కతిక విషయాలపై చర్చలు, గోష్ఠులు జరిగాయి. వజ్రోత్సవ సంచికను ప్రచురించారు. భాషా నిలయపు అమతోత్సవం 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేతత్వంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో యావదాంధ్ర దేశం నుంచి వచ్చిన అనేకమంది రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
1952 నాటకి 8946 పుస్తకాలు ఈ గ్రంథాలను అందుబాటులో ఉన్నాయి వాటిలో నిఘంటువులు, కథలు, పద్య కావ్యాలు, జీవిత చరిత్రలు, భాషా శాస్త్రములు, ప్రకతి శాస్త్రం, వైద్యశాస్త్రం, వేదాంత శాస్త్రం, సంస్కతం, బాల వాంగ్మయం, దేశ చరిత్రలు, నాటకాలు, విమర్శనలు, శతకాలు, పరామర్శ గ్రంథం, గేయాలు తదితరములు కలవు.
శతాబ్ది ఉత్సవాలు 2002 సెప్టెంబర్‌ 16వ తేదీన భాషా నిలయం ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. 2009లో శ్రీకష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ది వేడుకలు ఈ సంస్థ వైభవాన్ని మరింత ఎత్తుకు చేర్చాయి.
ఈ నిలయం ప్రధాన ఆభరణం దాని అపారమైన గ్రంథ సంపద. ప్రస్తుతం ఇక్కడ 53,000కు పైగా విలువైన పుస్తకాలు, పత్రికలు జ్ఞానపిపాసువులకు సేవలందిస్తున్నాయి. కేవలం తెలుగు భాషా గ్రంథాలకే పరిమితం కాకుండా, సంస్కతం, తమిళం, ఉర్దూ, కన్నడం వంటి భాషల్లోనూ విలువైన గ్రంథాలున్నాయి. ఈ బహుభాషా సంపద భాషా నిలయం సమన్వయ స్ఫూర్తికి నిదర్శనం. ఇరవైకి పైగా దినపత్రికలు, మాసపత్రికలు నిత్యం వార్తలు, వ్యాసాలతో పాఠకుల అవసరాలను తీరుస్తున్నాయి. ముఖ్యంగా భారతి, ఆంధ్రపత్రిక, కష్ణపత్రిక, తెలుగు స్వతంత్ర, సందర్శిని, జయంతి, కెన్నెర, గహలక్ష్మి, శారద, ప్రతిభ, సుజాత, సాహితి, గోల్కొండ, విజ్ఞాన సేద్యం వంటి అరుదైన చారిత్రక పత్రికలు, ఉగాది సంచికలు ఇక్కడ లభ్యమవుతాయి.
ఇవి కేవలం అక్షరాల సముదాయం మాత్రమే కాకుండా, ఆయా కాలాల నాటి సామాజిక, రాజకీయ, సాహిత్య చరిత్రకు ఒక అపారమైన ఆధార భాండాగారంగా నిలుస్తున్నాయి. పరిశోధకులకు, చరిత్రకారులకు ఇవి అమూల్యమైన వనరు. ఈ గ్రంథ సంపదను మరింత వ్యవస్థీకరించడానికి, 1972లో బెజవాడ గోపాలరెడ్డి పేరుతో స్థాపించబడిన రిఫరెన్స్‌ విభాగం, పరిశోధకులకు ఒక కొత్త వేదికను అందించి, వారి అధ్యయనాలకు అవసరమైన సౌకర్యాలను కల్పించింది.
శ్రీకష్ణదేవరాయ భాషా నిలయం కేవలం పుస్తకాల నిల్వగదిగా ఉండటంతోనే సంతప్తి చెందలేదు. అది సాహిత్య, సాంస్కతిక కేంద్రంగా వెలిసింది. ఇక్కడ నిరంతరం జరిగే సాహిత్య సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు, కథా కాలక్షేపాలు తెలుగు సాహిత్య అభివద్ధికి నూతన ఉత్సాహాన్ని, సజనాత్మక శక్తిని అందించాయి. ఈ కార్యక్రమాలు రచయితలకు, పాఠకులకు ఒక వేదికగా మారి, వారి మధ్య సాహిత్య సంబంధాలను పెంచాయి. మహిళలకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, పిల్లలకోసం కథా కాలక్షేపాలు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడం వంటి క్రియాశీలక కార్యక్రమాల ద్వారా దాని సామాజిక పరిధి మరింతగా విస్తరించింది. ఈ చర్యలు యువతలో, మహిళల్లో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచాయి. కట్టమంచి రామలింగారెడ్డి, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకష్ణన్‌, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు, దువ్వూరి రామిరెడ్డి వంటి మహనీయుల సందర్శనలు ఈ సంస్థ గౌరవాన్ని మరింతగా పెంచి, దాని ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా ఎత్తి చూపాయి. ఈ గ్రంథాలయం అనేకమంది మహానుభావులకు స్ఫూర్తి కేంద్రంగా పనిచేసింది.
ఈ గ్రంథాలయ ప్రభావం సాహిత్య పరిధిని దాటి, రాజకీయ, సామాజిక చైతన్యానికి ఒక వేదికగా విస్తరించింది. నిజాం ప్రభుత్వ కాలంలో ఉర్దూకు ప్రత్యామ్నాయంగా తెలుగు భాష అవసరాన్ని ఇక్కడే చర్చించారు. నిజాం ప్రభుత్వ నియంత్రణకు వ్యతిరేకంగా తెలుగు భాషాభిమానులు ఇక్కడ సమావేశమై, తమ హక్కుల కోసం పోరాడారు. మత వివాదాలకు దూరంగా, ముస్లిం, క్రైస్తవ సభ్యులను కూడా చేర్చుకోవడం ద్వారా ఇది సామాజిక సమన్వయం, సమగ్రతకు ప్రతీకగా నిలిచింది. ఇది కేవలం ఒక గ్రంథాలయంగా కాకుండా, ఒక నిశ్శబ్ద రాజకీయ కేంద్రంగా కూడా పనిచేసింది, ఇక్కడ స్వాతంత్య్ర పోరాట యోధులు, సామాజిక కార్యకర్తలు సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణలను చర్చించారు. తెలంగాణ ఉద్యమాల తరువాత కూడా, ఇది తెలంగాణ సంస్కతికి ఒక గుర్తింపును ప్రతిబింబిస్తూ, దేశవ్యాప్తంగా పరిశోధకులకు తన విలువైన సేవలను అందిస్తూనే ఉంది.
అయితే, ఈ సంస్థ తన దీర్ఘ పయనంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యంగా, 1908లో మూసీ నది భయంకరమైన వరదల సమయంలో విలువైన గ్రంథసంపదలో కొంత భాగం నష్టపోవడం బాధాకరమైన విషయం. ఆ సమయంలో అనేకమంది తెలుగు భాషాభిమానులు తమ వ్యక్తిగత సేకరణలను సంస్థకు విరాళంగా ఇచ్చి, దాని మనుగడకు సహాయపడ్డారు. ప్రస్తుతం డిజిటల్‌ యుగంలో, పాఠకుల అవసరాలు వేగంగా మారుతున్నాయి. అపారమైన గ్రంథ సంపదను డిజిటలైజ్‌ చేయడం, ఆధునిక డిజిటల్‌ వనరులను అందుబాటులోకి తెచ్చుకోవడం, పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను పెంపొందించడం, ఉచిత ఇంటర్నెట్‌ వసతులు, డిజిటల్‌ లైబ్రరీ సేవలు అందించడం వంటి కొత్త దిశల్లో ముందడుగు వేయడం అత్యవసరం. ఇవి అన్నీ ఈ సంస్థను మరింత ప్రజా-కేంద్రితంగా, సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చగలవు.
శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం తెలుగు భాషా సంరక్షణ, అభివద్ధి, రాజకీయ చైతన్యం, సామాజిక సమన్వయం కోసం 125 సంవత్సరాలుగా నిరంతరం సేవలు అందిస్తున్న ఒక జీవంతమైన జ్ఞాన మందిరం. ఇది తెలుగు సంస్కతి కీర్తి కిరీటంలోని రత్నం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తనను తాను అనుసంధానించుకుని, తన చారిత్రక లక్ష్యాలను సమకాలీనంగా కొనసాగిస్తూ ఉంటే, భవిష్యత్‌ తరాలకు ఇది ఒక అజరామరమైన జ్ఞాన ప్రదీపంగా శాశ్వతంగా వెలుగొందుతుంది.
– డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad