Sunday, November 16, 2025
E-PAPER
Homeసోపతిగ్రంథాలయాల పునరుజ్జీవన వ్యూహం

గ్రంథాలయాల పునరుజ్జీవన వ్యూహం

- Advertisement -

గ్రామీణ భారతదేశంలో గ్రంథాలయాలు కేవలం పుస్తక కేంద్రాలుగా కాకుండా, సామాజిక, విద్యా విప్లవాలకు కేంద్రాలుగా పనిచేయగలవు. ఒకప్పుడు జాతీయోద్యమ చైతన్యాన్ని రగిలించిన కేంద్రాలుగా, ఇవి నేడు కూడా విద్య, ఉపాది, తాత్విక అన్వేషణకు సహాయపడతాయి. ముఖ్యంగా గ్రామీణ యువతకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు, ఈ గ్రంథాలయాలు విజ్ఞాన సోపానాలుగా మారుతున్నాయి. తెలంగాణ వంటి రాష్ట్రాలలో ఉద్యోగ నియామకాల ప్రకటనల తర్వాత, గ్రామీణ యువత గ్రంథాలయాలకు బారులు తీరడం, పనిగంటలు పెంచాలని డిమాండ్‌ చేయడం ఈ గ్రంథాలయాల ప్రాధాన్యతను తెలియజేస్తోంది. స్థానిక గ్రంథాలయ పన్నులు, ప్రభుత్వ కేటాయింపుల ద్వారా నడుస్తున్న ఈ గ్రంథాలయాలు, గృహిణులు, పరిశోధకులు, కవులు, కళాకారులు అందరికీ సమాచార ప్రాప్యత కల్పించడంలో కీలక పాత్ర పోషించాలి.

భారతదేశంలోని గ్రంథాలయ వ్యవస్థ ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రతి సంవత్సరం నవంబర్‌ 14-20 తేదీల మధ్య జరిగే జాతీయ గ్రంథాలయ వారం దేశంలోని గ్రంథాలయాల ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది. అయితే, ఈ వేడుకలు, వాస్తవాల మధ్య ఒక పెద్ద ఖాళీ ఉంది. దేశంలోని పబ్లిక్‌ లైబ్రరీలు నిధుల కొరత, అసమర్థమైన మౌలిక సదుపాయాలు, పాలనాపరమైన నిర్లక్ష్యం వంటి ప్రాథమిక సమస్యలతో పోరాడుతున్నాయి.

సంఖ్యల్లో నిజం: రాజా రామ్మోహన్‌ రాయ్‌ లైబ్రరీ ఫౌండేషన్‌ (RRRLF) డేటా ప్రకారం, దేశంలో కేవలం 47,000 పబ్లిక్‌ లైబ్రరీలు మాత్రమే నమోదు చేయబడ్డాయి. భారతదేశం లాంటి విశాలమైన, జనసాంద్రత కలిగిన దేశంలో, ఈ సంఖ్య చాలా అపర్యాప్తమైనది. ఇది మన దేశ విద్య, సమాచార అవసరాలను పూరించడంలో తీవ్రమైన అంతరాన్ని సూచిస్తుంది.
అంతర్జాతీయ లక్ష్యాలు, భారతీయ వాస్తవాలు: 2022 IFLA-UNESCO పబ్లిక్‌ లైబ్రరీ మానిఫెస్టో ప్రకారం, ప్రతి 1,000 మంది జనాభాకు ఒక గ్రంథాలయం ఉండాలి. ఈ ప్రమాణాన్ని భారతదేశ 1.4 బిలియన్ల జనాభాతో పోలిస్తే, మనకు కనీసం 1.4 మిలియన్‌ (14 లక్షల) లైబ్రరీలు అవసరమని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న 47,000 లైబ్రరీలతో పోలిస్తే, ఇది దాదాపు 30 రెట్లు ఎక్కువ! ఈ అంతరం మనం సమాచార సమానత్వం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత దూరంలో ఉన్నామో తెలుపుతుంది.

ప్రపంచంతో పోలిక – నేర్చుకోవాల్సిన పాఠాలు: ప్రపంచంలోని అనేక అభివద్ధి చెందిన దేశాలు గ్రంథాలయాలను జ్ఞాన కేంద్రాలుగా మార్చడంలో విజయం సాధించాయి.
సింగపూర్‌: ఇక్కడ 78% మంది ప్రజలు నియమితంగా లైబ్రరీలను సందర్శిస్తారు. సింగపూర్‌ లైబ్రరీలు 3D ప్రింటింగ్‌, రోబోటిక్స్‌ వర్క్‌షాపులు, డిజిటల్‌ స్టూడియోలు, సామాజిక సమావేశాలను నిర్వహించే ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంటాయి.
ఫిన్లాండ్‌: ఇక్కడ లైబ్రరీలను ‘సామాజిక రాజధాని’గా పరిగణిస్తారు. ప్రజలు చదవడం, పని చేయడం, విశ్రాంతి తీసుకోవడం, సామాజికంగా కలవడం కోసం ఇవి ప్రధాన కేంద్రాలు.

భారతదేశంలో క్షీణతకు కారణాలు, డిజిటల్‌ మార్పు: స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వలన యువత ఆడియో-విజువల్‌ కంటెంట్‌ (YouTube, e-books) వైపు మొగ్గు చూపుతున్నారు.
సాంకేతిక వెనుకబాటుతనం: చాలా లైబ్రరీలలో ఇంటర్నెట్‌, Wi-Fi, లేదా డిజిటల్‌ లైబ్రరీ వనరులు లేవు.
ఆధునికీకరణ లేకపోవడం: పాత పుస్తక సేకరణలు, సరికొత్త విషయాల లేమి, ఆకర్షణీయంగా లేని వాతావరణం యువతను ఆకర్షించడంలో విఫలమవుతున్నాయి.
భవిష్యత్తు మార్గం- రూపాంతరం మరియు ఆధునికీకరణ: 2022 మానిఫెస్టో గ్రంథాలయాల కొత్త విధిని నిర్వచించింది. అవి కేవలం పుస్తకాల భవనాలు కాకుండా ఇవి కావాలి.
సామాజిక హబ్‌లు: చర్చలు, వర్క్‌షాపులు, సామాజిక కార్యక్రమాల కేంద్రాలు.

డిజిటల్‌ సేవా కేంద్రాలు: ఉచిత ఇంటర్నెట్‌ ప్రాప్యత, ఈ-లెర్నింగ్‌ రిసోర్సులు, డిజిటల్‌ లైబ్రరీ సదుపాయాలను అందించడం.
సృజనాత్మకత, నవోన్మేష కేంద్రాలు: కోడింగ్‌ క్లబ్‌లు, డిజిటల్‌ స్కిల్స్‌ ట్రెయినింగ్‌, సృజనాత్మక వర్క్‌షాపులను నిర్వహించడం.
భారతదేశంలో గ్రంథాలయాలను పునరుజ్జీవింపజేయడం ఒక ఆవశ్యకత. సరైన నిధులు, సాంకేతిక ఆధునికీకరణ, ఒక స్పష్టమైన దృష్టి ద్వారా మాత్రమే గ్రంథాలయాలను 21వ శతాబ్దికి అనుగుణంగా మార్చగలం. డిజిటల్‌ యుగంలో గ్రంథాలయాలు జ్ఞాన ద్వారాలుగా మాత్రమే కాకుండా, సామాజిక మార్పు, వ్యక్తిగత అభివృద్ధికి శక్తివంతమైన సాధనాలుగా మారగలవు.

భారతదేశంలో పౌర గ్రంథాలయాల సేవాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 1968 నుండి ప్రతి సంవత్సరం నవంబర్‌ 14-20 తేదీలను జాతీయ గ్రంథాలయ వారంగా నిర్వహించడం ఒక ముఖ్యమైన స్ఫూర్తిదాయక విజ్ఞానోత్సాహ కార్యక్రమంగా కొనసాగుతోంది. ఈ వారంలో పాఠకులకు, విద్యార్థులకు, పిల్లలకు చదవడాన్ని అలవాటు చేయడం, సమాచారాన్ని విస్తృతంగా తీసుకొచ్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అయినప్పటికీ, దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే సమాచార వనరులు, పబ్లిక్‌ లైబ్రరీల అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. దేశంలోని దాదాపు 6.65 లక్షల గ్రామాలలో నివసిస్తున్న ప్రజలకు సమాచారం, విద్య, సాంస్కతిక వనరులను అందించే పబ్లిక్‌ లైబ్రరీల సంఖ్య తీవ్రంగా తక్కువగా ఉంది. ఇది భారతదేశ సామాజిక, విద్యా రంగాల అభివృద్ధికి పెను అడ్డంకిగా మారింది.

గ్రామీణ గ్రంథాలయాల సంఖ్య, వాస్తవిక పరిస్థితి యొక్క విశ్లేషణ: వివిధ స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం లక్షకు పైగా గ్రంథాలయాలు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నప్పటికీ, ఈ సంఖ్య దేశ విశాలమైన జనాభా అవసరాలను తీర్చడానికి చాలా చాలా తక్కువ. భారతదేశంలో గ్రంథాలయాల పంపిణీలో రాష్ట్రాల వారీగా తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, మహారాష్ట్ర (12,191), కేరళ (8,415), కర్ణాటక (6,798), పశ్చిమ బెంగాల్‌ (5,251) వంటి రాష్ట్రాలు దేశంలో అత్యధిక లైబ్రరీలు కలిగినవిగా ఉన్నప్పటికీ, పంజాబ్‌ (15), ఉత్తరాఖండ్‌ (47), మేఘాలయ (8) వంటి రాష్ట్రాలు, అనేక కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ అసమాన పంపిణీ అభ్యాస అవకాశాల సమానత్వానికి ఆటంకం కలిగిస్తోంది.

అంతర్జాతీయ ప్రమాణాలు, భారతీయ లోటు: గ్రంథాలయాల లభ్యతపై అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలిస్తే, IFLA-UNESCO 2022 పబ్లిక్‌ లైబ్రరీ మానిఫెస్టో కనీసం ప్రతి 1000 మందికి ఒక గ్రంథాలయం ఉండాలని సూచిస్తుంది. ఈ నిష్పత్తిని భారతదేశం సుమారు 130 కోట్ల జనాభా నేపథ్యంలో పరిశీలిస్తే, దేశానికి కనీసం 13 లక్షలకు పైగా పబ్లిక్‌ లైబ్రరీలు అవసరం. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాల సంఖ్య ఈ అవసరానికి దాదాపు 13 రెట్లు తక్కువగా ఉంది. ఇది సమాచార సమానత్వం (Information Equity) అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి భారతదేశం ఇంకా ఎంత దూరంలో ఉందో స్పష్టం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ లోటు వల్ల విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధికి సంబంధించిన కీలక సమాచారానికి పేద ప్రజల ప్రవేశం పరిమితం అవుతోంది.

మానిఫెస్టోతో మారుతున్న లైబ్రరీల పాత్ర, ఆధునిక విధి
: 2022 లో విడుదలైన IFLA-UNESCO మానిఫెస్టోలో, లైబ్రరీలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాకుండా, ఆవిష్కరణ, సృజనాత్మకత, సామాజిక భాగస్వామ్యానికి వేదికలుగా ఉండాలని నొక్కి చెప్పబడింది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (SDGs) సాధనలో మౌలిక అభివృద్ధికి, తత్సంబంధ సమాచారానికి, డిజిటల్‌ వనరులకు ఇప్పుడు పెద్ద ప్రాధాన్యత ఉంది. కోవిడ్‌-19 మహమ్మారి తర్వాత రిమోట్‌ యాక్సెస్‌, ఇంటర్నెట్‌ ఆధారిత వనరులు అత్యవసరంగా మారాయి. అయితే, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ దూరప్రవేశ సేవలు ప్రజల జీవితాల్లో అంతగా స్థానం సంపాదించలేదు. పౌర గ్రంథాలయాలు చాలా తక్కువగా ఉండటంతో పాటు, అక్కడ లభించే పుస్తక వనరులు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేకపోవడం, వాటి సేవలు రూపాంతరం చెందాల్సిన తక్షణ అవసరాన్ని తెలియజేస్తున్నాయి.

ఆర్థిక వనరుల కేటాయింపు, ప్రాంతీయ తేడాలు: గ్రంథాలయాల అభివృద్ధికి రాజా రామ్మోహన్‌ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్‌ (RRLF) ద్వారా 2019 నుండి 2024 వరకు ?662 కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయించబడింది. అయితే, ఈ నిధుల వినియోగంలో ప్రాంతీయ తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు అత్యధిక నిధులను పొందగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వంటి తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు తక్కువగా ఉండటమే కాకుండా, అందులోను పూర్తిగా వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు, గత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం RRLF నిధులను ఏ మాత్రం ఉపయోగించుకోలేకపోవడం నిధుల వినియోగంపై ప్రణాళికా లోపాలు, అప్రమత్తత కొరవడటం, పాలనా బలహీనతలను సూచిస్తుంది.

పౌర గ్రంథాలయాలకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న రాజా రామ్మోహన్‌ రారు లైబ్రరీ ఫౌండేషన్‌ (RRLF) నిధుల కేటాయింపులను పరిశీలిస్తే, 2019 నుండి 2024 వరకు 662 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, రాష్ట్రాలు వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాయి. కేటాయింపులలో కూడా రాష్ట్రాల మధ్య అసమానతలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు పౌర గ్రంథాలయాలకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న రాజా రామ్మోహన్‌ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్‌ నిధుల కేటాయింపులను పరిశీలిస్తే, 2019 నుండి 2024 వరకు 662 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, రాష్ట్రాలు వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాయి. కేటాయింపులలో కూడా రాష్ట్రాల మధ్య అసమానతలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల కేటాయింపు (లక్షల్లో) ఆంధ్రప్రదేశ్‌ (37.87), తెలంగాణ (89.49), 2020-21, ఆంధ్రప్రదేశ్‌ (20.23), తెలంగాణ (36.00), 2022-23లో ఆంధ్ర ప్రదేశ్‌ (44.96), తెలంగాణ (139.95), 2023-24లో ఆంధ్రప్రదేశ్‌ (30.00), తెలంగాణ (92.54) .

తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, నిధుల వినియోగంలో రాబట్టుకోవడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. నేషనల్‌ మిషన్‌ ఆన్‌ లైబ్రరీస్‌ (NML)) మోడల్‌ లైబ్రరీ ప్రాజెక్ట్‌ కింద కేటాయించిన దాదాపు 952 కోట్ల రూపాయలలో, రాష్ట్రాలు కేవలం 405 కోట్ల రూపాయలు మాత్రమే ఉపయోగించుకున్నాయి. అంతేకాకుండా, అనేక రాష్ట్రాలు గ్రంథాలయ పన్ను Library Cess ద్వారా ప్రజల నుండి నిధులను వసూలు చేస్తున్నప్పటికీ, వాటిని గ్రంథాలయాలకు కేటాయించడంలో విఫలమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం దాదాపు 1000 కోట్ల రూపాయలు, కర్ణాటక దాదాపు 300 కోట్ల రూపాయలు, మహారాష్ట్ర దాదాపు 800 కోట్ల రూపాయలు గ్రంథాలయాలకు కేటాయించవలసిన బాకీలు ఉన్నాయి. ఈ గ్రంథాలయ సెస్‌ నిధుల దారి మళ్లింపు లేదా కేటాయింపులో ఆలస్యం గ్రంథాలయాల సంక్షోభ స్థితికి ప్రధాన కారణాలలో ఒకటి.

  • డా|| రవికుమార్‌ చేగొని, 9866928327
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -