క్యూ2 లాభాల్లో 32 శాతం వృద్ధి
ఆస్తులు రూ.57.23 లక్షల కోట్లకు చేరిక
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 10 శాతం వృద్ధితో రూ.10,053 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికం లోని రూ.7,620.86 కోట్ల లాభాలతో పోల్చితే ఏకంగా 32 శాతం వృద్ధి చోటు చేసుకోవడం విశేషం. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో ఎల్‌ఐసీ నికర ప్రీమియం ఆదాయం 5.5 శాతం పెరిగి రూ.1.26 లక్షల కోట్లకు చేరింది.
ఎల్‌ఐసీ మొత్తం ఆస్తుల విలువ (ఎయుఎం) 3.31 శాతం పెరిగి రూ.57.23 లక్షల కోట్లకు చేరింది.గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ తొలి ఏడాది ప్రీమియం ఏకంగా రూ.10,884 కోట్లకు పెరిగింది. ఇది గతేడాది ఇదే సమయంలో రూ.7,566 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో రూ.60,179 కోట్లుగా ఉన్న రెన్యూవల్ ప్రీమియం.. గడిచిన క్యూ2లో రూ.65,320 కోట్లుగా నమోదయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థంలో 16 శాతం వృద్ధితో రూ.21,040 కోట్లుగా నమోదయ్యింది. మొత్తం ప్రీమియం ఆదాయం 5 శాతం పెరిగి రూ.2,45,680 కోట్లకు చేరింది. సంస్థ మొత్తం వ్యయాలు 12.74 శాతం నుంచి 11.28 శాతానికి తగ్గాయి.



