Sunday, November 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎల్‌ఐసీని రక్షించాలి

ఎల్‌ఐసీని రక్షించాలి

- Advertisement -

ఏజెంట్లు సైనికుల్లా పని చేయాలి
ఇది ప్రజల కష్టార్జితంతో నిర్మించిన సంస్థ
సీఐటీయు జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు
ఖమ్మంలో ఎల్‌ఐసీ ఏఓఐ
సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ 6వ మహాసభ
నవతెలంగాణ-ఖమ్మం

ఎల్‌ఐసీ రక్షణ కోసం ఏజెంట్లు సైనికుల్లా పని చేయాలని, ఇది దేశ ప్రజల కష్టార్జితంతో నిర్మించబడిన సంస్థ అని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ ఏఓఐ) సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ 6వ మహాసభ శనివారం ఖమ్మం నగరంలోని జీఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో ప్రారంభమైంది. ఈ మహాసభలో సాయిబాబు ప్రారంభోపన్యాసం చేశారు. 1956 ముందు దేశంలో ఉన్న రెండు వందలకు పైగా ప్రయివేట్‌ కంపెనీలు ప్రజల సొమ్మును దోచుకున్నాయన్నారు. ఆ దోపిడీని నివారించి ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలను రద్దుచేసి 1956లో ఎల్‌ఐసీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రజల మెప్పు పొంది రూ.57 లక్షల కోట్ల ఆస్తులతో, 30 కోట్ల మంది పాలసీదారులతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీగా అవతరించిందని వివరించారు. 99.5 శాతం క్లెయిమ్‌ల చెల్లింపు రికార్డుతో నమ్మకమైన ఇన్సూరెన్స్‌ కంపెనీగా ప్రజలకు సేవలు అందిస్తోందని తెలిపారు. భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రయివేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలను ప్రోత్సహించి ఎల్‌ఐసీని ప్రజలకు దూరం చేసే కుట్ర చేపట్టాయని అన్నారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్‌ఐసీనే కాకుండా బ్యాంకులు, రైల్వేలు, బొగ్గు, రక్షణ, విద్యుత్తు మొదలైన అనేక రంగాల్లో కూడా ప్రయివేటు కంపెనీలను ప్రోత్సహించే చర్యలు వేగవంతం చేసిందన్నారు. ఈ చర్యలను అడ్డుకుని ఎల్‌ఐసీని కాపాడేందుకు ఏజెంట్లు సైనికుల్లా పోరాడాలని, మిగతా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులను కూడా కలుపుకొని ఐక్య పోరాటాలు నిర్మించాలని సాయిబాబు పిలుపునిచ్చారు. ఎల్‌ఐసీ అఖిలభారత అధ్యక్షప్రధాన కార్యదర్శులు సురజిత్‌ కుమార్‌ బోస్‌, పిజి.దిలీప్‌ మాట్లాడుతూ.. ఎల్‌ఐసీని ఐపీఓలో లిస్టింగ్‌ చేసిన తర్వాత సంస్థ అభివృద్ధిలో మూల స్తంభంగా ఉన్న ఏజెంట్లకు నష్టం కలిగించే అనేక ప్రతిపాదనలు ముందుకు వచ్చాయన్నారు. గత సంవత్సరం ఏడు శాతం కమీషన్‌ తగ్గించడం ఇందులో భాగమేనని అన్నారు. అది సరిపోదన్నట్టు రాబోయే కాలంలో కమీషన్‌ తగ్గించడంతోపాటు ఇతర సౌకర్యాలకు కోత పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం, ఐఆర్డీఏఐ రెండూ కలిసి ఎల్‌ఐసీ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాయని విమర్శించారు. ఈ చర్యలను తమ యూనియన్‌ వ్యతిరేకిస్తుందని, వీటికి వ్యతిరేకంగా ఎల్‌ఐసీ రక్షణ, ఏజెంట్ల హక్కుల సాధన కోసం భవిష్యత్‌లో ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాలు, ఇతర ఏజెంట్‌ సంఘాలను కలుపుకుని ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని, ఈ పోరాటాల్లో ఏజెంట్లు అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రముఖ వైద్యులు, మహాసభ ఆహ్వాన సంఘం చైర్మెన్‌ డాక్టర్‌ సి.భారవి, యూనియన్‌ జోనల్‌ ప్రధాన కార్యదర్శి పిఎల్‌ నరసింహారావు, ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జోనల్‌ అధ్యక్షులు జి.తిరుపతయ్య, ఎల్‌ఐసీ ఖమ్మం సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ బాలాజీ నాయక్‌ మాట్లాడారు. తొలుత మహాసభ ప్రారంభ సూచకంగా యూనియన్‌ జెండాను ఎల్‌ఐపీ ఏఒఐ జోనల్‌ అధ్యక్షులు ఎల్‌.మంజునాథ్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తాళ్లూరు శ్రీనివాసరావు, తన్నీరు కుమార్‌, ఖమ్మం బ్రాంచ్‌ అధ్యక్ష కార్యదర్శులు పి.ప్రసాద్‌, టి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -