ఒకడున్నాడు. వాడు మంచోడు. సాదాసీదాగా వుంటాడు. సదా చిరునవ్వు నవ్వుతుంటాడు. ఇంకొకడున్నాడు. వాడు మంచోడు మాత్రం కాదు. ఆర్భాటంగా వుంటాడు. వాడి నోరు నవ్వుతున్నట్టుంటుంది కానీ నొసలు వెక్కిరిస్తూ వుంటాయి.
మంచోడు, సాదాసీదాగా వున్నోడు, చిర్నవ్వులు చిందించేవాడు సత్యం. మంచోడు కానివాడు, ఆర్భాటంగా వుండేవాడు, వెటకారంగా నవ్వేవాడు అసత్యం. సత్యాన్ని నిజం అని పిలుస్తారు, అసత్యాన్ని అబద్ధమని కూడా అంటారు. నిజానికి నిజం అంటే అబద్ధానికి అస్సలు పడదు. అబద్ధానికి కూడా నిజం అంటే నిజంగానే అస్సలు పడదు.
నిజమూ అబద్ధమూ బద్ధ శత్రువులు. నిజం వున్నచోట అబద్ధం అస్సలు నిలబడడు. అబద్ధం ఉన్నచోటికి నిజం పొరపాటున కూడా పోడు. ఇద్దరూ తమ పద్ధతులు మార్చుకోరు. నిజం నిజాన్ని తప్ప మరొక దాన్ని నమ్మడు. అబద్ధం అబద్ధాల పునాది మీద తప్ప మరొక దానిమీద విశ్వాసం వుంచడు.
ఊళ్లో వాళ్లతో నిజం స్నేహంగానే వుంటాడు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు. అయితే ఏ విషయంలోనైనా ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతాడు. ఇక ఊరి వారందరితో అబద్ధం కూడా స్నేహంగానే వున్నట్టు కనిపిస్తాడు. ఏ విషయాన్నయినా చిలవలు పలవలు చేసి చెప్తాడు. ఉన్నది లేనట్టుగాను, లేనిది వున్నట్టుగానూ చెప్తాడు. రకరకాల రంగు పులిమి చెప్తాడు. వాడి మాటల్తో జనాన్ని బురిడీ కొట్టిస్తాడు.
నిజం సాదాసీదా మాటలు ఎవరినీ ఆకర్షించవు. చప్పగా వుంటాయి. వినాలనే ఆసక్తి కలిగించవు. విసుగునీ, విరక్తినీ కలిగిస్తాయి. అబద్ధం చెప్పే మాయ మాటలు మాత్రం వినేవాళ్లని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. ఇంకా ఇంకా వినాలనే ఆసక్తిని కలిగిస్తాయి. ఇంకా ఇంకా చెప్పమని బతిమాలుతారు.
ఒకసారి ఊరి పెత్తనం ఎవరికి ఇవ్వాలనే సందర్భం వచ్చింది. ఊరి బాగును కోరుకునే వాళ్లని ఎంచుకుందామనుకున్నారు జనం. కొందరు లోకంలో నిజాన్ని మించిన నిజమేదీ లేదని ‘సత్యమేవ జనం’ కదా అని నిజానికి పెత్తనం ఇద్దాం అన్నారు.
నిజమా! నిజం నిప్పులాంటిదన్నారు. మనకు తెలీకుండా మనల్ని తగలబెడ్తుంది. అయినా ఓ రంగూ రుచీ వాసనా లేని నిజాన్ని నమ్ముకోడం కంటే అబద్ధాన్ని ఆశ్రయించడం మంచిది. అబద్ధం అబద్ధమే అయినా అందరితోనూ తీయగా మాట్లాడుతాడు. అందరికీ నచ్చుతాడు. అందువల్ల రంగు రంగుల రంగులరాట్నంలాంటి అబద్ధాన్ని కాదనుకుని నిజాన్ని నెత్తిన పెట్టుకుని బావుకునేది, బాగుపడేది ఏమీ వుండదని అన్నారు జనం.
రచ్చబండ దగ్గరా, రావి చెట్టు కిందా జనం చర్చలు కొనసాగాయి. నిజానికా, అబద్ధానికా? ఎవరికి ఊరి పెత్తనం అప్పగించాలి? ఎవరు ఊరిని బాగుచేస్తారు అని ప్రశ్నలు వేసుకోసాగారు. ఊరిపెద్ద ఎన్నిక తేదీ సమీపిస్తున్నకొద్దీ జనం అభిప్రాయాలు మళ్లీ మళ్లీ మారసాగాయి. కొందరు తాము మంచివాళ్లమని, నీతి, న్యాయం, ధర్మం తప్పనివారమని అనుకునేవారు ఊరి బాగుకోసం నిజాన్నే ఎన్నుకోవాలని అనసాగారు. ఎవరేమన్నా చివరికి సత్యం అంటే నిజమే గెలుస్తుందని, నిలుస్తుందని, అందువల్ల నిజాన్నే గెలిపిద్దామని ప్రచారం చేయసాగారు. ఇలా మాట్లాడే వాళ్ల నోళ్లు మూయించేవాళ్లు ఊరుకోలేదు. విజృంభించారు. సత్తెకాలపు సత్తయ్య కాలం చెల్లిపోయింది. సత్యాన్ని నమ్ముకున్న హరిశ్చంద్రుడనే వాడు కాలికాపరిగా అష్టకష్టాలు పడ్డాడు. చచ్చే వయసులో శివుడు కనిపిస్తేనేం? పూలదండ మెళ్లో పడితేనేం? ఈ కాలంలో మసిపూసి మారేడుకాయ చేయగలిగినవాడే, నలుగురి నోళ్లల్లో నానే సత్తావున్నవాడే, తిమ్మిని బమ్మిని చెయ్యగలిగినవాడే ఊరికి ఉపకారి అవగలడు. ఊరివాళ్లను ఎక్కడికో తీసుకుపోగలడు అన్నారు మంచోళ్లు అనిపించుకోడం కోసం వెంపర్లాడనివాళ్లు.
ఊరికి మేలు చేయడమే తన ధ్యేయం అని, అవసరమైతే తన పొలం అమ్మి ఆ డబ్బుతో బడి కట్టిస్తానని, ఎవరికి కష్టం వచ్చినా వచ్చి తోడుగా నిలబడతానని, నిజాయితీగా వుంటానని నిజం ఊరి జానానికి చెప్పాడు. అయితే ‘రివర్స్‌గేర్’లో వచ్చాడు అబద్ధం. నిజం నిజాన్ని నమ్ముకుని నిజంగా ఏమీ చేయలేడని, అసలు నిజం మాట్లాడే మాటల్లో నిజమే లేదని, ఊరివాళ్ల కళ్లకు పైకి మంచోడిలా కనిపించే నిజం నిజంగా మంచోడు కాడని, రహస్యంగా పేకాడతాడని, పేకాడేటప్పుడు పీకల్దాకా మందేస్తాడని, మెరిసేదంతా మేలిమి బంగారం కాదని, ఒక్కసారి ఊరి పెత్తనం దక్కితే, నిజం నిజ స్వరూపం బయటపడుతుందని, ఊరూవాడా ప్రచారం చేశాడు అబద్ధం.
ఊరివాళ్లకు అబద్ధం మాటల్లో నిజం కనిపించింది కానీ నిజం మాటల్లో నిజం కనిపించలేదు. నిజం మాట్లాడిన సాదాసీదా మాటలు రుచించలేదు. అబద్ధం మాటల్తో ఊరు ‘సిటీ’గా మారుతుందని, ఊరిజనం లక్షాధికారులవుతారని నమ్మేశారు. రచ్చబండ మీద ఎన్నికలు జరిగాయి. నిజం కోసం ఒక్కచేయీ పైకి లేవలేదు. అబద్ధం కోసం అన్ని చేతులూ గాల్లో ఊగాయి. నిజం ఓడిపోయాడు, అబద్ధం గెలిచాడు.
నిజానికి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడైనా నిజాన్ని అబద్ధమే గెలుస్తుంది. అబద్ధపు హామీలు, గ్యారంటీలు అందర్నీ ఆకర్షిస్తాయి. అసలు అబద్ధమే నిజంలా నిజంగా భ్రమ కలిగించి, నిజాన్నే అబద్ధం చేస్తుంది. నిజానిది తాబేలు నడకయితే అబద్ధానికి కుందేలు పరుగు.
ఇప్పుడు నిజాన్ని నిలువెత్తు గొయ్యిలో పాతిపెట్టి అబద్ధాలు సోషల్ మీడియాలో జనాలకు ‘పూనకాలు లోడింగ్’ చేసే పనిలో వున్నాయి.
- చింతపట్ల సుదర్శన్
9299809212