మనుషులన్నాక పొరపాటు చేయడం సహజం. అయితే అలాంటి పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడాలి. ఒక సారి చేసిన పొరపాటు నుండి గుణపాఠం నేర్చుకోవాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. నలుగురిలో గౌరవం పెరుగుతుంది. అలాంటి ఓ కథనమే ఈవారం ఐద్వా అదాలత్‌లో చదువుదాం…
శ్రీలక్ష్మికి 28 ఏండ్లు వుంటాయి. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే ఇంట్లో వాళ్లు ఏమంటారో అని సందేహం. వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కాక భయపడుతుంది. ఐద్వా అదాలత్ దగ్గరైతే తన సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందని తెలిసి ఐద్వా అదాలత్ కు వచ్చింది. ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అక్కడే ఆమెకు తనతో పాటు పని చేసే నవీన్‌తో పరిచయం అయ్యింది. ఐదేండ్ల వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతుంది. అయితే ఆమెకు అంతకు ముందే పెండ్లి జరిగింది. రమేష్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అప్పుడు ఆమెకు 16 ఏండ్లు. ఇంట్లో వాళ్లు ఈమె ప్రేమకు ఒప్పుకోలేదు. దాంతో 18 ఏండ్లు వచ్చే వరకు ఆగి పెద్దలను ఎదిరించి మరీ ఆర్యసమాజ్ లో పెండ్లి చేసుకుంది.
రమేష్, శ్రీలక్ష్మి ఇంట్లో వాళ్లందరికీ బాగా పరిచయం. అతను అంత మంచివాడు కాదు. చిన్న వయసు నుండే తాగుడు అలవాటు వుంది. అందుకే ఈ పెండ్లికి వాళ్లు ఒప్పుకోలేదు. కానీ శ్రీలక్ష్మి పెద్దల మాట పట్టించుకోకుండా పెండ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లింది. వెళ్లిన తర్వాత మూడు నాలుగు నెలలు బాగానే వుంది. తర్వాత నుండి గొడవలు మెదలయ్యాయి. కానీ ఆమె మాత్రం ”నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను, నా భర్త అత్తమామలు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు, మీరు నాతో మాట్లాడకపోయినా ఇబ్బంది లేదు” అని కావాలని అమ్మనాన్నలకు మెసేజ్ పెట్టేది.
కానీ ఇక్కడ పరిస్థితి దీనికి పూర్త విరుద్ధంగా వుంది. రమేష్ ఉద్యోగం చేయడం మానేశాడు. రోజూ తాగొచ్చి శ్రీలక్ష్మిని విపరీతంగా కొట్టేవాడు. ”ప్రేమించి పెండ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్లు కట్నం ఇవ్వరా, వెళ్లి డబ్బూ బంగారం తీసుకురాపో” అని తిట్టేవాడు. అర్థరాత్రి ఇంట్లో నుండి బయటకు గెంటేసేవాడు. ఈ విషయం తెలిసి ఆమె ఇంట్లో వాళ్లు ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బూ బంగారం ఇచ్చి వెళ్లేవారు. అవి ఉన్నన్ని రోజులు రమేష్ బాగానే ఉండేవాడు. మళ్లీ హింసించడం మొదలు పెట్టేవాడు.
ఇలా ఏడేండ్లు గడిచిపోయింది. రమేష్‌లో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు. పైగా మరింత సైకోలా తయారయ్యాడు. అతని తల్లి దండ్రులు కూడా భరించలేక వాళ్లను ఇంట్లో నుండి పంపించేశారు. కుటుంబం గడవడం కోసం శ్రీలక్ష్మి ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. రమేష్ అక్కడికి కూడా వచ్చి డబ్బులు ఇమ్మంటూ గోలచేసేవాడు. ఇల్లూ రోడ్డూ ఆఫీసు అనే తేడా లేకుండా కొట్టేవాడు. ఆమె ఈ బాధలు భరించలేకపోయి. ”పుట్టింటికి వెళదామంటే ఎదిరించి పెండ్లి చేసుకున్నా, ఏం ముఖం పెట్టుకొని వెళ్లాలి” అని వాళ్లకు చెప్పుకునేది కాదు. కానీ పుట్టింటి వాళ్లు ఆమె బాధలు చూస్తూ వుండలేక వచ్చి తీసుకెళ్లిపోయారు. అయినా శ్రీలక్ష్మి అక్కడ వుండకుండా రమేష్ దగ్గరకు వచ్చేసేది. ఇలా నాలుగైదుసార్లు జరిగింది. దాంటో ఆమె తల్లిదండ్రులకు కూడా కోపం వచ్చింది. చివరకు ”ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో” అన్నారు. ఒకసారి రమేష్, శ్రీలక్ష్మిని బాగా కొట్టి ఇంటి నుండి నెట్టేశాడు. అప్పటి నుండి పుట్టింట్లోనే వుంటుంది. రమేష్ ఆమెను కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇలా వెంటబడితే పోలీస్ స్టేషన్‌లో కేసుపెడతానన్నది. అప్పటి నుండి ఇద్దరూ విడివిడిగానే వుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ప్రేమ అంటే ఇంట్లో వాళ్లు ఏమంటారో అని శ్రీలక్ష్మీ భయపడుతుంది. అందుకే ఐద్వా అదాలత్‌కు వచ్చింది. ”ఒక సారి ప్రేమ అంటూ పెద్ద వాళ్లను కాదని ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు మళ్లీ అలాంటి తప్పు చేయదలచుకోలేదు. అందుకే నవీన్ గురించి మీతో చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటేనే పెండ్లి చేసుకుంటాను. మీరే నాకు సహాయం చేయండి” అన్నది. అంతా విన్న తర్వాత మేము శ్రీలక్ష్మి తల్లిదండ్రులను పిలిచి ”మీ అమ్మాయి నవీన్ అనే అతన్ని ఇష్టపడుతుంది. మీరు ఒప్పుకుంటానంటేనే పెండ్లి చేసుకుంటానంటుంది” అన్నాము. ”ఇప్పటికే చాలా కష్టాలు పడింది. ఆ నవీన్ ఎలాంటి వాడో,అతని కుంటుంబం ఎలాంటిదో మాకు తెలియదు. మంచివాడైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అన్నారు.
మేము నవీన్‌ని పిలిపించి మాట్లాడితే ”నాకు శ్రీలక్ష్మి అంటే చాలా ఇష్టం. తెలిసీ తెలియని వయసులో తప్పు చేసింది. తన గతం మొత్తం నాకు తెలుసు. తనని నేను బాగా చూసుకుంటాను. అయితే రమేష్ నుండి విడాకులు తీసుకుంటే మాకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యా రాకుండా వుంటుంది. ఈ విషయంలో మీరే మాకు హెల్ప్ చేయాలి” అన్నాడు. మేము రమేష్‌ను అతని తల్లిదండ్రులను పిలిచి మాట్లాడి ఇద్దరూ విడాకులు తీసుకొని కొత్త జీవితం మొదలుపెడితే మంచిది అని అర్థమయ్యేలా చెప్పాము. దానికి వాళ్లు అంగీకరించారు. రమేష్, శ్రీలక్ష్మి విడాకులు తీసుకున్నారు. నవీన్, శ్రీలక్ష్మి పెండ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వాళ్లకు ఓ బాబు పుట్టాడు. గతంలో చేసిన పొరపాటు నుండి గుణపాఠం నేర్చుకున్న శ్రీలక్ష్మి జీవితంలో మంచి నిర్ణయం తీసుకొని నవీన్‌ని పెండ్లి చేసుకొని సంతోషంగా వుంటుంది.
వై వరలక్ష్మి, 9948794051



