పెండ్లి అనేది ఒక జంట జీవితాంతం కలిసి బతకాలని చేసుకొనే ప్రమాణం. కానీ అలాంటి బంధాన్ని కూడా చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. చిన్న విషయాలకే విడిపోతున్నారు. ఇక కొందరైతే మూఢనమ్మకాలతో కూడా తమ నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా ఐదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో చదువుదాం…
శిల్పకు 23 ఏండ్లు ఉంటాయి. డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత పీజీ చేయాలనుకుంది. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. రాజుతో పెండ్లి చేశారు. రాజు వాళ్లది పెద్ద కుటుంబం. వారి కుటుంబ సభ్యులతో పాటు రాజు వాళ్ల బాబాయిలు, పెద్దనాన్న పిల్లలు, మేనత్త పిల్లలు మొత్తం అందరూ కలిసి దాదాపు ఒకే దగ్గర 60,70 మంది వరకు ఉంటారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. ఎవరి ఉద్యోగం వారిది. కానీ ఎవరి ఇంట్లో ఏం జరిగినా అందరూ కలిసి మాట్లాడుకుంటారు. శిల్ప, రాజు పెండ్లిలో అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ఇల్లు ఎప్పుడూ సందడిగా వుండేది. ఇంటి వాతావరణం చూసి శిల్ప చాలా సంతోషించింది. ‘ఇక్కడ ఎంత మంది వున్నా ఎలాంటి బేధభావం లేకుండా అందరూ ఎంత బాగా కలిసి ఉంటున్నారు’ అని ఆనందించింది. ఎందుకంటే శిల్ప ఇంట్లో నలుగురు మాత్రమే ఉంటారు. బంధువులు వున్నా ఏదైనా పండగలకీ, ఫంక్షన్‌లకి రావడం ఒకటీ రెండు రోజులు వుండి వెళ్లిపోవడం.
అయితే రాజు, శిల్పకు చాలా విషయాల్లో అబద్దాలు చెప్పాడు. అతను చేసే ఉద్యోగం ఒకటైతే ఇంకొకటి చెప్పి పెండ్లి చేసుకున్నాడు. అలాగే చదువు విషయంలో కూడా అబద్దం చెప్పాడు. ఇల్లు కూడా వాళ్లదే అని చెప్పారు. కానీ ఆ ఇల్లు బంధువులందరి పొత్తులో ఉంది. రెండు గదులు మాత్రమే వీళ్ల వాటా కింద వస్తాయి. ఈ విషయం తెలిసి రాజును అడిగితే ‘అవును ఇది మా తాతయ్య వాళ్లది. ఇందులో అందరికీ వాటా ఉంటుంది’ అన్నాడు. శిల్ప దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అతను చదువు, ఉద్యోగం గురించి తెలిసి అడిగితే ‘ఈ విషయాలన్నీ పెండ్లికి ముందే మీ వాళ్లకు చెప్పాను, వాళ్లు నీకు చెప్పకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది? వెళ్లి వాళ్లను అడుగు’ అన్నాడు. దాంతో శిల్ప తన కుటుంబ సభ్యులను అడిగితే ‘ఇల్లు గురించి అయితే మాకు చెప్పారు కానీ మిగిలిన విషయాలు మాకు చెప్పలేదు. ఎంబీఏ చేశాను, మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను అనే చెప్పాడు’ అన్నారు.
ఇదే విషయంపై శిల్ప తల్లిదండ్రులు రాజు కుటుంబ సభ్యులను అడిగారు. ఇరువైపుల పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నారు. ‘పెండ్లి జరిగిపోయింది, ఇక ఇప్పుడు చేసేది ఏముంటుంది, సర్దుకుపోవాలి’ అన్నారు. అర్థం చేసుకున్న శిల్ప కూడా ఆ విషయాన్ని కూడా వదిలేసింది. పెండ్లయిన మూడు నెలలకే ఆషాడం అంటూ శిల్పను తల్లిగారి ఇంటి దగ్గర వదిలి పెట్టి వెళ్లారు. అలా వదిలి వెళ్లి ఆరు నెలలు దాటి ఏడాది అయినా తీసుకువెళ్లడానికి రావడం లేదు. ఫోన్ చేసినా ఎత్తడం లేదు. శిల్ప తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లినా రాజు వాళ్లు ఇంట్లోకి రానీయడం లేదు. ‘పెద్దమనుషులతో మాట్లాడిన తర్వాతనే శిల్ప ఇంట్లోకి రావాలి, అప్పటి వరకు ఆమె మా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు’ అని బయటకు పంపించారు. చుట్టు పక్కల అందరూ వారి బంధువులే కాబట్టి శిల్ప కుటుంబం మాట ఎవరూ వినలేదు. దాంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు.
అక్కడ కూడా రాజు ‘ఆమెతో ఉండటం నాకు ఇష్టం లేదు. ఆమె నన్ను ప్రతి విషయంలో ప్రశ్నిస్తుంది. వాళ్లు పెండ్లిలో ఇస్తామన్న బంగారం, కట్నం ఇంకా ఇవ్వలేదు. అవి తీసుకొని రమ్మని చెప్పండి. అప్పుడే నేను ఆమెతో కలిసి ఉంటాను’ అన్నాడు. దాంతో శిల్ప తల్లిదండ్రులు అప్పు చేసి కట్నం, బంగారం ఇచ్చి పంపిస్తే అవి తీసుకొని రెండు రోజుల తర్వాత శిల్పతో గొడవ పెట్టుకొని, అదనపు కట్నం కావాలంటూ తిట్టి పంపించారు. ఇక చేసేది లేక తెలిసిన వాళ్లు చెబితే ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చారు. మేము రాజును అతని కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడితే ‘వాళ్లు చెప్పేది మొత్తం అబద్దం. మమ్మల్ని మోసం చేసి పెండ్లి చేశారు’ అన్నారు. ‘ఏం మోసం చేశారు?’ అని అడిగితే ‘శిల్పకు దేవుడు(శిగం) వస్తాడు. అలాంటి అమ్మాయి కాపురం ఎలా చేస్తుంది. వయసు అయిపోయిన మహిళలకు దేవుడు వస్తే ఏమో గానీ, పెండ్లయిన వారం నుండే ఆమె ఒంట్లోకి దేవుడు వస్తున్నాడు. అలాంటి అమ్మాయితో వుంటే నాకు పాపం తగులుతుంది. అందుకే ఆమెను వాళ్ల ఇంటికి పంపించాను. నేను మాత్రం ఆమెతో కలిసి జీవించలేను’ అన్నాడు.
‘ఆమెకు దేవుడు వస్తాడని మీకెవరు చెప్పారు’ అంటే ‘పెండ్లయిన తర్వాత మేము ఇంట్లో ఎల్లమ్మ లగం, మల్లన్న లగం చేయించాము. అప్పుడు శిల్ప ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అప్పుడే మాకు కూడా తెలిసింది. ఈ విషయం మాకు చెప్పకుండా మోసం చేసి పెండ్లి చేశారు. అది సరిపోదన్నట్టు మమ్మల్ని పెద్దమనుషుల్లో కూర్చోబెట్టారు’ అన్నారు. ఇదే విషయం గురించి శిల్పను అడిగితే ‘అలాంటిది ఏమీ లేదు మేడమ్, పూజల వల్ల రెండు మూడు రోజులు సరిగ్గా తినలేదు. దాంతో కళ్లు తిరిగి పడిపోయాను. అలాగే పెద్ద శబ్దాలు వింటే చిన్నప్పటి నుండి నాకు ఎక్కిళ్లు వస్తాయి. చాలా సేపు ఆగవు. డాక్టర్ దగ్గరకు వెళితే ‘ఇదేం కాదు, అప్పుడప్పుడు కొందరికి ఇలా జరుగుతుంది, ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు’ అన్నారు. కానీ రాజు వాళ్లు నాకు ఒంట్లో దేవుడు వస్తాడని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం నాకు నేరుగా చెప్పకుండా ఆషాడం అంటూ మా ఇంట్లో వదిలేసి పోయారు’ అంటూ బాధపడింది.
అంతా విన్న తర్వాత రాజుతో ‘ఒంట్లోకి దేవుడు రావడం వంటివి ఏమీ ఉండవు, ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్మితే ఎలా? దేవుడి పేరుతో ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తారా? ఆమె జీవితమే కాదు నీ జీవితం గురించి కూడా ఆలోచించుకో. ఇలా ప్రవర్తించడం సరైనది కాదు’ అంటే రాజుతో పాటు అతని కుటుంబ సభ్యులు ఎవరూ వినిపించుకోలేదు. ఇద్దరికీ నాలుగైదు సార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా ప్రయోజనం లేదు. శిల్పను తీసుకెళ్లడానికి వాళ్లు సిద్దంగా లేరు. దాంతో శిల్ప ‘నాకూ ఆత్మాభిమానం ఉంది. ఎన్ని సార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. నాతో కలిసుండటం అతనికి ఇష్టం లేకపోతే వదిలేస్తాను. నా బతుకు నేను బతకగలను’ అంది. దాంతో పెండ్లిలో శిల్పకు పెట్టిన బంగారం, డబ్బు, సమానుతో పాటుగా ఎనిమిది లక్షలు నష్టపరిహారంగా ఇప్పించాము. ప్రస్తుతం శిల్ప పీజీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. ఈకాలంలో కూడా మూఢనమ్మకాలతో ఇలా జీవితాలను పాడుచేసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల్సిన వాళ్లు లేని పోని నమ్మకాలతో ఇలా జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. నేటి సమాజంలో సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవల్సిన అవసరం చాలా ఉంది. అప్పుడే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
- వై వరలక్ష్మి, 9948794051



