Sunday, July 27, 2025
E-PAPER
Homeచౌరస్తాజీవన వైఫల్య పురస్కారం

జీవన వైఫల్య పురస్కారం

- Advertisement -

ఈ లోకంలో వున్న లక్షలమందిలో ఒకడు గంగాధరం. అయితే తను వెయ్యిమందిలోనో, వీలయితే వందమందిలోనో ఒకడు కావాలన్న కోరిక ఇటీవల కాలంలో తెగ నమలడమేకాదు కొరికేస్తున్నది కూడా. ఇలాంటి కఠిన కష్టసాధ్యమైన కోరిక తీరాలంటే అంత తేలికైనదేమీ కాదు. అసలు అందరిలో ఒక్కడు కావాలనుకునేవాడికి ఏదో ఒక ప్రత్యేక లక్షణం వుండి తీరాలి. తనలో అలాంటి లక్షణం ఏమిటా అని తన్ను తాను ‘స్కాన్‌’ చేసుకున్న గంగాధరం ఇసుకలోతైలం తీసినట్టు, కుందేటి కొమ్ము సాధించినట్టు కనుగొన్న విషయం ఏమిటనగా తనలో ఒక కవి వున్నాడన్న సంగతి.
మామూలు మనుషులకు భిన్నంగా ఆలోచించడం ఊహించడం కవి లక్షణం అని, అది తన దగ్గర కావలసిన దానికంటే ఎక్కువ వుందని తెల్సుకుని తెల్లకాగితం మీద నల్ల గీతలు గీకడం ఆరంభించి, అక్షరాలు రాయడంలో విజయం సాధించాడు. తను రాసిన కవిత్వం చదువుకుని తనే ఎంతో ఆశ్చర్యపోయేవాడు, అబ్బురపడేవాడు. తనలాగే తన కవిత్వం చదివిన వాళ్లంతా ఆశ్చర్యపడి, అబ్బురపడి పోవాలంటే తన కవితలు పత్రికల్లో అచ్చవాల్సి వుంటుందన్న విషయం గ్రహించి ఆ డైరెక్షన్లో కదలిక సాగించాడు. ఈ మనుషులే ఇంత. పక్కవాడి ప్రతిభను ఓర్చుకోలేరు, మెచ్చుకోలేరు, అచ్చువేయలేరు అని తెగ బాధపడ్డా, అస్త్ర సన్యాసం చెయ్యదల్చుకోని గంగాధరం పత్రికల వారిని బాధపెట్టడం, బతిమాలడం, హింసపెట్టడం మానలేదు. తెల్సిన న్యూమరాలజిస్టు ఒకడు తన పేరులో వైబ్రేషన్స్‌ లేవని, తన పేరులో మొదటి అక్షరం ‘గం’ ను తీసేసి ‘గన్‌’గా మార్చి ‘గన్‌’గాధర్‌ అనో లేక ‘గన్‌’ అనో, ‘ధర్‌’ అనో పెట్టుకుంటే చప్పట్లే కాదు శాలువాలే కాదు, అవార్డులూ సత్కారాలూ, సన్మానాలూ, పురస్కారాలూ అందుకునే గొప్ప, ప్రసిద్ధ, పాపులర్‌ కవివి అవగలవని గ్యారంటీ ఇచ్చాడు.
ఇప్పుడు గంగాధరానికి కవి కావాలనే కోరిక మరింత పెచ్చుపెరిగి, విస్తృతమై, విపులమై, విపర్యాసమై తను మామూలు కవి కాకూడదని అవార్డులు అందుకునే కవి కావాలని అనుకునే స్థాయికి వెళ్లి కూచుంది. గంగాధరం తన పేరు ‘గన్‌’గా మార్చుకుంటే విప్లవ కవి అని, చెర్లపల్లి జైలులో కూచుని రాసుకో కవీ అంటారేమోనని భయపడి ‘ధర్‌’ గా మార్చుకుని, మొదట ‘వాట్సప్పు’ కవిగా కదం తొక్కి పిదప విజృంభించి పత్రికల్లో తొలి అడుగులు వేశాడు.
వందల్లో ఒకడు కావాలని వుంటే కవిత్వంవెలగబెడితే చాలదు. కథలు సాగతీయాలి. వ్యాసాలు విరగదీయాలి. సాగదీసిన కథల్ని నవలల్ని చేయాలి. అప్పుడే తను ఒట్టి కవి అనికాక, కవి, కథకుడు విమర్శకుడు, టోటల్‌గా సాహితీవేత్త అని అందరూ ప్రశంసిస్తారని భావించి ఆ మార్గంలో మలి అడుగులు వేశాడు. ఊరికే ఆ పత్రికలో ఓసారి ఈ పత్రికలో ఓసారి కనపడి మాయం అయితే ఎవరూ సత్కరించరు, ఏ బిరుదూ బహూకరించరు. పుస్తకాలు రావాలి, కవితా సంపుటులూ, కథా సంపుటులూ, బండెడు కాకపోయినా బుట్టెడు నవలలు, చాటెడు విమర్శ పుస్తకాలు వస్తే ఇక గంగాధరం నువ్వొక చారిత్రక వ్యక్తివై పోతావు. భాషా చరిత్రలో ఏక వాక్యమైనా కానీ పేరు ప్రసిద్ది పొందగలదు అని ఊరికే అనగా పదే పదే గాక ఉచితంగా కూడా సలహాలు ఇచ్చేవాళ్లు అవి ఇచ్చేయడంతో పుస్తకానికి పెట్టిన డబ్బు, గోడకు కొట్టిన సున్నమూ ఒకటేనని తెలిసి తెలిసి అప్పుచేసి పప్పుకూడు తినకుండా, కప్‌బోర్డులన్నీ పుస్తకాలతో నింపేశాడు. అహోఒహో అన్నవాళ్లే కానీ పుస్తకం కొన్నవాడు లేడు. బలవంతంగా షాపుల్లో అప్పజెప్పివస్తే పైసా జాడలేదు, పుస్తకాల అడ్రస్పూ లేదు.
ఇంత జరిగాక గంగాధరం ఆత్మవిమర్మలో పడ్డాడు. తను ఎవరు? కవా? కథకుడా? నవలాకారుడా? విమర్శకుడా? ఏదో ఒకటి అవకూడదా. యూనివర్సిటీలు, అకాడమీలు పిలిచి తన కష్టానికి కనీసం జాలిపడైనా ఏదో ఒక బిరుదో అవార్డో ఇవ్వకూడదా? అని అదేపనిగా ఆలోచించసాగాడు.
అసలు ఎవడ్రా నిన్నిలాగ అన్ని రంగాల్లోనూ చేయి కాల్చుకోమన్నాడు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కవిత్వానిదే పైచేయి. అవార్డులూ, సత్కారాలూ కవులకేరా! అరపేజీ కవితే బండెడు కథ పేజీల కన్నా మిన్నరా అని స్నేహితుడొకడు గడ్డి పెట్టాడు. ఆ గడ్డి మేసి గంగాధరం జీర్ణించుకునేలోపే ఆ హితుడు సన్నిహితుడు మరొక విశిష్టమైన విలక్షణమైన సలహా ఇచ్చాడు. ఇప్పుడు నీకు వేరువేరు అవార్డులూ, బిరుదులూ, సన్మానాలూ అందుకునే వయసు దాటిపోయింది. ఇక హోల్‌సేల్‌గా జీవన వైఫల్య పురస్కారం ఇవ్వండని ఏ సంఘం వారినో, సంస్థవారినో, సమితి వారినో, కూటమివారినో సంప్రదించు అన్నాడు.
గంగాధరం అదిరిపడ్డాడు. ఉలిక్కిపడ్డాడు. అదేంటి జీవన సాఫల్యం పురస్కారం ఇస్తారుగా చివరాఖరుకి దయతలచి ఎవరైనా అన్నాడు. అప్పుడా ఆప్తమిత్రుడు ఇలాగ ఉపదేశించాడు. కడుపు చించుకుంటే కాళ్లమీది నుండి నేలమీద పడుతుంది. ఉన్నమాటంటే ఉలిక్కిపడతావు. నువ్వు ఏ రంగంలోనూ ఊడబొడిచింది ఏమీ లేదు. ఊరికే పేరుకోసం తాపత్రయం తప్ప అక్షరం కోసం చేసిన తపస్సేమీ లేదు. నిజాన్ని నిజాయితీగా ఒప్పుకో.
నీలాగ ప్రయత్నించి విఫలం చెందిన వారెందరో ఉన్నారు. కవులూ, కళాకారులేకాదు, మామూలు జనంలోనూ ధైర్యంగా వైఫల్యాలను ఎదుర్కొన్నవారు, ఎదుర్కొంటున్నవారు వున్నారు. అందువల్ల జీవన సాఫల్యం సాధ్యంకాని వారందరికీ జీవన వైఫల్య పురస్కారమే కరెక్టు. నువ్వు ఒప్పుకుంటే ఏ సభా, సంఘమూ అక్కర్లేదు. నేనే నీకు జీవన వైఫల్య పురస్కారం అందజేస్తా గన్‌, ధర, గంగాధరం అన్నాడు ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌.
– చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -