నవతెలంగాణ కంఠేశ్వర్
లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాలోని అలీ సాగర్, గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ లో పనిచేసే కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు బకాయి ఉండటం మూలంగా కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బకాయి జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ఎస్ ఈ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఎస్ ఈ కి వినతి పత్రం అందజేసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నెలనెలా వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేయటం వలన కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అన్నారు.
అదేవిధంగా 15 నెలల నుండి కార్మికులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను చెల్లించకపోవడం వలన వారు నష్ట పోవలసి వస్తుందని ఒప్పందంలో భాగంగా గుర్తింపు కార్డులను, హెల్త్ ఇన్సూరెన్స్ ను ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. ఇది సరైన పద్ధతి కాదని, అంగీకరించిన వాటిని కూడా అమలు జర్పకపోవడం కాంట్రాక్టర్కు తగదని ఆమె అన్నారు. వెంటనే జోక్యం చేసుకొని కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను ఇప్పించాలని అగ్రిమెంట్లో చేసుకున్న ఒప్పందాలను అమలు జరిపే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన చేయాల్సి వస్తుందని ఈ సందర్బంగా ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు,లిఫ్ట్ ఇరిగేషన్ నాయకులు గణేష్, బుచ్చన్న, సందీప్, నరేష్, రాజు, రమేష్ ఇతరులు పాల్గొన్నారు.



