‘స్థానికం’పై రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం
బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం
ఖరీఫ్‌లో పండించిన ప్రతి గింజనూ కొంటాం
మద్దతు ధరతోపాటే సన్నాలకు రూ.500 బోనస్
మెట్రో ఫేజ్-2పై సీఎస్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ
రాష్ట్రంలో మరో మూడు కొత్త వ్యవసాయ కళాశాలలు
రూ.10,547 కోట్లతో హ్యామ్ రోడ్లు
రక్షణ శాఖకు 435 ఎకరాల భూ కేటాయింపు
డిసెంబరు ఒకటి నుంచి ప్రజా పాలన విజయోత్సవాలు : రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి
23న మరోసారి భేటీకి నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ఖరీఫ్‌లో పండించిన ప్రతీ గింజనూ కొనాలనీ, సన్నాలకు మద్దతు ధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. మరో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి ఆయన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను వెల్లడించారు.
‘కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్‌లో కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశాం. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నులను మిల్లింగ్ చేసి గోదాముల్లో నిల్వ చేస్తాం. అయితే ఇప్పుడున్న సామర్థ్యం ప్రకారం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం ఉందని కేంద్రం తెలిపింది. అయినా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గం నిర్ణయించింది’ అని పొంగులేటి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై క్యాబినెట్ చర్చించిందని ఆయన తెలిపారు. ఈ కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్లేందుకు మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు.
రెండు రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను మంత్రివర్గం ఆదేశించిందని పేర్కొన్నారు. మెట్రో రైల్ ఫేజ్-1, ఫేజ్-2 ఏ, ఫేజ్-2 బీపై మంత్రి వర్గంలో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ఎల్‌అండ్‌టీకి చెల్లించాల్సిన మొత్తం ఫేజ్-2 నిర్మాణానికి కావాల్సిన నిధులు, కేంద్రం విధించిన షరతులు తదితర అంశాలపై చర్చించి నివేదిక సమర్పించేందుకు సీఎస్ నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి మొదలగు ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని క్యాబినెట్ నిర్ణయించిందన్నారు. డిప్యూటీ సీఎం చైర్మెన్‌గా ఉన్న మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీకి అధికారుల కమిటీ నివేదిక అందిన తర్వాత మంత్రి వర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆచార్య జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా మరో మూడు కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ లో వాటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం మంత్రుల కమిటీని నియమించాలని తీర్మానించినట్టు తెలిపారు. రూ.10,547 కోట్లతో నిర్మించే 5,566 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లకు త్వరలో టెండర్లు పిలవాలని మంత్రివర్గం లో నిర్ణయించామని అన్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్‌ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్న క్రమంలో ఆ శాఖకు ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసిందన్నారు.
కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసిందని పొంగులేటి చెప్పారు. మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ క్యాబినెట్ తీర్మానించిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలకు కావాల్సిన భూములను కేటాయించాలని నిర్ణయించామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌తో పాటు మరో ఏడెనిమిది విభాగాలకు భూములను అలాట్ చేసినట్టు తెలిపారు. నల్సార్ యూనివర్సిటీకి 7ఎకరాల భూమిని కేటాయించామనీ, గతంలో స్థానిక విద్యార్థులకు ఉన్న 25 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచామని తెలిపారు.
కొండా సురేఖ గైర్హాజరు
క్యాబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. తనకు తెలియకుండానే తన ప్రయివేట్ ఓఎస్టీని ఉద్యోగం నుంచి తొలగించడం, అతన్ని అరెస్ట్ చేసేందుకు తన ఇంటికి పోలీసులు రావడంపై ఆమె ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ భేటీకి రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆమె రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ కారణంగా మంత్రివర్గానికి హాజరు కాలేకపోయారని అధికార వర్గాలు తెలిపాయి.