రక్తరంజితంమనిషి మెల్లమెల్లగా కోల్పోతే
మెదడు మొద్దుబారిపోతుంది, ఆ క్షణమే
రాజకీయ చదరంగ కదనరంగంలో
పాలకుల చేతిలో పావులుగా
పాలితులు మారిపోతారు
కళ్లు మూసి తెరిచేలోపే
సమయం చేజారిపోతుంది
చుట్టూ కమ్మకున్న విషనీడతో
ఆడబడుతున్న రాజకీయ రక్తహౌలీతో
ప్రపంచమంతా శూన్యంలా తోస్తుంది
ముసుగులు వేసుకున్న వారిని గుర్తపట్టలేక
బిక్కమొఖం వేసుకోనో లేక మూర్ఖంగానో
అబద్ధాన్ని నమ్మాల్సిన పరిస్థితి ఎదురవుతుంది
చదువుకున్న బానిసలై
దినదినగండంతో జీవితాలను వెల్లదీస్తూ
రక్తపుకూడుకు రుచిమరిగిన
గుంట నక్కలకు బలి అయిపోతారు
సమయం ఆసన్నమైన తర్వాత
కాపుకాచుకొని ఉన్న తోడేళ్లు
చీకటి రాజ్యంలో ముసుగులు వేసుకొని
శవాల మీద మొసలి కన్నీళ్లు కారుస్తూ
ఓట్ల వేటలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి
తిమ్మిని బమ్మి చేయగల సిద్ధహస్తులకే
తమను నడిపించే పగ్గాలు ఇవ్వాలని
గొర్రెలన్నీ కూడబలుకున్నంకా
అధికారం తోడెళ్లకే చెందాలి
అదే అసలైన ఆహారపు గొలుసు
అదే ప్రాకతిక సహజ న్యాయం
- సయ్యద్ ముజాహిద్ అలీ