Tuesday, November 11, 2025
E-PAPER
Homeమానవిఉసిరితో ఇష్టంగా…

ఉసిరితో ఇష్టంగా…

- Advertisement -

ఉసిరి ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతీ రోజూ చిన్న ఉసిరి ముక్క తిన్నా.. ఎన్నో రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మానికి, జుట్టు బలంగా ఉండేందుకు సహాయ పడుతుంది. ఉసిరి కాయలతో ఎక్కువగా చాలా మంది పచ్చళ్లు పెడుతూ ఉంటారు. కానీ ఉసిరితో అనేక రకాల స్వీట్లు, వంటకాలు కూడా తయారు చేసుకోవచ్చు. అవేంటో ఈరోజు తెలుసుకుందాం…

గటాగట్‌ లడ్డూ
కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు- పావు కేజీ, బెల్లం – పావు కేజీ, మిరియాల పొడి – స్పూను, వాము – స్పూను, జీలకర్ర పొడి – రెండు స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, ఇంగువ – అర స్పూను, ఆమ్‌చూర్‌ పౌడర్‌ – ముప్పావు స్పూను, చక్కెర పొడి – రెండు స్పూన్లు.
తయారీ విధానం: శుభ్రంగా కడిగిన ఉసిరికాయలను కుక్కర్‌లో కొన్ని నీళ్లు పోసుకుని రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఉసిరి కాయలలోని గింజను తీసేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌ ఆన్‌ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఉసిరి ముద్ద, బెల్లం, కాసిన్ని నీళ్లు కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. ముడ్నాలుగు నిమిషాలు తర్వాత అందులో వాము, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్‌ పౌడర్‌ వేసుకొని కలుపుకోవాలి. అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. కాసేపటి తర్వాత ఉప్పు, ఇంగువ కూడా వేసి కలుపుకోవాలి. చిక్కబడే వరకూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చక్కగా దగ్గర పడిందనుకున్న తర్వాత స్టౌ ఆఫ్‌ చేసుకోవాలి. కడాయిని దించి చల్లార్చుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే చేత్తో కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూలా చేసుకొని వాటి పైన చక్కెర పొడి చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల లడ్డూలు అతుక్కోకుండా ఉంటాయి. అంతే అద్దిరిపోయే ఉసిరి గటాగట్‌ లడ్డూ సిద్ధమైపోతుంది.

రోటి పచ్చడి
కావల్సిన పదార్థాలు: ఉసిరి ముక్కలు – పెద్ద కప్పు, ఎండు మిర్చి – పది, పచ్చిమిర్చి – ఎనిమిది, నూనె – పావుకప్పు, సెనగపప్పు – టేబుల్‌స్పూను, మినపప్పు – టేబుల్‌ స్పూను, ఆవాలు – చెంచా, దనియాలు – చెంచా, జీలకర్ర – చెంచా, మెంతులు – పావుచెంచా, ఇంగువ – పావుచెంచా, ఉప్పు – తగినంత, పసుపు – పావుచెంచా, వెల్లుల్లి రెబ్బలు – నాలుగైదు.
తయారీ విధానం: స్టవ్‌మీద కడాయిని పెట్టి ముప్పావువంతు నూనె వేసి ఉసిరి ముక్కల్ని దోరగా వేయించుకుని తీసుకోవాలి. అదే కడాయిలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, దనియాలు, ఎంతులు, సగం చొప్పున సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయించుకుని మిక్సీలో వేసుకోవాలి. ఈ తాలింపు చల్లారాక వేయించుకున్న ఉసిరిముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చివరగా స్టవ్‌మీద కడాయిని పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడెక్కాక ఇంగువ, వెల్లుల్లి, మిగిలిన తాలింపు దినుసులు వేయించాలి. ఇందులో పచ్చడి కూడా వేసుకుని దొరగా వేయించి స్టవ్‌ని కట్టేయాలి.

క్యాండి
కావల్సిన పదార్థాలు: ఉసిరికాయలు (పెద్దవి) – అరకప్పు, పంచదార – అరకప్పు(ఉసిరికాయల బరువుకు సమానంగా తీసుకోవచ్చు), ఏలకుల పొడి, పంచదార పొడి – కొద్దికొద్దిగా(గార్నిష్‌ కోసం, అభిరుచిని బట్టి)
తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, నీటిలో వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఉడికిన ఉసిరికాయలను చల్లార్చి, చాకుతో గింజలను తీసి ముక్కలను జాగ్రత్తగా విడదీయాలి. ఈలోపు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో సగం ఉసిరి ముక్కలు, దానిపై సగం పంచదార వేయాలి. ఇదే విధంగా మిగిలిన ఉసిరి ముక్కలు, మిగిలిన పంచదార వేయాలి. పాత్రపై మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉంచాలి. ఈ సమయంలో పంచదార మొత్తం కరిగి, పాకంగా మారి ఉసిరి ముక్కలలోకి చేరుతుంది. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ముక్కలు విరగకుండా పాత్రను మెల్లగా కదపాలి. నాలుగు రోజుల తర్వాత ఉసిరి ముక్కలు మెత్తగా మారి, పంచదార మొత్తం ద్రవ రూపంలోకి మారుతుంది. ఇప్పుడు ఆ ఉసిరి ముక్కలను పాకం నుంచి వేరు చేసి, ఒక ప్లేట్‌లో లేదా జల్లెడలో పరచాలి. (ఆ పంచదార పాకాన్ని వేరే దేనికైనా ఉపయోగించుకోవచ్చు). పాకం తీసి ఉసిరి ముక్కలను, ఎండ తగిలే ప్రదేశంలో సుమారు మూడు రోజుల పాటు పూర్తిగా ఆరిపోయే వరకు ఎండబెట్టాలి. క్యాండీ ఒక దానికి ఒకటి అంటుకోకుండా, మృదువుగా అయ్యేంత వరకు ఎండబెట్టాలి. పూర్తిగా ఆరిన ఉసిరి క్యాండీ ముక్కలను సర్‌ చేసుకునే ముందు ఏలకుల పొడి, పంచదార పొడితో గార్నిష్‌ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఏడాది వరకు పాడవ్వకుండా ఉంటుంది.

హల్వా
కావల్సిన పదార్థాలు: ఉసిరికాయలు – అర కేజీ, చక్కెర లేదా బెల్లం తురుము – అర కేజీ, నెయ్యి – ఐదు టేబుల్‌ స్పూన్లు, ఏలకుల పొడి – టీస్పూను, ఫుడ్‌ కలర్‌ – అభిరుచిని బట్టి, డ్రై ఫ్రూట్స్‌(జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు) – కొద్దికొద్దిగా (నేతిలో వేయించుకోవాలి).
తయారీ విధానం: ముందుగా ఉసిరికాయాలను శుభ్రంగా కడిగి, పదిహేను నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన ఉసరికాయాలను చల్లార్చి, గింజలు తీసేసి, ముక్కలను మిక్సీలో నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ లోపు పందపాటి కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని, అందులో జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు వంటి డ్రై ఫ్రూట్స్‌ను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఉసిరి పేస్ట్‌ను వేసి, నెయ్యిలో పచ్చి వాసన పోయే వరకు సుమారు ఏడు నిమిషాలు బాగా వేయించాలి. ఉసిరి పేస్ట్‌ కాస్త రంగు మారిన తర్వాత, బెల్లం తురుము లేదా చక్కెరను వేసుకోవాలి. అది కరిగి, ఉసిరి పేస్ట్‌తో బాగా కలిసిపోయి, ఆ మిశ్రమం దగ్గరపడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్యలో ఫుడ్‌ కలర్‌ వేసుకోవచ్చు. ఈ మిశ్రమం గట్టిపడుతున్నప్పుడు మిగిలిన నెయ్యిని కొద్దికొద్దిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. హల్వా కడాయి అంచులను వదిలి, ముద్దగా తయారయ్యే వరకు ఉడికించాలి. చివరగా ఏలకుల పొడి వేసి బాగా కలిపి, స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ ముక్కలతో అలంకరించి సర్వ్‌ చేసుకోవచ్చు. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -