శాంతి ప్రణాళిక తొలి దశపై హమాస్, ఇజ్రాయిల్ సంతకాలు
నెతన్యాహూపై మోడీ ప్రశంసలు
కైరో : నిత్యం బాంబు దాడులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న గాజాలో నిశ్శబ్ద వాతావరణం నెలకొనబోతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలోని తొలి దశకు హమాస్, ఇజ్రాయిల్ అంగీకరించి ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణకు మార్గం సుగమమైంది. తాజా పరిణామాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రపంచ నేతలు స్వాగతించారు. గాజాలో కాల్పుల విరమణపై ఒప్పందం కుదరాలని, బందీల విడుదల జరగాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని, దీనిపై హమాస్-ఇజ్రాయిల్ మధ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఒప్పందాన్ని చారిత్రక ముందడుగుగా ఆయన అభివర్ణించారు.
బందీలందరూ త్వరలోనే విడుదల అవుతారని అంటూ బలమైన, మన్నికైన, దీర్ఘకాలిక శాంతి స్థాపన దిశగా తొలి చర్యగా ఇజ్రాయిల్ తన దళాలను వెనక్కి తీసుకుంటుందని చెప్పారు. మధ్యవర్తిత్వం నెరపిన ఖతార్, ఈజిప్ట్, టర్కీ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇజ్రాయిల్‌కు గొప్ప రోజని ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ అన్నారు. ఒప్పందానికి ఆమోదం తెలపాల్సిందిగా తన ప్రభు త్వానికి నచ్చచె బుతానని అంటూ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించిన ఇజ్రాయిల్ రక్షణ దళాలకు, ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. కాగా మధ్యవర్తులు, ట్రంప్ చేసిన ప్రయత్నాలను హమాస్ ప్రశంసించింది. పాలస్తీనియన్ల త్యాగాలు వృథాకాబోవని చెప్పింది. తమ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం కల్పించేందుకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించింది.
ప్రపంచ నేతల ప్రశంసలు
అమెరికా, ఖతార్, ఈజిప్ట్, టర్కీ దేశాల మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్టె రస్ కొనియాడారు. ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఐరాస మద్దతు ఇస్తుందని, మానవతా సాయాన్ని పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ సహా పలు దేశాలు ఒప్పందాన్ని స్వాగతించాయి.
తెర వెనుక కథ ఇదే…
హమాస్, ఇజ్రాయిల్ మధ్య ఒప్పందం కుదరడానికి తెర వెనుక చాలా కథే నడిచింది. హమాస్‌తో ఒప్పందానికి రావాలంటూ నెతన్యాహూపై ట్రంప్ బాగా ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో అరబ్ నేతల సాయాన్ని కోరారు. ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతిని సాధించి, తన పట్టును పెంచుకోవాలన్న కోరికతో ఉన్న ట్రంప్ ఇజ్రాయిల్ పట్ల తన వైఖరిని కూడా మార్చుకున్నారు. గతంలో ఇజ్రాయిల్‌కు ఇచ్చిన బేషరతు మద్దతుకు భిన్నంగా దృఢ వైఖరి అవలంబించారు. గత నెల 29న అధ్యక్ష భవనంలో నెతన్యాహూకు ట్రంప్ ఆతిథ్యం ఇచ్చారు. తన శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకరించకుంటే ‘పని పూర్తి చేయడానికి’ ఇజ్రాయిల్‌కు పూర్తి మద్దతు ఇస్తానని, హమాస్‌ను అంతం చేస్తానని ప్రకటించారు.
ట్రంప్ ప్రతిపాదనలోని కొన్ని భాగాలపై నెతన్యాహూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాలస్తీనా రాజ్య ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదిలావుండగా కీలక చర్చలు జరుగుతున్న తరుణంలో ఖతార్‌పై ఇజ్రాయిల్ దళాలు దాడి చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖతార్ నేతలకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలంటూ నెతన్యాహూకు హుకుం జారీ చేశారు. ఈ నెల ఐదో తేదీ లోగా శాంతి ప్రణాళికకు అంగీకరించాలని, లేకుంటే నరకాన్ని చవిచూడాల్సి వస్తుందని హమాస్‌ను ట్రంప్ బెదిరించారు. గాజాలో బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయిస్తానన్న ట్రంప్ హామీపై హమాస్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రణాళికలోని కొన్ని భాగాలకు హమాస్ అంగీకరించకపోయినా ట్రంప్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రణాళికకు హమాస్ అంగీకరించడం పెద్ద విజయమని చెప్పారు. ప్రపంచంతో పోటీ చేయలేదంటూ ఇజ్రాయిల్‌కు చురకలు వేశారు.
బందీల విడుదల ఇలా…
ప్రణాళిక తొలి దశలో భాగంగా హమాస్ 20 మంది బందీలను విడుదల చేస్తుంది. అలాగే చనిపోయిన 27 మంది మృతదేహాలు కూడా అప్పగిస్తుంది. అటు ఇజ్రాయిల్ చెరలో ఉన్న రెండు వేల మంది పాలస్తీనా ఖైదీలు కూడా విడుదలవుతారు. ఇజ్రాయిల్ విడుదల చేయాల్సిన ఖైదీల జాబితాను ఇప్పటికే హమాస్ అందజే సింది. ఇజ్రాయిల్‌పై 2023 అక్టోబర్ 7న దాడి చేసిన సమయంలో హమాస్ 47 మందిని బందీలుగా పట్టుకుంది. వీరిలో 27 మంది చనిపోయారు. ఒప్పందం అమలులోకి వచ్చిన 72 గంటల్లో బందీలు, ఖైదీల మార్పిడి జరుగుతుంది.
అప్పుడు అలా…ఇప్పుడు ఇలా
బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సాయం పెంపు వంటి చర్యలు వారికి ఊరట కలిగిస్తాయని, దీర్ఘకాలిక శాంతికి దోహదపడతాయని ప్రధాని మోడీ తెలిపారు. ఈ ఒప్పందం నెతన్యాహూ బలమైన నాయకత్వానికి అద్దం పట్టిందని కొనియాడారు. అయితే ఇక్కడ ఓ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. గాజాలో కాల్పుల విర మణ జరపాలని, తన వద్ద బందీలుగా ఉన్న వారిని హమాస్ తక్షణమే విడుదల చేయాలని, నిరాటంకంగా మానవతా సాయాన్ని అందించాలని కోరుతూ ఈ ఏడాది ప్రారంభంలో ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్యరా జ్యసమితిలో మూడో వంతు సభ్యులు సమర్ధించగా భారత్ గైర్హాజరు అయింది. ప్రత్యక్ష చర్చల ద్వారానే శాంతి నెలకొంటుందని అభిప్రాయపడింది.