Tuesday, October 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవాణిజ్య ఒప్పందానికి లైన్‌ క్లియర్‌

వాణిజ్య ఒప్పందానికి లైన్‌ క్లియర్‌

- Advertisement -

– అమెరికా-చైనా చర్చల్లో పురోగతి
– ప్రతీకార సుంకాలు, ఎగుమతి ఆంక్షలకు స్వస్తి
కౌలాలంపూర్‌ : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఎలాంటి దాపరికం లేకుండా నిర్మాణాత్మకంగా రెండు రోజుల పాటు జరిగిన విస్తృత సంప్రదింపులు ఫలించాయి. పురోగతిపై రెండు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. దక్షిణ కొరియాలో అమెరికా, చైనా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య జరగబోయే సమావేశంలో వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందని తెలుస్తోంది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి ఈ ఒప్పందంతో శుభం కార్డు పడుతుంది. 2019 తర్వాత ట్రంప్‌, జిన్‌పింగ్‌ సమావేశం కాబోతుండడం ఇదే మొదటిసారి. ఒప్పందం దిశగా గణనీయమైన పురోగతి సాధించామని అమెరికా, చైనా అధికారులు ఆదివారం ప్రకటించారు. కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియాన్‌ సదస్సు సందర్భంగా రెండు దేశాల ప్రతినిధులు సమావేశమైన విషయం తెలిసిందే.

చర్చల ప్రతినిధులు ఏమన్నారంటే…
దక్షిణ కొరియాలోని జియాంగ్‌జూలో జరగబోయే అపెక్‌ సదస్సుకు ట్రంప్‌, జిన్‌పింగ్‌ హాజరవుతున్నారు. ఆ సందర్భంగా ఇరువురు నేతలు గురువారం సమావేశమవుతారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి కలుసుకోవడం ఇదే మొదటిసారి. ట్రంప్‌, జిన్‌పింగ్‌ మధ్య జరిగే చర్చల కోసం ఇరు పక్షాలు ఓ ‘ఫ్రేమ్‌వర్క్‌’ను రూపొందించాయని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ విలేకరులకు చెప్పారు. రెండు దేశాల మధ్య కుదిరే ఒప్పందం కారణంగా… రేర్‌ ఎర్త్‌లపై చైనా ఎగుమతి ఆంక్షలు విధించదని, అలాగే చైనా వస్తువులపై అమెరికా వంద శాతం సుంకాలు విధించబోదని వివరించారు.

అనుమానాలను, సందేహాలను తీర్చుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయని చైనా తరఫున చర్చల్లో పాల్గొన్న ఉప ప్రధాని హీ లిఫెంగ్‌ తెలియజేశారు. కొన్ని నిర్దిష్ట అంశాలను ఖరారు చేసుకొని దేశీయంగా అనుమతులు పొందే ప్రక్రియను ప్రారంభించేందుకు కూడా రెండు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు. ఆర్థిక సంబంధాల విషయంలలో ఇరు పక్షాలకూ ప్రయోజనకరంగా ఉండేలా ఒప్పందం ఉంటుందని అన్నారు. ఘర్షణకు స్వస్తి చెప్పి సహకారాన్ని పెంచుకుంటే రెండు దేశాలు ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు. చైనా ప్రతినిధి బృందానికి లిఫెంగ్‌, అమెరికా ప్రతినిధి బృందానికి బెస్సెంట్‌ నేతృత్వం వహించారు. సుంకాలు, ఎగుమతి నియంత్రణలు, వ్యవ సాయోత్పత్తులలో వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందని సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ తెలిపింది. ఇకపై వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు పెరగకుండా చూడడంపై రెండు దేశాలు దృష్టి సారిస్తాయి.

తైవాన్‌ సమీపంలో చక్కర్లు కొట్టిన చైనా బాంబర్లు
చైనాకు చెందిన హెచ్‌-6కే బాంబర్లు ఇటీవల తైవాన్‌ సమీపంలో చక్కర్లు కొట్టాయి. విన్యా సాల ప్రాక్టీస్‌ నిమిత్తం అవి గగన తలంలో విహరించాయని చైనా ప్రభుత్వ టెలివిజన్‌కు చెందిన సైనిక ఛానల్‌ వెయిబో తెలియ జేసింది. ఈస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ నుంచి కొన్ని యూనిట్లు తమ సామర్ధ్యాన్ని పరీ క్షించుకోవడానికి యుద్ధ సంబంధమైన శిక్షణను నిర్వహించాయని చెప్పింది. హెచ్‌-6కే బాంబర్‌ అణ్వా యుధాలను తనతో తీసుకెళ్లగలదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -