నవతెలంగాణ – దుబ్బాక
దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాడని, ఆయన చేసిన ప్రజాసేవ నేటితరం నాయకులకు స్ఫూర్తిదాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీకగౌడ్ అన్నారు. నక్సలైట్ గా, జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం చేసిన సోలిపేట రామలింగారెడ్డి చిరస్మరణీయుడని కొనియాడారు.
రామలింగారెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా బుధవారం అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ లోని సోలిపేట రామలింగారెడ్డి స్మృతి వనం, దుబ్బాక పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం వద్దనున్న సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి వెంట బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలున్నారు.