రోగుల్లో పెరిగిపోతున్న షుగర్ లెవల్స్
గాంధీ, ఉస్మానియాలోనూ నిండుకున్న నిల్వలు
దాదాపు మూడు నెలలుగా సరఫరా కాని వైనం
మధుమేహ బాధితులకు తప్పని తిప్పలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మధుమేహగ్రస్తుల సంఖ్య పెరగడమే కాదు.. మారుతున్న జీవన శైలితో షుగర్ లెవల్స్ కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.. 30 ఏండ్ల వయస్సు దాటిన వారిలోనూ షుగర్ బయటపడుతోంది. ఈ క్రమంలో ఇన్సులిన్ వినియోగించే వారి సంఖ్య పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీలతోపాటు హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియాలోనూ షుగర్ ఇన్సులిన్ నిల్వలు నిండుకున్నాయి. దాదాపు మూడు నెలలుగా సరఫరా నిలిచిపోవడంతో మధుమేహ బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక భారంతో బయట కొనలేక, సర్కార్ ఆస్పత్రుల్లో అందుబాటులో లేక.. మరోవైపు రోగుల్లో షుగర్ లెవల్స్ పెరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయగా.. మరికొన్ని ఆస్పత్రుల్లో నిల్వలు లేవని వెనక్కి పంపిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి
ముషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మధుమేహంతో బాధపడుతున్న నలుగురు ఆ దగ్గరలోని పీహెచ్‌సీలో ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునేవారు. మూడు నెలలుగా ఇన్సులిన్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయివేటులో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇందుకు నెలకు రూ.వేలల్లో భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్సులిన్ కొరత ఏదో ఒకటి, రెండు కాదు.. రాష్ట్రంలోని దాదాపు 600కు పైగా పీహెచ్‌సీల్లో నెలకొంది. దాదాపు 70శాతం వరకు కొరత ఉంది. దీంతో ఆయా కేంద్రాలకు వచ్చే బాధితులకు ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా నిల్వలు పూర్తిగా లేవని వైద్య సిబ్బంది చెబుతోంది. 30 ఏండ్లు దాటిన వారందరికీ మధుమేహ పరీక్షలు చేస్తుండటంతో పెద్ద సంఖ్యలో బాధితులు బయటపడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 10 లక్షలు దాటిపోయింది.
ఏడాదికి 2 లక్షలు సరఫరా
సాధారణంగా బోధనాస్పత్రులు, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కలిపి ఏడాదికి దాదాపు 2 లక్షల వరకు ఇన్సులిన్ సరఫరా చేస్తున్నారు. ఇందులోనూ మధుమేహ తీవ్రత, బాధితుల పరిస్థితిని బట్టి నాలుగు రకాల ఇన్సులిన్లు ఉంటాయి. వైద్యుల పర్యవేక్షణలో ఇచ్చే రకం బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులకు కొంత మేర సరఫరా జరుగుతున్నా, పీహెచ్‌సీల్లో ఎక్కువగా ఇచ్చే రకం నిల్వలు మాత్రం పూర్తిగా అడుగంటాయి.
గాంధీ, ఉస్మానియాలోనూ కొరతే..
నగరంలోని పెద్దాస్పత్రులైన గాంధీ, ఉస్మానియాలోనూ షుగర్ ఇన్సులిన్ కొరత వేధిస్తోంది. నో స్టాక్ బోర్డు పెట్టేయడంతో మధుమేహ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు ప్రతిరోజూ సుమారు 300 మంది వరకు మధుమేహ బాధితులు ఇన్సులిన్ కోసం వస్తుంటారు. దాదాపు 3 నెలలుగా స్టాక్ అయిపోవడంతోపాటు టీఎస్‌ఎండీసీ నుంచి సరఫరా ఆగిపోవడంతో ఆయా ఆస్పత్రుల కౌంటర్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో బాధితులు ప్రయివేటు మెడికల్ షాపుల్లో ఇన్సులిన్ కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులు
రాష్ట్రవ్యాప్తంగా మధుమేహ బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. హైదరాబాద్ నగరంతోపాటు జిల్లాల్లోనూ చేస్తున్న ఎన్‌సీడీ స్క్రీనింగ్ పరీక్షల్లో 30 ఏండ్లకు షుగర్ వ్యాధి బారినపడుతున్న వారు ఎక్కువగా బయటపడుతున్నారు. ఇప్పటికే ఇన్సులిన్ తీసుకుంటే తప్ప గడవని వారికి వీరు కూడా తోడవ్వడంతో షుగర్ మందులు, ఇన్సులిన్‌కు డిమాండ్ పెరుగుతోంది. మధుమేహాన్ని అదుపులో పెట్టుకునేందుకు మందుల దశ నుంచి ఇన్సులిన్ దశకు చేరిన వారు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారంతా పీహెచ్‌సీలు, జిల్లా, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు ఉచితంగా ఇచ్చే ఇన్సులిన్ కోసం క్యూ కడుతుంటారు.