వర్తమాన కవులు ఎటువంటి వస్తువులను ఎంపిక చేసుకుని కవిత్వం రాస్తున్నారనే విషయం ఎప్పటికీ ఆసక్తిదాయకమే. ముఖ్యంగా యువతరం ఆలోచనలు ఏవిధంగా వున్నాయో మరింత ఆశాజనకమైన భవిష్యత్తును ఊహించడానికి ఉపయోగపడుతది. సమకాలీన అంశాలను, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను యువత ఏ రకంగా స్వీకరిస్తుంది? ఏయే పరిశీలనలకు యువతరంగపు ఆలోచనలు ఆస్కారమిస్తున్నాయో తెలుసుకోవచ్చు. వాటిల్లోంచి కవిత్వ వస్తువు – ఎంపిక, నిర్వహణ ఎలా వుందో విశ్లేషించుకొనే అనకాశం దొరుకుతది.
చిట్ల ప్రేమ్ కుమార్ బేసికల్‌గా పలుకుబడుల కవి. వరంగల్ ప్రాంత నుడికారంతో సజీవంగా నిలిచిపోగల కవిత్వాన్ని సజిస్తున్న కవి. ప్రకతి, మానవ సంబంధాలు, సామాజిక బాధ్యత ఇనుమడించే వస్తువుల్ని స్వీకరించి కవిత్వం రాస్తున్న వారు. ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ అందజేసే కవిత్వ పురస్కారాల్ని వరుసగా మూడు సార్లు (మూడు నెలల కాలవ్యవధితో) అందుకున్నారు. పాకాల కవుల సాంగత్యంలో కవిత్వం, కథ, పాట, వ్యాసం తదితర సాహిత్య ప్రక్రియల్లో రాణిస్తున్న వ్యక్తి. తన కవిత్వంతో పరిచయం వున్న వారికి తన అభివ్యక్తి, భాష, కవిత్వ నిడివి సుపరిచితం. సుదీర్ఘంగా అనేక పార్శ్వాల నుంచి ‘వస్తువు’ను డీల్ చేసే కవి అలతి పదాల్లో సమకాలీన, సామాజిక పరిణామాల్ని చెప్పగలగడం తన శైలికి భిన్నమైనదని చెప్పవచ్చు. వత్తి రీత్యా హిందీ అధ్యాపకుడిగా ఉన్నత పాఠశాలలో సేవలందిస్తూనే, పాఠశాల విద్యార్థుల్ని తెలుగు సాహిత్యం వైపు ప్రోత్సహిస్తుండడం అభినందించదగినది. గతంలో కవి రాసిన కవితా వస్తువులను గమనిస్తే చెరువు ఔన్నత్యాన్ని గురించి ‘చెరువు’, ‘బతుకుమెద’ భార్యాభర్తల మధ్య వున్న అనుబంధాన్ని, ‘మామిడికొమ్మ’ నాన్న గురించి, ‘గుండె పువ్వును పునికిన సందమామ’, నానమ్మతో మినుములు, మనుమరాళ్లతో వుండాల్సిన, వున్న ఆప్యాయతానురాగాల్ని కైగట్టడం చూడొచ్చు. ఈ క్రమంలో కవి చిట్ల ప్రేమ్ కుమార్ రాసిన కవిత ‘ఒక్క వానైతే బడనీ..’ లోలోతుల్లోకి చూపుల్ని ప్రసరింపజేద్దాం…
‘ఒక్క వానైతే బడనీ..’
అక్కడక్కడా మొలిసిన మోదుగులు
వనమై పూసినై
ఎరుపెక్కిన అడవిని చూసి జడసిన వేలగొడ్డండ్లు మొదలంటా నరికి విర్రవీగినై అడవినైతే నరికిర్రు
రాలిన గింజల సంగతో..
ఒక్క వానైతే బడనీ..”
ఎనిమిది పాదాల కవిత. మోదుగులు పూయడం, ఎర్రగా వికసించడం, గొడ్డళ్లు జడవడం, మోదుగులు పూసిన అడవిని మొదలంటా నరకడం వర్తమాన చరిత్ర. రాలిన గింజలను ప్రస్తావిస్తూ భవిష్యత్తు పట్ల ఒక ఊహా ప్రతిపాదన చేయడం కవిత్వ కొసమెరుపు..
‘ఒక్క వానైతే బడనీ..’ శీర్షిక ముగింపు వాక్యం అవటంలోని ఆశాజనక దక్పథం తేటతెల్లమైతది.
ఒక్కో పాఠకునికి కవిత ఒక్కో విధంగా అర్థమైతది. ఆనంద వర్ధనుడు ‘ధ్వన్యాలోకం’ నందు కావ్యాన్ని ఎలా అర్ధం చేసుకోవచ్చో వివరించడం జరిగింది. ఇదే ధ్వని సిద్ధాంతం. ఇందులో ‘వాచ్యార్థం, లక్ష్యార్థం, ధ్వన్యార్థం’ అనేవి యిమిడి వుంటయి. ఇవి ఒక కవితను అర్థం చేసుకోవడానికి, విశ్లేషించటానికి బాగా ఉపకరిస్తయి.
కవితలోని టెక్స్ట్ యధాతథంగా ఏమి చెప్తుందో అది వాచ్యార్థం అయితది. దేనిని లక్ష్యంగా చేసుకుని చెప్పబడిందో అది లక్ష్యార్థం అయితది. అంతర్గతంగా కవిత దేని గురించి చెబుతుందో అది ధ్వన్యార్థం అయితది. ఇక్కడ కవి – పాఠకులు ఒకే ధ్వన్యార్థంలో అర్ధం చేసుకోక పోవచ్చు. కవి ఉద్ధ్యేశించిన భావం పాఠకులకు చేరకపోవచ్చు. యిదే సమయంలో కవి దేన్ని లక్ష్యం చేసుకుని రాసారో అదే భావం పాఠకులకు చేరకుండా, మరో లక్ష్యాన్ని, ధ్వనిని సైతం అర్థం చేయించవచ్చు.
‘ఒక్క వానైతే బడనీ…’ అనే శీర్షిక అర్థవంతమైనది. సాధారణ అర్ధం అనగా వాచ్యార్థంలో అంతరించబడుతున్న ప్రకతి ఒక్క వానతో తిరిగి పునరుజ్జీవించే అవకాశం వుందనే ఆశాభావాన్ని తెలియజేస్తది. మోదుగులు, గొడ్డళ్లు, రాలిన గింజలు -సాధారణ వాచ్యార్ధంలో కాకుండా లక్ష్యార్థం వున్నట్లయితే అనగా మోదుగులు, గోడ్డళ్లు, రాలిన గింజలు మరింకేదైనా వాటికి ప్రతీకలుగా ప్రయోగించచబడితే మాత్రం ధ్వన్యార్థం ప్రస్ఫుటమైతది.
మనదేశంలో జరుగుతున్న ప్రాంతీయ, జాతీయ పరిణామాలను గమనించినపుడు పర్యావరణ దక్పథం లోంచి మాత్రమే గాకుండా భద్రతా సమస్యల దష్టికోణంలోంచి ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిలోంచి, కేంద్ర ప్రభుత్వం శాంతి భద్రతల నెపంతో ‘ఆపరేషన్ కగార్’ పేరుతో భద్రతా దళాలను మోహరించి అడవుల్లో మావోయిస్టుల ఏరివేతను అత్యంత పటిష్టంగా నిర్వహిస్తున్న తరుణంలో ఆదివాసుల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న సమయం. ‘ఒక్క వానైతే బడనీ..’ అనే ముగింపు వాక్యం దేనిని ధ్వనిస్తుందో ఆలోచించినపుడు, ఇలాంటి దష్టికోణంలోంచి ‘కవిత’ను మరోమారు చదివినపుడు కవిత్వ అంతస్సారం బోధపడుతది.
భద్రతాదళాల ఎదురు కాల్పుల్లో ‘మోస్ట్ వాంటెడ్’ – గెరిల్లా దాడుల వ్యూహకర్త మరణించినట్లు పతాక శీర్షికల్లో వార్తా కథనాలు చదువుతున్న పాఠకులు – అంతకు ముందే లొంగిపోయిన పలువురు అగ్రనేతలు, ఇంకాస్త ముందే మరణించిన మావోయిస్టులను గురించి తెలుసుకున్న పాఠకులు -‘ఒక్క వానైతే బడనీ..’ కవిత అంతరార్థం తెలుసుకుంటరు.
కవులు మూలాల్లోకి వెళ్లి ‘వస్తువు’ను నిర్వహిస్తున్న తీరు, కవిత్వమవుతున్న తీరు గమనిస్తున్నప్పుడు దశాబ్ధాలుగా జరుగుతున్న పోరాటాల్నీ, ఆదివాసుల హక్కుల కోసం నిలబడుతున్న వారిని, అణచివేస్తున్న వారిని, ప్రకతి సంపదలపై కన్నేసిన దుండగులను, ప్రజాప్రభుత్వాన్ని – సాయుధకారుల్ని పరిశీలిస్తూనే సాహిత్య చరిత్రను సామాజిక పరిణామాల దష్టికోణంలోంచి లిఖిస్తున్నారని స్పష్టమవుతది.
కవులకు ఊహ ప్రధానం. వాస్తవికతను కవిత్వంగా రాస్తున్న సజన కత్యంలోంచి వ్యక్తీకరణ ప్రభావం పాఠకులపై ఎంత మేరకు వుండగలదో ఆలోచించగలగాలి. కవి ధ్వన్యార్థ భావనతో ఏకీభవించి మాట్లాడినప్పుడు ఉద్యమం ప్రజల పక్షమైతే, ప్రజా సమూహంలోంచి పోటెత్తితే మోడు చిగురించినట్లు మొలకై, చివురై తలెత్తి చూడగలదని అర్ధమైతది.
కవితను నిశితంగా పరిశీలించినపుడు ‘అక్కడక్కడా మొలిసిన మోదుగులు వనమై’ పూయడంలో మావోయిస్టు ఉద్యమం ఎదిగి వచ్చిన నేపథ్యం తారసపడుతది. ఏ ప్రభుత్వమైనా వారి విధివిధానాలకు ఆటంకంగా మారినపుడు తీవ్రతరం చేసే అణచివేత ధోరణి ‘ఎరుపెక్కిన అడవిని చూసి వేల గొడ్డండ్లు’ జడిసి పోవటంలో ప్రభుత్వ వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. మొదలంటా నరికి విర్ర వీగటంలో అవలంభించిన పాశవిక, కర విధానాలకు.. ప్రతీకలుగా ప్రతిబింబించటం, కనిపిస్తది. ”అడవినైతే నరికిర్రు, రాలిన గింజల సంగతో..” అన్నప్పుడు భౌతికంగా వ్యక్తుల్ని కనిపించకుండా తుడిచి పెట్టవచ్చు. భావజాలాన్ని పెరకివేయలేమని, సాధ్యం కాదని చెబుతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. చివరిగా ‘ఒక్క వానైతే బడనీ..! అనే ముగింపు వాక్యం భావజాలపు పునాదుల్లోంచి మొలకెత్తే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఉద్ఘాటిస్తది.
సాధారణ ప్రజానీకానికి ఎన్‌కౌంటర్ అనేది ఎదురు కాల్పుల చిత్రీకరణగా ప్రొజెక్ట్ అవుతున్నపుడు ఒక్కవైపు నుంచే మతుల దిబ్బలు దర్శనమివ్వడం దేనికి సంకేతంగా నిలుస్తది? దేశం అంతర్గత భూభాగంలో జరుగుతున్న మారణకాండ ‘పౌరహక్కుల ఉల్లంఘన’కు దారితీస్తుందనుకుంటే ఆ దిశగా చర్చలు, విచారణ చేపట్టే అవకాశపు సంభావ్యతను ఇట్టే ఊహించవచ్చు. రాజకీయ కోణంలోంచి, ప్రకతి సంపదల్ని – కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికే జరుగుతున్న తతంగంగా అర్థం చేసుకునే సావకాశం లేకపోలేదు.
కవి కేవలం అష్టాచెమ్మ ఆటలో ‘సంపుడు పంజెం’ ముట్టనీ ఆ తర్వాత.? అన్నట్టుగానే ముం చాడు తప్ప ముందుకెళ్లలేకపోయిండు. కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ‘క్లీన్ స్వీప్’ అయ్యే అవకాశం వుంటుందో లేక కవి ఊహించినట్లు ఒక్క వానైనా పడుతుందో వేచిచూడాల్సిందే!
- బండారి రాజ్ కుమార్, 8919556560



