Friday, October 10, 2025
E-PAPER
Homeమానవిసాహిత్య విధూషీమణి రామలక్ష్మి

సాహిత్య విధూషీమణి రామలక్ష్మి

- Advertisement -

డాక్టర్‌ చెంగల్వ రామలక్ష్మి… చిన్నతనం నుండి సాహిత్య వాతావరణంలో పెరిగారు. బాల వితంతువైన మేనత్త ప్రోత్సాహంతో తన అధ్యయనాన్ని మరింత విస్తరించుకున్నారు. ఆ వాతావరణమే ఆమెను మంచి రచయిత్రిగా తీర్చిదిద్దింది. సమాజం కోసం, స్త్రీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన గురజాడ, జాషువాల జీవితాలు ఆమెను ఎంతో ప్రేరేపించాయి. వారిపై పరిశోధనలు చేసి పుస్తకాలుగా ముద్రించారు. అంతేనా కన్యాశుల్కం నాటకాన్ని 25 పేజీలకు కుదించి అబ్బాయిలతో వేయించిన ఆమె తన సాహిత్య అనుభవాలను మానవితో పంచుకున్నారు.

రామలక్ష్మి సొంత ఊరు మచిలీపట్నం. నలుగురు అక్కచెల్లెళ్లు, ఇద్దరు సోదరులున్న పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగారు. అయితే ఇల్లంతా పుస్తక పఠనంతో నిశబ్ద గ్రంథాలయంలా ఉండేది. సీరియల్స్‌ అయితే బైండింగ్‌ చేయించేవారు. మచిలీపట్నంలో ఐదవ తరగతి వరకు చదివిన ఆమె హైస్కూల్‌ చదువును సాలూరులో మేనత్త దగ్గర పూర్తి చేశారు. బాలవితంతువైన మేనత్త హిందీ టీచర్‌గా పనిచేస్తున్నా తెలుగు సాహిత్యాన్ని ఎంతో అభిమానించేవారు.

మేనత్త ప్రోత్సాహంతో…
చదువు విషయంలో ఆమె రామలక్ష్మిని బాగా ప్రోత్సహించేవారు. అంతే కాదు స్కూల్లో జరిగే వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొనేలా ప్రేరేపించేవారు. అలాగే సంగీతం కూడా నేర్పించారు. అయితే క్రమశిక్షణ తప్పితే మాత్రం ఒప్పుకునేవారు కాదు. మేనత్త వద్ద రామలక్ష్మి సాహిత్యాన్ని విరివిగా అధ్యయనం చేశారు. ఆరవ తరగతిలో ఉన్నప్పుడే యద్దనపూడి సులోచనారాణి ‘జీవన తరంగాలు’ చదవటం తన మర్చిపోలేని అనుభవంగా ఆమె పంచుకున్నారు. మేనత్త ఒక టీచర్‌గా అద్భుతంగా పాఠాలు చెప్పటమేగాక ఏ విషయం గురించి అయినా అనర్గళంగా మాట్లాడగలిగేవారు.

బడిలో జరిగే ప్రతి కార్యాక్రమాన్ని ఎంతో నేర్పుగా చూసుకునేవారు. ఆగస్టు 15న జెండా ఎగరేసే ఏర్పాట్లు మొదలు పిల్లలకి ఉపన్యాస పోటీలు పెట్టించడంలో ముందు భాగంలో ఉండేవారు. అలాంటి మేనత్త ప్రభావం ఈమెపై బాగా ఉండేది. రామలక్ష్మి పదవ తరగతిలో ఉన్నప్పుడు మేనత్తకి శ్రీకాకుళం బదిలీ అయ్యింది. లెక్కలు, సైన్స్‌లో వెనకబడి ఉన్న ఆమె ఎంతో కష్టపడి 80 శాతం మార్కులు తెచ్చుకున్నారు. మేనత్త సలహాపై డిగ్రీలో స్పెషల్‌ తెలుగు తీసుకుని సాహిత్యాన్ని మరింతగా అధ్యయనం చేశారు.

విస్తృత అధ్యయనంతో…
డిగ్రీ చేసేటపుడు సంస్కృత కావ్యాలను గురించి అధ్యాపకురాలు బాలాత్రిపుర సుందరీ వివరించిన విధానానికి ఆమె ముగ్ధులైపోయారు. దాంతో ఆమెకు అదే అంశంపై పరిశోధన చేయాలనే కోరిక కలిగింది. ఎం.ఫిల్‌లో గురజాడ రచనల్ని బాగా అధ్యయనం చేశారు. రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం, విజయనగరం మహారాజా కాలేజీలో విస్తృతంగా అధ్యయనం చేసి నోట్సు తయారు చేసుకున్నారు. ఆంధ్రజ్యోతిలో అప్పట్లో గురజాడని గూర్చి ఈమె రాసిన వ్యాసం ప్రశంసలు, 50 రూపాయల పారితోషికం పొందడం మరువలేని అనుభవంగా ఆమె పంచుకున్నారు. 1993లో ఆంధ్రభూమిలో ‘కోయిలాకోయిలా’ అనే శీర్షికతో వచ్చిన ఆమె కవిత ‘పరధ్యానం’కి 100కి పైగా లేఖలు వచ్చాయంటే సాధారణ విషయం కాదు.

అమ్మ మరణంతో…
1994లో సింగిల్‌ పేజీ కథలు 60కి పైగా రాశారు. అనేక సన్మానాలు, ప్రశంసాపత్రాలు సైతం అందుకున్నారు. చెప్పుకో దగ్గ మరో గొప్ప విషయం ఏమంటే ‘కన్యాశుల్కం’ని 25 పేజీలకు కుదించి మగపిల్లలచేత నాటకం వేయించటం. ‘మా అమ్మ కాలంచేశాక నాకు చాలా శూన్యంగా తోచేది. అప్పట్లో అనేక కథలు రాశాను. నాభర్త ప్రోత్సాహం బాగా ఉంది. మా మామగారు డ్రామా ఆర్టిస్టు. విపుల తెలుగు వెలుగులో నా రచనలు ప్రచురించేవారు. ఇప్పటికీ ప్రతివారం ఓ ప్రధాన పత్రికలో నా రచనలు వస్తున్నాయి. ‘చెంగల్వపూలు యూట్యూబ్‌ ఛానెల్‌’లో నాకథలు వస్తున్నాయి’ అంటూ ఆమె పంచుకున్నారు.

అధ్యాపకురాలిగా…
రామలక్ష్మి తెలుగు, ఆంగ్లంలో ఎం.ఎ.చేశారు. గురజాడ అప్పారావు రచనలపై తిరుపతి ఎస్‌.వి.యూనివర్శిటీలో పి.హెచ్‌.డి. చేశారు. డిప్లమా ఇన్‌ లింగ్విస్టిక్స్‌, డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌ లేషన్‌ చేశారు. రిసెర్చ్‌ ఫెలోగా డిక్షనరీ ఆఫ్‌ తెలుగు లిటరరీ టర్మ్‌(తిరుపతి) ఇండో జపనీస్‌ ప్రాజెక్టు రిసెర్చి ఫెలోగా(జ××ూ మైసూర్‌) తన ప్రతిభ చూపారు. ఎం.ఎ. తెలుగు కరస్పాండెన్స్‌ విద్యార్థులకు మూడేండ్లు పాఠాలు బోధించారు. ఇరవై రెండేండ్ల పాటు విజయవాడలోని అన్నపూర్ణ మెమోరియల్‌ డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు.

సాహిత్య సేవకు
రామలక్ష్మి కవితలు అనేక పత్రికల్లో ముద్రించపడ్డాయి. అలాగే ఆంగ్లం నుండి తెలుగుకి అనువాద కవితలు కూడా ప్రచురితమయ్యాయి. సాహిత్య రంగంలో ఈమె చేసిన సేవలకు అనేక సత్కారాలు, సన్మానాలు అందుకున్నారు. 2011లో గుడివాడలో భారతీదేవి వారిచే సన్మానం, విజయనగరంలో గురజాడపేర పురస్కారాలు అందు కున్నారు. స్కోర్‌ మోర్‌ ఫౌండేషన్‌ వారిచే, ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ పురస్కారం పొందిన విధూషీమణి ఆమె. చెంగల్వపూలు అనే కథా సంపుటి, మహాకవి గురజాడ, జాషువా జీవితం – సాహిత్యం అనే పుస్తకాలు ప్రచురించారు. ప్రస్తుతం అంతర్జాల పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు రాస్తున్నారు.

  • అచ్యుతుని రాజ్యశ్రీ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -