కె.కె.తాయారు… సంగీత, సాహిత్య కుటుంబంలో పుట్టారు. చిన్నతనం నుండే అక్షరాలను అమితంగా ఆరాధించేవారు. నలుగురికి విద్య అందించాలని తపించేవారు. అందుకే డిగ్రీ తర్వాత బి.ఇడి చేశారు. విలువలతో కూడిన బడిని నడిపారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. కొంత కాలం నడిపి నేడు ప్రశాంతంగా కొడుకు, కోడలు, మనవడితో సాహిత్య సేవలో గడుపుతున్నారు. స్నేహానికి ప్రాణమిచ్చే స్నేహశీలిగా అందరి మన్ననలందుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
కె.కె.తాయారు పూర్తి పేరు కుసుమ వల్లి తాయారు. తల్లి తిరుపతమ్మ, తండ్రి హనుమంతరావు. పుట్టిల్లు సంగీత, సాహిత్యాలకు ప్రసిద్ధి. మామ కొప్పరపు సుబ్బారావు ఆనాటి కవివరేణ్యులు, ప్రముఖ రంగస్థల మార్గదర్శి. (నాటక రచయిత, దర్శక, సంగీత, నిర్మాత). ఆ తరువాత సినీనటులుగా సుప్రసిద్ధులు అయ్యారు. ఈమె భర్త కె.సి.మోహనురావు, బి.టి.కాలేజ్ ప్రిన్సిపాల్‌గా చేశారు. మంచి పేరున్న వ్యక్తి. తాయారుకు చిన్నతనం నుంచి అంటే అక్షరాలు నేర్చుకున్న దగ్గర నుంచి ఏదో ఒకటి సొంతంగా రాయాలని కోరిక ఉండేది. తన వయసుకు తగ్గట్టు రాయడం అలవాటు చేసుకున్నారు. ఊహ తెలియక ముందే తల్లిని కోల్పోయిన తాయారును అక్కలు, అన్నలే పెంచి పెద్ద చేశారు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా
కొంచెం బాగా రాయడం వచ్చేసరికి అన్నీ సొంతంగా తానే చేయాలని ఆశ. అలా చిన్నప్పుడే కవిత్వం వైపు పరుగులు పెట్టారు. తర్వాత పిల్లల కార్యక్రమాల కోసం పాటలు, సోది వంటివి తానే స్వయంగా రాసేవారు. అలాగే హిందీ పాటలు కూడా పాడేవారు. వాటిని పిల్లల కోసం తెలుగులో రాసేవారు. అలాగే గొలుసు కట్టు కథ రాశారు. అప్పట్లో బాలప్రభలో ఆమె రచనలు వచ్చేవి. తన చిన్నతనంలో వీణ కూడా నేర్చుకున్నారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు కూడా తెచ్చుకున్నారు. ఆలిండియా రేడియోలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా నాటకాలు వేశారు. దాంతో గొప్ప కళాకారులైన బందా, నండూరి సుబ్బారావు, సి.రామమోహన్రావు లాంటి వారితో పరిచయం అయ్యింది. వారి సహకారంతో నాటకాలలో శిక్షణ పొందారు.
రేడియో అక్కల సాయంతో…
‘రేడియో నా ఆత్మ బంధువు లాంటిది. ఎంతో మంది కవులను కలుసుకోగలిగాను. వారి ప్రేమాభిమానాలు పొందాను’ అంటూ ఆమె ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు. ఈమె అక్క వింజమూరి లక్ష్మి సంగీత కచేరీలు చేస్తే ఆమెకు సహాయంగా తంబురా, లలిత సంగీతలో వీణ సహాయకురాలిగా చాలా కచేరీలు చేశారు. ఈమె విజయవాడ రేడియో నిలయ విద్వాంసురాలు. పిల్లల ప్రోగ్రాం అక్కగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరో అక్క వింజమూరి సరస్వతీ కూడా నాటకాలు వేశారు. ఇద్దరు అక్కలు ‘వివిధ భారతి’లో పని చేయడం వల్ల తాయారు కూడా నాటకాల్లో అనేక పాత్రలు వేశారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
పేదలకు సాయంగా…
ఈమెకు కళల పట్ల మక్కువ మాత్రమే కాదు సేవ చేయాలనే ఆశయం కూడా ఉంది. పేదలకు అనేక విధాలుగా సాయం అందిస్తుంటారు. అంతేకాదు ఆ కాలంలో వివేకానందుడి పేరు మీద ఓ స్కూలు ఏర్పాటు చేశారు. పేదలందరికి నాణ్యమైన విద్య అందించాలనే కోరికతో అతి తక్కువ ఫీజులు పెట్టి పిల్లలకు జ్ఞానం అందించేవారు. ఒకటో తరగతి నుండి పై తరగతి వరకు వారు ఎంత ఇవ్వగలిగితే అంత (10 రూపాయలు ఫీజు కూడా ఇచ్చేవారు) తీసుకుని పాఠశాలను నడిపారు. సేవ చేయాలి అనే భావనతో కేవలం పది రూపాయల ఫీజుతో ఆంగ్ల మీడియంలో బడి నడిపించారు. అందులో తెలుగు, ఆంగ్లం, హిందీ మూడు భాషలు పిల్లలకు నేర్పించేవారు. ఆమె నడిపిన పాఠశాల నుండి సైనిక్ స్కూల్‌కీ వెళ్లిన (పూనా లాంటి నగరాల్లో) పిల్లల వల్ల వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాఠశాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తుందనే పేరు తెచ్చుకుంది.
తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు
ఆ పాఠశాలలో చదివిన ఎల్‌కేజీ విద్యార్థిని రెండవ తరగతిలో, యూకేజీ చదివిన వారిని నాల్గవ తరగతిలోకి చేర్చుకునేంత స్థాయి ఉండేది. తిరుపతిలో కూడా ఇంత చిన్న పాఠశాలలో ఇంత మంచి స్టాండర్డ్ ఉండడం చాలా గ్రేట్ అని పొగడ్తలు లభించాయి. అలా పద్దెనిమిదేండ్ల పాటు స్కూలు నడిపిన ఆమె ఇక నడిపే అవకాశం లేక పిల్లలకు టీసీలు ఇచ్చి పంపించేశారు. 7వ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపుతో నడిచిన ఆ పాఠశాల అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంది.
నిత్య విద్యార్థిని
తాయారుకు రాయడమంటే ప్రాణం. ఏదో ఒక రచన చేయకుండా అస్సలు ఉండలేరు. అందుకే ఆరోగ్యం సహకరించకపోయినా రాస్తూనే ఉంటారు. గత నాలుగేండ్ల నుండి అయితే మరింత విస్తృతంగా రాస్తున్నారు. ‘దర్పణం’ అనే పత్రికలో నిరంతరం కవితలు రాస్తుంటారు. అలాగే అక్షరాంజలి, మొలక, తపస్వి మనోహరం, పంచాక్షరి, సప్తస్వర్ణసింగడి వంటి వాటిల్లో అనేక రచనలు చేస్తున్నారు. అలాగే అనేక కొత్త ప్రక్రియలు నేర్చుకొని రాస్తున్నారు. దీనికోసం నిత్య విద్యార్థినిగా అనేక పుస్తకాలు చదువుతూనే ఉంటారు. ఆమె రాసిన కథలు అనేక బహుమతులు కూడా అందుకున్నాయి.
- అచ్యుతుని రాజ్యశ్రీ


