Sunday, March 1, 2026
E-PAPER
Homeమానవిసాహిత్యం స‌మాజానికి అద్దం లాంటిది

సాహిత్యం స‌మాజానికి అద్దం లాంటిది

- Advertisement -

మామిడాల శైలజ.. సమాజ మార్పులో సాహిత్యం ప్రాధాన పాత్ర పోషిస్తుందని నమ్మిన కవయిత్రి. అందుకే తన ప్రతి అక్షరం సమాజహితమై ఉండాలని కోరుకుంటున్నారు. అవే ఆలోచనలతో తన రచనలను కొనసాగిస్తున్నారు. తన అక్షరాలతో సమాజంలోని కుళ్లును కడిగేయాలని తపిస్తున్నారు. అంతేకాదు మనిషిలో ఆత్మవిశ్వాసం పెంచే రచనలు చూస్తూ యువతకు మార్గదర్శిగా నిలుస్తున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…

మా అమ్మ మల్లికాంబ. నాన్న మామిడాల ధర్మయ్య, రైస్‌ మిల్లులో క్లర్క్‌గా పని చేసేవారు. మాది వరంగల్‌. మొత్తం ఏడుగురు పిల్లలం మేము. అందులో నేను ఆరవ దాన్ని. అమ్మ, నాన్న, అన్నలు, అక్కలు సంరక్షణలో గారాబంగా పెరిగాను. చిన్నప్పటి నుంచి చాలా సిగ్గరిని, భయస్తురాలిని. నాలుగవ తరగతి వరకు ఇంట్లోనే ఉండి అన్నయ్యలు, అక్కయ్యల దగ్గర చదువుకున్నాను. బడికి వెళ్లాలంటే భయపడేదాన్ని, వెళ్లినా అక్కయ్య దగ్గరో అన్నయ్య దగ్గరో కూర్చునేదాన్ని. అలా ఇంట్లోనే సాగింది నా చదువు. డైరెక్ట్‌గా నాలుగవ తరగతిలో స్కూలుకు వెళ్లడంతో బేసిక్స్‌ లేక మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ లాంటివి అర్థం కాకపోయేది. ఎలాగోలా చదువు కొనసాగించి పదవ తరగతి కంప్లీట్‌ చేశాను. తర్వాత చదువు అన్నయ్యలు, నాన్న సహకారంతో సాగింది. ఇప్పుడు డాక్టరేట్‌ చేసి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా స్థిరపడ్డాను అంటే వాళ్ల చలవే.

ఇంట్లో అందరూ రాసేవాళ్లే…
సాహిత్యంతో నా పరిచయం ఎలా ఏర్పడిదంటే మా రెండవ అన్నయ్య సతీష్‌ ద్వారా. ఆయన సాహిత్య అభిమాని, చిన్నతనం నుంచి రకరకాల పుస్తకాలు తీసుకొచ్చుకొని చదివేవాడు. నేనూ ఆసక్తి చూపించడం వల్ల నాకు కూడా పిల్లల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. అలా నాకూ సాహిత్యమంటే ఇష్టం ఏర్పడింది. అయితే అది చదవడం వరకే కొనసాగి 2012 నుంచి మూడవ అన్నయ్య ఉమేష్‌ ప్రోత్సాహంతో రాయడం వైపు మళ్ళింది. ఇంట్లో అందరూ రాసేవాళ్లే. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల నాకు కూడా రచనా శక్తి పెరిగింది. ఇప్పుడు ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రంగశాయిపేటలో విధులు నిర్వర్తిస్తూనే నా రచన వ్యాసంగాన్ని కూడా కొనసాగిస్తున్నానంటే అది అందరి ప్రోత్సాహం వల్లే.

వాళ్లలా రాయాలని…
చిన్నతనంలో యండమూరి వీరేంద్రనాథ్‌, మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు బాగా చదివేదాన్ని. వాళ్ల రచనా శైలి, కథను కొనసాగించే విధానం నన్ను ఆశ్చర్యపరిచేవి. ఎప్పటికైనా ఇలా రాయగలనా అనుకునేదాన్ని. చిన్నప్పటి నుంచే పత్రికలకు ఉత్తరాలు రాయడం, కొన్ని శీర్షికలకు సమాధానాలు రాయడం లాంటివి చేసేదాన్ని. తర్వాత తర్వాత ఇంట్లో వాళ్ళ స్ఫూర్తితో రాయాలనే సంకల్పం కలిగింది. దాంతో బయట వాతావరణంలో నన్ను ప్రభావితం చేసిన సంఘటనతో కథలను మలచడం మొదలుపెట్టాను అలా నేను రాసిన మొదటి కథ ‘అత్తారింటికి దారేది?’.

ముద్రించిన రచనలు
నేను ఇప్పటివరకు చాలా కవితలు, కథలు రాశాను. అవి వివిధ పత్రికలలో, పోటీలలో ప్రచురించబడ్డాయి. కవితా, కథా సంకలనాలలో అచ్చు వేయబడ్డాయి. ఇప్పటివరకు ఆరు గ్రంథాలను వెలువరించాను. అందులో ‘ఇక విజయం మీ గుప్పిట్లో’, ‘మీ జీవితానికి మీరే చక్రవర్తి’, ‘గతి తప్పిన రుతువు’. ఇవి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘అంతర్లీనం’ కవిత సంపుటి, ‘మెరికలు’ లఘు కవిత ప్రక్రియ, ‘విపంచిక’ లఘు కవిత ప్రక్రియలు కూడా సామాజిక మాధ్యమాలలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఒక కథా సంపుటి, కవితా సంపుటి ప్రచురణ దశలో ఉన్నాయి.

కత్తి మీద సాము లాంటిదే…
రచనలు చేసే సమయంలో నా కుటుంబ ప్రోత్సాహం మరువలేనిది. నా భర్త నల్లమోహన్‌ రావు రచనల విషయంలో బాగా ప్రోత్సహిస్తారు. నా కొడుకు ధ్రువ బీటెక్‌ కంప్లీట్‌ చేసి జాబ్‌ సెర్చింగ్‌లో ఉన్నాడు. తను కూడా రచయితే. తను ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌ రెయిన్బో’ అనే పోయెట్రీ బుక్‌ రాశాడు. నేను రాసే ప్రతి నవల, కథ మా బాబుతో డిస్కషన్‌ చేసిన తర్వాతే పురుడు పోసుకుంటుంది. ఉద్యోగం, కుటుంబం, సాహిత్యం ఈ మూడింటిని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగడం అంటే కత్తి మీద సాము లాంటిదే. కానీ అసాధ్యం మాత్రం కాదు. మనిషి తలుచుకుంటే అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలడు. ఎందరో గొప్పవారు తమ బిజీ షెడ్యూల్‌లో ఉన్న సమయంలోనే ఎలా కేటాయించుకుంటున్నారు అనేది పరిశీలిస్తూ ఉంటాను. మనసుంటే మార్గం లేదు అంటారు. ఒక ప్రణాళిక ప్రకారం ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను.

సాహిత్యం మార్పు తెస్తుంది
సాహిత్యం సమాజానికి అద్దంలా పనిచేస్తుంది. అది మనుషుల ఆలోచనలను మార్చుతుంది, ప్రశ్నలు రేకెత్తిస్తుంది, అన్యాయాలపై చైతన్యం కలిగిస్తుంది. భావోద్వేగాల ద్వారా మానవత్వాన్ని పెంపొందించి, మార్పుకు దారి చూపించే సాధనం సాహిత్యం. అందుకే ఒక రచయిత్రిగా సమాజంలోని సమస్యలను ఎత్తిచూపి వాటిపై అవగాహన కల్పించి పరిష్కారం మార్గం దిశగా నడిపించేలా పాఠకులలో ఆలోచన రేకెత్తించడమే నా కర్తవ్యం. ప్రతి రచనకు ఒక సామాజిక ప్రయోజనం ఉండాలని నేను ఆశిస్తాను. అలాగే సమాజంలోనే వివిధ సంఘటనల పట్ల మనం స్పందించే విధానంలో మనదైన ముద్ర ఉండాలి అని నేను భావిస్తాను.

సామాజిక సమస్యలపై…
ఒక రచయిత్రిగా, పురస్కారాలు సన్మానాలు నేను ఆశించడం లేదు. మామిడాల శైలజ అంటే ఒక ప్రభావమంతమైన రచయిత్రి, సమాజంతో మమేకమై సమస్యలను ఓన్‌ చేసుకొని తనదైన దృక్కోణంలో వాటిని అక్షరీకరిస్తుంది అని పాఠకులు అనుకుంటే చాలు. నా ప్రతి కవిత, కథా, నవల సమాజపక్షంగా అందులోని కుళ్ళు కుతంత్రాలను కడిగేసే విధంగా నాదైనా శైలితో ముందుకు సాగాలన్నదే నా ఆశయం. పెద్దగా పురస్కారాలు, గౌరవాలు ఇష్టపడను. నాకు వచ్చిన పురస్కారాలు కూడా తక్కువే. నా రచనల్లో నాకు పెద్దగా పేరు తీసుకొచ్చినవి వ్యక్తిత్వ వికాస గ్రంథమైన నా మొదటి రచన ‘మీ జీవితానికి మీరే చక్రవర్తి’. తర్వాత టర్నర్స్‌ సిండ్రోమ్‌ అనే సమస్యపై రాసిన ‘గతి తప్పిన రుతువు’ నవల విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇది ఆంగ్ల, హిందీ భాషలలోకి అనువదించబడి అందరికీ అందుబాటులో ఉంది.
సలీమ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -