పువ్వు పుట్టగానే పరిమళిస్తోంది అన్నట్టుగా బాల్యం నుండే ఆటల్లో, పాటల్లో ముందుండేవారు డా.ధనాశి ఉషారాణి. చదువులో రాణిస్తూనే వ్యాసరచన, వకృత్వ పోటీల్లో పాల్గొంటూ అనేక ప్రశంసలు పొందారు. పెండ్లి తర్వాత నాలుగ్గోడలకే పరిమితం కాకుండా సాహిత్యంలో రాణిస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మాయిల్లో అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. సమాజం నుంచి పుట్టుకొచ్చే విమర్శనా బాణాలనే తన విజయ అస్త్రాలుగా మలుచుకుంటూ.. నలుగురికి మార్గదర్శకురాలిగా నిలిచిన ఆమె పరిచయం నేటి మానవిలో…
సైన్స్ టీచర్‌గా ఉన్న ఆమె సాహిత్యం మీద ఉన్న మక్కువతో ఎం.ఎ తెలుగు చేసి తెలుగు అధ్యాపకురాలయ్యారు. అలుపెరుగని సాహితీ సేద్యం చేస్తూ ఎన్నో అవార్డులు రికార్డులు అందుకుంటున్నారు. నిరంతర విద్యార్థిగా అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చే ఆమె ప్రస్తుతం చెన్నైలో రసాయన శాస్త్రంలో పార్ట్ టైం పీహెచ్‌డీలో రీసెర్చ్ చేస్తున్నారు. అలాగే సాహితీ లోకంలో వినూత్న ప్రక్రియలను సృష్టిస్తున్నారు. సిరిమంజరి, రాగగీతి, రాగఝరి, పద్యచంద్రిక సోయగం, పంచరవళి, ప్రాసమళిఝరి లాంటి నూతన సాహితీ ప్రక్రియలను ప్రత్యేక ఛందస్సుతో రూపొందించారు. అనేక మంది కవులును ఒక చోటకు చేర్చే వాట్సప్ సమూహాల్లో పద్యాలు రాయిస్తూ రాగగీతిమిత్ర, రాగగీతిరత్న, రాగగీతిభూషణ్, రాగగీతికవి విభూషణ్, కవిసామ్రాట్ లాంటి బిరుదులుతో గౌరవిస్తున్నారు. ఆమె చేస్తున్న ఈ కృషికి యూనివర్శిటి స్థాయిలో అనేక బహుమతులు అందుకున్నారు.
కవి సమ్మేళనాల నిర్వహణ
రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక మంది జానపద కళాకారులను, వినూత్నమైన టాలెంట్ ఉన్న వారిని గుర్తిస్తూ అనేక కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. వివిధ పురస్కారాలతో ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నారు. మరుగున పడుతున్న ఏకపాత్ర అభినయాలు, తోలుబొమ్మలాట లాంటివాటికి జీవం పోస్తున్న సాహితీ ప్రేమికురాలు ఆమె. ఆకాశవాణిలో నిత్యం నూతన కవితలు, కథలు వినిపిస్తున్న ప్రవాహఝరి. ప్రతి మూడు నెలలకి ఓసారి కవితా గానం, పద్య గానం, కథానికి సమీక్షతో ఆకాశవాణిలో ఓ చెరగని ముద్ర వేసుకున్నారు. అందరినీ ఆకట్టుకునే శృతిమెత్తని స్వరం ఆమె సొంతం. రేడియోలో మహిళా కవి సమ్మేళనం, సైన్సు ప్రశ్నోత్తర కార్యక్రమంలో పాలుపంచుకొంటూ వుంటారు.
ముద్రిత రచనలు
ఉషారాణి ఇప్పటి వరకు అనేక పుస్తకాలు ముద్రించారు. ఆటవెలది తేటగీతి, ఇష్టపది, మొగ్గలు, నానీలు, హరివిల్లు, చిమ్మీలు, హైకూలు, తొణుకులు, గజల్ లాంటి ప్రక్రియలు రాస్తూనే ఉన్నారు. సిరిమంజరి, ఆటవెలది శతకం, మొగ్గలుశతకం, రాగగీతిశతకం, రాగఝరి శతకం, పంచరవళి శతకం, పద్యచంద్రిక శతకం వంటి పుస్తకాలు ముద్రించారు.
అవార్డులు, ప్రశంసలు
ఉపాధ్యాయురాలిగా పాఠశాల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, జిల్లా స్థాయిలో సర్వేపల్లి రాధకృష్ణ అవార్డు, గిడుగు రామ్మూర్తి స్మారక పురస్కారం, రాష్ట్ర స్థాయిలో సావిత్రీ భాయి పూలే అవార్డులు ఆమె అందుకున్నారు. సేవా రంగంలో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అలాగే సాహిత్య రంగంలోనూ గౌరవ డాక్టరేట్‌ను పొందారు.
భవిష్యత్తు కళల లోగిలి
భవిష్యత్‌లో శతక పుస్తకాలను ముద్రించి బాల సాహితీ వేత్తగా అడుగులు వేస్తూ సాగిపోవాలని ఆమె కోరుకుంటున్నారు. అలాగే అధునాతన పాత మెలోడీ సింగర్‌గా, రంగస్థల పాత్రలకు జీవం పోసే ఓ కళాకారిణిగా నాట్యరంగంలో ముందుకు పోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే తెలుగు భాషపై, సాహిత్యాభివృద్ధికై అనేక సెమినార్లలో పాల్గొన్న ఆమె ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలనుకుంటున్నారు. భవిష్యత్‌లో తెలుగు మహా సభలు జరపాలని కోరుకుంటున్నారు.
సేవా రంగంలో…
ఉషారాణి సాహిత్య సేవతో పాటు సేవా రంగంలోనే ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించారు. అలాగే అమ్మాయిలకు సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు సదస్సులు పెడుతున్నారు. లా కాలేజీ విద్యార్థులతో రూల్స్ యాక్ట్స్ నియమాలపై క్యాంపులు, సదస్సులు నిర్వహిస్తూ దేశ భద్రత గురించి వివరిస్తున్నారు. పచ్చని చెట్లు నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా కౌమార దశ గురించి ఆడపిల్లల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేస్తున్నారు.
- అచ్యుతుని రాజ్యశ్రీ



