సామాన్యప్రజల కోణంలో కథలు రాయడం గొప్ప విషయం : తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి
రచయితలను గుర్తించి ఇచ్చే పురస్కారాలు విలువైనవి : తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి
కె.ఆనందాచారి, జ్యోతిలకు మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారాలు ప్రదానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మనుషులను మార్చే ఔషధం సాహిత్యమనీ, సామాన్య ప్రజల కోణంలో కథలు రాయడం గొప్ప విషయమని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. ప్రముఖ రచయిత, తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటుకోజ్వల ఆనందాచారి రాసిన గస్సాల్ కథా సంపుటి, ప్రముఖ రచయిత టి.జ్యోతి రచించిన ఉలిపికట్టెలు కథా సంపుటిలకు డాక్టర్ మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కారాలు-2025, 2026 లభించిన విషయం విదితమే. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆనందాచారి, జ్యోతిలకు ఆ పురస్కారాలను నందిని సిద్ధారెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏను నర్సింహారెడ్డి అందజేశారు. పదివేల రూపాయల నగదు పురస్కారంతో పాటు మెమెంటోలను గ్రహీతలకు ఇచ్చారు. ఈ సందర్భంగా ‘నేటి కాలపు మేటి కథకులు’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
డాక్టర్ నాళేశ్వరం శంకరం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ..24 ఏండ్లుగా కథా ప్రక్రియలో మాడభూషి రంగాచార్య పేరిట పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. రచయితలకు గుర్తింపు దక్కడంలో, వారి సాహిత్యం ఫోకస్ కావడంలో పురస్కారాలు దోహదపడతాయని చెప్పారు. ఎన్ని పేర్లతో పురస్కారాలుంటే అంత మేరకు సాహిత్య అభివృద్ధికి ఉపయోగపడుతాయని తెలిపారు. మనుషులను మార్చే ఔషధం సాహిత్యమన్నారు. సామాన్య ప్రజల కోణంలో ఆనందాచారి, స్త్రీ కోణంలో జ్యోతి కథలు రాయడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రజల హృదయాల్లో నిలిచే కథలు, నవలు, సాహిత్యం రాయడం శ్రమతో కూడుకున్న విషయమని చెప్పారు.
మార్క్సిస్టు దృక్పథం పట్ల, సమాజం పట్ల లోతయిన అవగాహన ఉన్న రచయితగా ఆనందా చారి గుర్తింపు పొందారన్నారు. ఆయన రాసిన గస్సాల్ కథా సంపుటిలోకి కథల్లో అది అడుగడుగునా కనిపించిందని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే కథలు రాశారని కొనియాడారు. ‘ఉలిపి కట్టెలు’ కథా సంపుటి ద్వారా మహిళల హృదయ సారాన్ని పాఠకులకు చెప్పడంలో జ్యోతి విజయవంతమైందని ప్రశంసించారు. సాహిత్యం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనీ, రాయడం తనకు థెరఫీలాగా పనిచేస్తుందని ఆమె తన రచనల్లో చెప్పడం బాగుందన్నారు. డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకుంటే వచ్చే పురస్కారాల కంటే సాహిత్యాన్ని గుర్తించి ఇచ్చే పురస్కారాలు విలువైన వని చెప్పారు.
ఆనందాచారి కథల సంపుటిలో పేదల పక్షాన నిలిచే కథలు కనిపించాయనీ, జ్యోతి కథల్లో కష్టాలను భరిస్తూ బలియమైన శక్తిగా మహిళలు మారేలా ఉన్నాయని వివరించారు. మాడభూషి రంగాచార్యులు రైల్వే ఉద్యోగి అయినప్పటికీ సాహిత్యపిపాసి కాబట్టే మన అందరి నోళ్లలో ఉన్నారని తెలిపారు. ఆనందాచారి, జ్యోతి నుంచి సమాజానికి దోహద పడే మరింత సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. ‘గస్సాల్’ పుస్తక పరిచయాన్ని రచయిత సమ్మెట ఉమాదేవి చేశారు. ‘ఉలిపికట్టెలు’ పుస్తక పరిచయాన్ని కవి, రచయిత రూపారుక్మిణి చేశారు. ఆ రెండు పుస్తకాల్లోని కథల సారాంశాన్ని వారు సమగ్రంగా విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో మాడభూషి రంగాచార్య స్మారక సంఘం అధ్యక్షులు శీలా సుభద్రాదేవి, కన్వీనర్ మాడభూషి లలిత, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



