న్యూఢిల్లీ : వెనిజులాలో నెలకొన్న సంక్షోభం భారత వాణిజ్యంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) సంస్థ తెలిపింది. 2000, 2010 దశకాలలో వెనిజులా ముడి చమురును భారత్ భారీగానే కొనుగోలు చేసింది. అయితే అమెరికా విధించిన ఆంక్షల కారణంగా 2019 నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం బలహీనపడింది. ‘వెనిజులా పరిణామాలు భారత్‌పై పెద్దగా ప్రభావం చూపవు. అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత వెనిజులాతో వాణిజ్యం దెబ్బతిన్నది. 2024-25లో ముడి చమురు దిగుమతులు 81.3 శాతం పడిపోయాయి. కాబట్టి ద్వైపాక్షిక వాణిజ్యం నామమాత్రమే’ అని జీటీఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజరు శ్రీవాత్సవ ఆదివారం నాడు తెలిపారు. భారత్‌పై ఆర్థికంగా లేదా ఇంధన పరంగా ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆయన చెప్పారు. వెనిజులాపై అమెరికా విధించిన ఆంక్షలతో ఆ దేశం నుంచి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా తగ్గించుకుంది. సెకండరీ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి వాణిజ్య కార్యకలాపాలను కుదించుకుంది. ఫలితంగా ప్రస్తుతం వెనిజులాతో భారత్ వాణిజ్యం చాలా స్వల్పంగా ఉన్నదని, పడిపోతోందని శ్రీవాత్సవ తెలిపారు. 2024-25లో వెనిజులా నుంచి జరిగిన మొత్తం దిగుమతుల విలువ 364.5 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇందులో ముడి చమురు వాటా 255.3 మిలియన్ డాలర్లు. 2023-24లో జరిగిన ముడి చమురు దిగుమతులతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 81.3 శాతం పడిపోయాయి. వెనిజులాకు భారత ఎగుమతులు కూడా తక్కువే. మొత్తం 95.3 మిలియన్ డాలర్ల విలువ కలిగిన ఎగుమతులు జరగ్గా వాటిలో ఔషధ ఎగుమతుల వాటా 41.4 మిలియన్ డాలర్లు. ప్రపంచ చమురు నిల్వల్లో వెనిజులా వాటా 18 శాతంగా ఉంది. సౌదీ అరేబియా (16 శాతం), రష్యా (5-6 శాతం), అమెరికా (4 శాతం) కంటే ఇది ఎక్కువే.



