– వలసకూలీల పిల్లలు బడికి పోయేది ఆరు నెలలే
– కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి పాలమూరుకు వలసలు
– మంత్రాలయం నుంచి వచ్చిన కూలీల జీవన గాధ
”మేమూ.. మా పిల్లలు ముందు బతకాలి. ఆ తర్వాతనే వారికి బడి.. రెక్కల కష్టం తప్ప ఆస్తులు, ఆదాయం లేని మాకు కూలి పనులు దొరికినప్పుడే ఇంటిల్లిపాదీ పనిచేసేది.. ఊర్లో పనిలేకపోతే.. ఇతర రాష్ట్రాల్లో ఆరు నెలలపాటు వలసపోయి కూలి పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తాం. పిల్లాజెల్లా కలిసి పని చేస్తేనే పూటగడుస్తది.. లేకుంటే పస్తులుండాలి.. అందుకే పత్తి చేనుల్లో పిల్లలు సైతం మాతో కలిసి పనిచేస్తున్నారు. ఊర్లో ఉన్నప్పుడే బడి.. ఆ తర్వాత మాతోపాటు వలస వచ్చి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. పత్తి, మిర్చి, వేరుశనగ పంటలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కూలి పనులు చేసుకుంటామని..” కర్నూలు, కర్నాటక నుంచి పాలమూరుకు వలస వచ్చిన కూలీలు ‘నవ తెలంగాణ’తో తమ బాధలు చెప్పుకున్నారు.
నవతెలంగాణ మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కూలి పనుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని మంత్రాలయం, కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వలస వస్తున్నారు. 10 ఏండ్ల వయసులోపు పిల్లలను కూడా పెద్దలతోపాటు తీసుకొచ్చి కూలీ పనులు చేయిస్తున్నారు. తెల్లవారంగానే సద్ది మూట కట్టుకొని పనులకు వెళుతున్నారు. నాలుగు, ఐదు తరగతులు చదివే పిల్లలను కూడా చదువు బంద్ చేసి తమ వెంటబెట్టుకొచ్చారు తల్లిదండ్రులు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిన్న బోయినపల్లి నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి, నాగర్‌కర్నూల్, తాడూరు మండల పరిధిలోని తాళ్లపల్లి, నడిగడ్డ, కారువంగా, పులిజాల, జమిస్తాపూర్, గుంతకోడూరు గ్రామాలకు వలస వచ్చారు. పత్తి చేనులో పత్తి తీస్తున్నారు. ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉండటంతో రోజుకు 12 నుంచి 13 కిలోల పత్తి తీస్తున్నారు. పత్తి బాగా ఉంటే 20 కిలోల దాకా తీసేవారు. కిలోకు 15 రూపాయలిస్తే 12 కిలోలకు రూ.180 వస్తాయి. అందుకే తమతోపాటు పిల్లలను కూడా పనికి తీసుకొచ్చుకున్నామని తల్లిదండ్రులు వాపోయారు. మంత్రాలయం రాయచూర్, కర్నూల్ ప్రాంతాల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు పత్తి తీసేందుకు కూలీలు వస్తున్నారు. వేరుశనగ, మిర్చి చేనుల్లో పనిచేయడానికి కూడా వలస కూలీలు వస్తున్నారు. గతంలో వలసల పాలమూరు నుంచి అనేక ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్లేవారు. ఇప్పుడు పాలమూరు జిల్లాకే వలసలు రావడం గమనార్హం.
చదువులకు పిల్లలు దూరం ..
బతుకుదెరువు కోసం పాలమూరు జిల్లాకు వచ్చే కూలీలు తమ బిడ్డలను సైతం తీసుకొస్తున్నారు. నాలుగు నుంచి 10 తరగతులు చదివే విద్యార్థులు కూడా పత్తి చేలల్లో పనుల్లో ఉంటున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల చదువులకు దూరమవుతున్నారు.
కూలీల కొరత..
మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు పెరిగింది. ప్రాజెక్టుల నీరు వచ్చి ఆరుతడితోపాటు వరి సాగు రెండింతలు అయింది. కూలీల అవసరం పెరిగింది. పత్తి తీయడం, వరి నాటడం వంటి పనులు కూలీల చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కూలీల కొరత ఏర్పడుతోంది. అందుకే ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు.
బతకడం కోసం తప్పదు..
మా ప్రాంతంలో పత్తి పనులు ముగిశాయి. అక్కడ ఇతర పనులు దొరకడం లేదు. కుటుంబం గడవడం కోసం ఇక్కడికి వచ్చాం. మా దగ్గర పనులు మొదలయ్యే సరికి అక్కడికి వెళ్తాం. లక్ష్మణ్, మంత్రాలయం, కర్నూలు జిల్లా
చదువుల కోసం అక్కడుంటే బతికేదెట్టా..
రెక్కాడితేగానీ డొక్కనిండని బతుకులు.. ఈ పరిస్థితుల్లో పిల్లలను చదువుల కోసం అక్కడే వదిలేసి వస్తే పస్తులుండాలి. ఆకలి చావులు తప్పవు. అందుకే పిల్లలను ఆరు నెలలపాటు బడి మాన్పిస్తాం.. మాతోపాటు పత్తి తీయడానికి పిల్లలు వస్తే కొంత ఆదాయం వస్తుంది. –-పెద్ద నరసయ్య, చిన్న బోయినపల్లి, మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా
ఎక్కడ బతుకుదెరువు ఉంటే అక్కడికి వెళ్తాం
సొంత ఆస్తులు లేవు. ఉద్యోగాలు లేవు.. జీవనోపాధి కోసం పిల్లలను వెంటబెట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చాం. నెలరోజుల పాటు పనిచేసుకొని వెళ్తాం. మళ్లీ మిర్చి పంట తీసే సమయంలో ఇక్కడికి వస్తాం.- మహాదేవి, మంత్రాలయం
మాకు ఆస్తులు లేవు
నా భర్త చనిపోయిండు. మాకు ఎటువంటి ఆస్తులూ లేవు. మా జిల్లాలో కూలి పనులు దొరకడం లేదు. కొంతైనా తిండి గింజలు సమకూర్చుకోవచ్చని ఇక్కడికి వచ్చాం. నాతోపాటు మా పిల్లలు కూలి పనులకు వస్తున్నారు.
మరియమ్మ, కర్నూలు జిల్లా, చిన్న బోయినపల్లి