సమాచారం ఇవ్వకుండా షాపులు తొలగించారు
నల్లగొండలో చిరు వ్యాపారుల ఆవేదన
ప్రకాశం బజార్లో చిరు వ్యాపారుల తరలింపు
ట్రాఫిక్ జామ్, ప్రమాదాలు లేకుండా ఉండేందుకే చర్యలు : అధికారులు
తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఒకే చోట సముదాయం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
‘నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం అయినా కొన్ని గంటల వ్యవధిలోనే మాపై కొరడా ఝలిపించింది’ అని ప్రకాశం బజారులో ఉన్న చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. నల్లగొండ కార్పొరేషన్ పాలకవర్గం ప్రమాణస్వీకారం జరిగిన రోజు రాత్రి రోడ్డు భవనాలు సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ పట్టణంలో రాత్రి బస చేశారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రకాశం బజార్ పరిసరాలను కాలినడకన పరిశీలించారు.
చిరువ్యాపారులు రోడ్డుపై ఉండటం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు, ప్రమాదాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంత్రి ఆదేశాలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. 40 సంవత్సరాలుగా 70 మందికి పైగా ప్రకాశం బజారులో చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు. చిరు వ్యాపారం చేసుకునే వారికి అన్యాయం చేయమంటూనే ప్రకాశం బజార్ ప్రాంతంలో మధ్యలో ఉన్న డివైడర్‌ను ఆగమేఘాల మీద రెవెన్యూ అధికారులు పోలీస్‌ల బందోబస్తు మధ్య తొలగించారు.
స్మార్ట్ సిటీ చేయాలని…
సూపర్ స్మార్ట్ సిటీ చేయాలనే తపనతో మాకు ఉపాధి లేకుండా చేశారని చిరు వ్యాపరులు ఆవేదన చెందుతున్నారు. అనుకున్నది తడువుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పోలీస్ బలగాలు అధికార వర్గాలు వ్యాపారం చేసుకుంటున్న తోపుడుబండ్లను చిన్నచిన్న దుకాణాలను తొలగించేశారు. దీంతో ఎక్కడ వ్యాపారం పెట్టుకోవాలో తెలియక తెచ్చుకున్న సరుకులు చెడిపోయి రెండు రోజులుగా వ్యాపారం బంద్ అయింది. ఏం జరుగుతుందో తెలియడం లేదని చిరు వ్యాపారులు అంటున్నారు.
పాత కలెక్టరేట్ సమీపంలో తాత్కాలిక ఏర్పాట్లు
పండ్లు, పూలు అమ్ముకునే చిరు వ్యాపారుల కోసం పట్టణంలోని పాత కలెక్టరేట్ స్థలం పక్కనున్న ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్ మ్యాట్ లతో దుకాణం ఏర్పాటుచేసి లక్కీ డ్రా ద్వారా వ్యాపారుల స్థలాలను ఎంపిక చేస్తామని అంటున్నారు.
రూ.5వేలు నష్టపోయాను : పండ్ల వ్యాపారి యబా
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పోలీసులు, అధికారులు వచ్చి ఖాళీ చేయించడంతో అమ్ముకోవడానికి తెచ్చుకున్న పండ్లు మొత్తం పాడైపోయాయి. సుమారు రూ.5వేల నష్టం జరిగింది. ఇకనైనా శాశ్వత పద్ధతిన మార్కెట్ ఏర్పాటు చేసి మాకు సహకారం అందించాలి.
20 ఏండ్లుగా వ్యాపారం చేసుకుంటున్న : పండ వ్యాపారి యాకూబ్
ప్రకాశం బజార్లో గత 20 ఏండ్లుగా మా తండ్రితో పాటు నేను కూడా జామకాయల వ్యాపారం చేస్తున్నాను. ఈ వ్యాపారమే మాకు జీవనాధారం. అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలి.
వ్యాపార సముదాయం ఏర్పాటు చేయాలి : సీఐటీయూ జల్లా సహాయకార్యదర్శి దండెంపల్లి సత్తయ్య
నల్లగొండ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా ప్రకాశం బజార్లో చిరు వ్యాపారం చేసుకునే వారిపై ఎలాంటి సమాచారం లేకుండా తొలగించడం అన్యాయం. ఏండ్ల తరబడి ఈ వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి శాశ్వత పద్ధతిన చిరు వ్యాపారుల సముదాయాన్ని ఏర్పాటు చేసి ఇవ్వాలి.
ప్రమాదాలు జరగకుండా చర్యలు : నల్లగొండ డీఎస్పీ శివరామిరెడ్డి
ప్రకాశం బజార్లో నిత్యం క్రయవిక్రయదారులతో కిటకిటలాడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ జామ్ సమస్య ఉంది. దీని నివారణ కోసమే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. కార్పొరేషన్ అధికారులు సూచించిన ప్రదేశంలో తాత్కాలిక మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.
తాత్కాలిక ఏర్పాటు ్లచేస్తున్నాం : నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి
రంజాన్ మాసం ప్రారంభమవుతున్న క్రమంలో పండ్ల మార్కెట్ వ్యాపారులు నష్టపోవద్దని ఆలోచనతో పాత కలెక్టరేట్ సమీపాన ఉన్న ఖాళీ స్థలంలో పూలు, పండ్ల వ్యాపార సముదాయం ఏర్పాటు చేస్తున్నాం. కార్పొరేషన్ అధికారులు ప్రకాశం బజారులో వ్యాపారం చేసుకుంటున్నా చిరు వ్యాపారలను గుర్తించి లాటరీ పద్ధతి ద్వారా స్థలం కేటాయించి తాత్కాలికంగా దుకాణ సముదాయం ఏర్పాటు చేస్తున్నాం. రంజాన్ మాసం ముగిసిన తర్వాత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా శాశ్వతంగా వ్యాపార సముదాయం ఏర్పాటు చేస్తాం.



