• సర్పంచ్ గుగులోత్ పటేల్ నాయక్
నవతెలంగాణ -పెద్దవంగర
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన పశుసంపద ను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజమాన్ సింగ్ తండా సర్పంచ్ గుగులోత్ పటేల్ నాయక్ అన్నారు. తండాలోని పశువులకు పశుసంవర్ధక శాఖ సహాయకులు వాంకుడోత్ అనిల్ ఆధ్వర్యంలో బుధవారం గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతుల జీవనాధారానికి పశువులు ఆధారం కావడంతో వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
పాలు, ఎరువు, వ్యవసాయ పనుల్లో ఉపయోగపడే పశువులను ఆరోగ్యంగా ఉంచడం ప్రతి రైతు బాధ్యత అని గుర్తు చేశారు. పశువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చునని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే పశు ఆరోగ్య శిబిరాలు, ఉచిత టీకా కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాడి రైతులు పాల్గొన్నారు.



