పాఠ్యాంశాలకు దృశ్య రూపం
మంత్లీ మేగజైన్‌తో ప్రణాళిక
టీఎల్‌ఎం రూమ్‌తో బోధన సులభతరం
గురుకుల విద్యాబోధనలో రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న
టీఎస్‌యూటీఎఫ్ లీడర్ లివిన్
కలెక్టర్ సహా పలువురు ప్రముఖులచే ప్రశంసలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
టీచర్లందరూ పాఠాలు బోధిస్తారు… కానీ కొందరు మాత్రమే ఆకట్టుకోగలుగుతారు.. అలాంటి అరుదైన ఉపాధ్యాయుల్లో ఒకరు లివిన్. సాంఘిక శాస్త్రాన్ని ఓ ప్రణాళికాబద్ధంగా… అత్యంత సరళంగా… పాఠ్యాంశాలు బోధిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నారు. గురుకుల విద్యా బోధనలో రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న టీఎస్ యూటీఎఫ్ లీడర్ లివిన్ … ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సహా పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. మంత్లీ మేగజైన్ ద్వారా సాంఘిక శాస్త్ర బోధనకు సరికొత్త దిశా దశ చూపిస్తున్నారు. సాంఘిక శాస్త్రం అంటే విద్యార్థులకు జీవన విధానాన్ని చూపించేది. ఇందులోని పాఠ్యాంశాలు రోజువారీ జీవితంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంటాయి.
కానీ కొన్ని అంశాలపై పాఠశాల స్థాయి విద్యార్థులకు అంతగా అవగాహన ఉండదు. వాటిని ప్రాక్టికల్ గా చూపిస్తే… విద్యార్థుల చేత పాఠ్యాంశాలకు సంబంధించిన కృత్యాలు చేయిస్తే… ఎంతటి కఠినతరమైన అంశమైనా ఇట్టే బోధపడుతుంది. సాంఘిక శాస్త్ర మేగా…! అని దులిపేసుకునే బోధన చేయకుండా… ప్రతీ అంశాన్నీ విద్యార్థుల కండ్లకు కట్టినట్లుగా చూపించాలి అనుకున్నారు లివిన్. అంతటితో ఆగకుండా దానికి సంబంధించిన కృత్యాలు చేయిస్తూ… వాటిని మంత్లీ మేగజైన్ లో పొందుపరుస్తూ విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, సామాజిక బాధ్యత, నాయకత్వ పటిమ, నేర్చుకునే తపన, ఆలోచనా శక్తి, క్రమశిక్షణ, అభ్యసన శక్తి సామర్థ్యాలు… ఇలా అనేక అంశాలను ఈ మేగజైన్ ద్వారా లివిన్ పెంపొందిస్తున్నారు.
మంత్లీ మేగజైన్ కృత్యాలతో విద్యా విప్లవం
మహాత్మ జ్యోతిరావు పూలే రఘునాథపాలెం బీసీ బాయ్స్ గురుకుల పాఠశాలలో లివిన్ తన మంత్లీ మేగజైన్ ద్వారా విద్యా విప్లవాన్ని తీసుకొస్తున్నారు. స్వతహాగా టీఎస్ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం లీడర్ అయిన లివిన్…ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని నిత్యం తలపిస్తుంటారు. దానిలో నుంచే ఈ మంత్లీ మ్యాగజిన్ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అది ఇప్పుడు విద్యార్థులకు ఓ కల్పతరువుగా మారింది. ఈ మేగజైన్ లో విద్యార్థులు చేసిన వివిధ యాక్టివిటీస్, వ్యాసాలు, కథనాలు, చిత్రాలు, మ్యాప్ వర్క్, క్విజ్‌లు, చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరనీతి శాస్త్రం, అర్థశాస్త్రానికి సంబంధించిన అంశాలకు చోటు కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియలో విద్యార్థులే రచయితలుగా, చిత్రకారులుగా మారడం గమనార్హం. చదువుతో పాటు రాయటం, ఆలోచించటం, అభిప్రాయాలను వ్యక్త పరచటం వంటి నైపుణ్యాలు ఈ మేగజైన్ ద్వారా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ మేగజైన్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎంజేపీఆర్ సీఓ రాంబాబు సంయుక్తంగా ఆవిష్కరించారు.
టీఎల్‌ఎం రూమ్ సైతం…
సాంఘిక శాస్త్ర బోధనను సరళతరం చేసే ప్రక్రియలో భాగంగా టీఎల్‌ఎం (టీచింగ్ – లెర్నింగ్ – మెటీరియల్) రూమ్ ను సైతం పాఠశాలలో నెలకొల్పారు. సాంఘిక శాస్త్రానికి సంబంధించిన మ్యాపులు, చార్టులు, టైమ్‌లైన్లు, మోడల్స్, ఫ్లాష్ కార్డ్స్ వంటి బోధనా సామగ్రిని స్వయంగా తయారు చేసి ఈ ప్రత్యేక గదిలో భద్రపరిచారు. దీని ఫలితంగా పాఠాలు బోరుగా కాకుండా… ఆసక్తికరంగా మారాయి. ”చదివితే మరిచిపోతాం, చూసి నేర్చుకుంటే గుర్తుంటుంది” అన్న సూత్రం ఆధారంగా ఈ టీఎల్ ఎం రూమ్ ను రూపొందించినట్టు లివిన్ తెలిపారు.
సోషల్ స్టడీస్ ల్యాబ్ ప్రాక్టికల్ విద్యకు ప్రత్యక్ష ఉదాహరణ
లివిన్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు
విద్యార్థులు తయారుచేసిన మోడల్స్ ను ఒకచోట భద్రపరిచి విద్యా వనరులుగా ఉపయోగించాలనే ఆలోచనతో సోషల్ స్టడీస్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాం. పార్లమెంట్, శాసనసభ, ఎన్నికల విధానం, భూగోళ ఆకృతులు, చారిత్రక కట్టడాల మోడల్స్ ఈ ల్యాబ్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ ల్యాబ్ ద్వారా పిల్లలు కేవలం పాఠాలు చదవడం కాకుండా, ప్రాక్టికల్‌గా చూసి, చేసి నేర్చుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, పౌర హక్కులు కర్తవ్యాలు వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన పెరుగుతోంది. పరీక్షల్లో కూడా విద్యార్థుల ప్రతిభ మెరుగుదల ఉంది. సరైన ఆలోచన, కృషి ఉంటే ప్రభుత్వ పాఠశాలపై ఉన్న అపోహలను తొలగించవచ్చు. విద్యార్థుల్లో జ్ఞానం మాత్రమే కాదు, సామాజిక బాధ్యత, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేలా ఉపాధ్యాయుల కృషి ఉండాలనేదే అభిమతం.



