– 30 మీటర్ల పరిధి దాటి నోటీసులు ఇచ్చే హక్కు ఎల్ఎండి అధికారులకు లేదు
– కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్తా.. కలెక్టర్‌తో త్వరలో చర్చిస్తాం
– ప్రభుత్వ కట్టడాలకు నోటీసులు ఇవ్వకుండా పేదలను టార్గెట్ చేస్తారా..?
– పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు మానుకోవాలి
– మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు విజ్ఞప్తి
– ఎల్ఎండి బాధితులను పరామర్శించిన బిజెపి నేత
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఎల్ఎండి అధికారులు 30 మీటర్ల పరిధిని దాటి సప్తగిరికాలనీ పరిధిలోని పేదలకు, హస్నాపూర్ కాలనీవాసులకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, బీజేపీ నేత, మాజీ మేయర్ వై. సునీల్ రావు బుధవారం బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం న్యాయమైన గరిష్ఠ హద్దులు దాటుకొని భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. “పేదల నివాసాలే లక్ష్యంగా మారడాన్ని సహించం, నోటీసులు ఉపసంహరించకపోతే పెద్దస్థాయి ఆందోళన చేపడతాం” అని ఘాటుగా హెచ్చరించారు.

కరీంనగర్ నగరంలోని సప్తగిరి కాలనీ పరిధిలో బతుకమ్మ కాలనీ, హస్నాపూర్ కాలనీ, పెద్దమ్మ కాలనీల్లో నివాసముంటున్న వాసులకు ఎల్ఎండి అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. డ్యాం కట్ట 30 మీటర్ల పరిధిలో ఉన్న భూభాగంలో అనధికారికంగా నివసిస్తున్నారనే కారణంతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బీజేపీ నేత, మాజీ మేయర్ వై. సునీల్ రావు బాధితులను పరామర్శించి, వారి ఆవేదన విన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, “ఎస్సారెస్పీ లేదా ఎల్ఎండి అధికారులకు 30 మీటర్ల దాటి చర్యలు చేపట్టే హక్కు లేదు. తమ పరిధిని మించి ప్రజలపై ఒత్తిడి తేవడం చట్ట విరుద్ధం,” అని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ ట్యాంకులు, ఆర్టీవో కార్యాలయం, ఐటీ టవర్, కేంద్ర విద్యాలయం వంటి ప్రభుత్వ నిర్మాణాలు కూడా డ్యాం కట్ట సమీపంలోనే ఉన్నా, వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. “బండి సంజయ్ వెంటనే కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారానికి హామీ ఇచ్చారు,” అని తెలిపారు.
