ఇదీ బీహార్ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం
పాట్నా : బీహార్ శాసనసభ ఎన్నికల పోలింగ్ నేటితో ముగుస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో అన్ని రాజకీయ పార్టీలూ హామీల వరద పారించాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రంలో వాటిని ఎలా అమలు చేస్తాయో, నిధులు ఎలా సమకూర్చుకుంటాయో ఏ ఒక్క పార్టీ కూడా వివరించలేదు. 2022-23వ సంవత్సరపు కాగ్ నివేదికను పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అర్థమవుతుంది. ఓ వైపు తడిసి మోపెడవుతున్న ఖర్చులు, మరోవైపు అరకొర ఆదాయం ఆ రాష్ట్రంపై మోయలేని రుణభా రాన్ని మోపుతున్నాయి. అయినప్పటికీ రాజకీయ పార్టీలకు ఇదేమీ పట్టడం లేదు. అలవికాని హామీలతో ఓట్లను కొల్లగొట్టడమే వాటి లక్ష్యం.
ఆదాయంలో 40 శాతం అప్పులే
2022-23లో బీహార్ ద్రవ్య లోటు 6.01 శాతం. రెవెన్యూ లోటు అక్షరాలా రూ.11,288 కోట్లు (జీఎస్‌డీపీలో 1.51 శాతం). ఆ సంవత్సరాంతానికి దేశంలోనే అత్యధిక లోట్లు ఉన్న రాష్ట్రంగా బీహార్ రికార్డు సృష్టించింది. పదిహేనవ ఆర్థిక సంఘం సూచించిన 3.5 శాతం పరిమితికి ఇది దాదాపు రెట్టింపు. రాష్ట్ర మొత్తం అప్పులు ప్రుడెన్షియల్ స్థాయిని దాటేశాయి. బీహార్ రుణ భారం రూ.2.93 లక్షల కోట్లకు (జీఎస్‌డీపీలో 39.35 శాతం) చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే బీహార్‌కు వచ్చే ప్రతి వంద రూపాయలలో సుమారు నలభై రూపాయలు అప్పు రూపంలోనే వస్తోంది.
దేశంలో అత్యంత రుణభారం తో కూరుకుపోయిన రాష్ట్రాలలో బీహార్‌ది ఐదో స్థానం. కేవలం 11 రాష్ట్రాలు మాత్రమే రుణం- జీడీపీ పరిమితిని దాటాయి. బీహార్ రుణ స్వభావం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎందుకం టే కాగ్ నివేదిక ప్రకారం ప్రభుత్వం పొందే రుణంలో 99.33 శాతం మూలధన రాబడులే ఉన్నాయి. ఇవి ఎక్కువగా పెట్టుబడుల ఉపసం హరణ, రుణ సమీకరణ కంటే కూడా అప్పులు తీసుకో వడం ద్వారానే సమకూరినవి. అంటే కొత్త ఉత్పాదక ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి బీహార్ అప్పులు చేయడం లేదు. గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికే కొత్తగా అప్పులు చేస్తోందన్న మాట.
కేంద్రమే దిక్కు
బీహార్‌లో ప్రభుత్వ వ్యయం కంటే ఆదాయం చాలా తక్కువగా ఉంటోంది. రాష్ట్ర ఆదాయంలో పన్నులు, పన్నేతర వనరుల ద్వారా సమకూరుతున్నది 37 శాతం మాత్రమే. వివిధ రూపాలలో కేంద్రం అందిస్తున్నది 63 శాతం. ఆదాయం, జీడీపీ నిష్పత్తి ఆరు శాతం కంటే తక్కువగానే ఉంది. నిధుల కోసం కేంద్రంపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడంతో బీహార్ ఆర్థికంగా స్వయం ప్రతిపత్తిని కోల్పోతోంది. దీంతో ఢిల్లీ పెద్దల ఆదేశాలకు తల ఊపడం మినహా రాష్ట్ర నేతలు చేసేదేమీ ఉండదు.
ఆదాయం ఎటు పోతోంది?
2022-23లో బీహార్ చేసిన మొత్తం వ్యయంలో 84.7 శాతం జీతాలు, పెన్షన్లు, రుణాలపై వడ్డీ చెల్లింపులకే పోయింది. మౌలిక సదుపాయాల కల్పనకు మిగిలింది కేవలం 15.3 శాతం మాత్రమే. అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయడానికి రాష్ట్రం వద్ద పెద్దగా డబ్బేమీ మిగలలేదు. రెవెన్యూ వ్యయంలో సుమారు 43 శాతం హామీల అమలుకే ఖర్చయింది. సబ్సిడీలపై 8.6 శాతం ఖర్చు చేశారు. ఇక అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బెక్కడుంది? మొత్తం వ్యయంలో మూలధన నిధులు, సంక్షేమం, ఆరోగ్యం, విద్య రంగాల వాటా కేవలం 23 శాతం మాత్రమే. ఈ నేపథ్యం లో మానవాభివృద్ధి సూచీలలో రాష్ట్రం బాగా వెనుకబడి పోయింది. రాష్ట్ర తలసరి ఆదాయం నేటికీ జాతీయ సగటులో మూడింట ఒక వంతు కంటే తక్కువగానే ఉంది. నామమాత్రపు వృద్ధి 10.4 శాతం ఉన్నప్పటికీ అదంతా అప్పుల ద్వారా జరుగు తున్నదే. గత పది సంవత్సరాల కాలంలో అప్పుడ ప్పుడు మాత్రమే రెవెన్యూ మిగులు కన్పించింది. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని ఇది సూచిస్తోంది.



