న్యూఢిలీ : పశ్చిమాసియా యుద్ధం కారణంగా దెబ్బతిన్న రంగాలకు మద్దతును ఇవ్వడానికి భారీ రుణ గ్యారెంటీ స్కీమ్‌ను కేంద్రం పరిశీలిస్తున్నట్టు సమాచారం. రూ. 2.5 లక్షల కోట్ల భారీ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను సిద్ధం చేస్తోన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా సమయంలో ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ తరహాలోనే ఈ పథకం పనిచేస్తుందని వెల్లడించాయి. దీని కింద బ్యాంకులు ఇచ్చే రుణాలకు ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీి) హామీగా ఉంటుంది. ఒకవేళ వ్యాపారాలు నష్టపోయి అప్పు తీర్చలేని పరిస్థితి వస్తే.. గరిష్ఠంగా రూ.100 కోట్ల వరకు ప్రభుత్వం 90 శాతం గ్యారెంటీ ఇస్తుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.17,000 నుంచి రూ.18,000 కోట్ల వరకు వెచ్చించనుందని తెలుస్తోంది. యుద్ధ ప్రభావిత రంగాలకు అండగా ఉంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల హామీ ఇవ్వగా.. పూచీకత్తు లేని ఈ తక్కువ వడ్డీ రుణాల పథకాన్ని త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.



