– చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
– రంగారెడ్డి జిల్లా మన్సురాబాద్ సహారా స్టేట్స్ గాంధీజీ విగ్రహం వద్ద నిరసన
నవతెలంగాణ- సిటీబ్యూరో
రాష్ట్రంలో చేనేత పరిశ్రమ, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, దసరా వరకు చేనేత కార్మికులకు రుణ మాఫీ చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమ, చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని మన్సురాబాద్ సహారా స్టేట్స్ వద్దనున్న గాంధీజీ విగ్రహం వద్ద తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమ, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కమిషనర్ శైలజా రామయ్యర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వారు హామీలు ఇవ్వటం తప్ప ఇంతవరకు అమలుకు నోచుకోలేదన్నారు. కార్మికులకు రుణ మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఏడాది దాటిందని తెలిపారు. దాన్ని అమలుచేయకపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు దాదాపు 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, వీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. చేనేత కార్మికుల రుణం రూ. 35 కోట్లు, చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలు రూ.40 కోట్లలోపే ఉన్నాయని అన్నారు.
లక్షల కోట్ల బడ్జెట్‌లో వంద కోట్ల రుణ మాఫీ చేయడం ప్రభుత్వానికి చేత కావడం లేదని విమర్శించారు. చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం బడ్జెట్‌లో రూ.2000 కోట్లు కేటాయించాలని కోరారు. జీఎస్టీ స్లాబ్ మార్పులు చేసిన దాంట్లో చేనేతపై 5 శాతం జీఎస్టీ అలాగే ఉంచి అదనంగా రూ.2500 చీరెలపై 18శాతం జీఎస్టీ విధించి చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం చావు దెబ్బ కొట్టిందని చెరుపల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జీఎస్టీ చెల్లిస్తుందని సీఎం అన్నారని, కానీ దాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. చేనేత ముడి వస్త్రాలు, రంగులు, రసాయనాలపై జీఎస్టీ రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. 12 ఏండ్ల నుంచి ఎన్నికలకు నోచుకోని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి టెస్కోకు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్, రాష్ట్ర నాయకులు చెరుకు స్వామి, ముషం నరహరి, వర్కాల చంద్రశేఖర్, నాయకులు పెంటయ్య, శేఖరయ్య, ఏలే వెంకటేశ్వర్లు, గజం శ్రీశైలం, గంగుల వెంకటేషం, దుస్సకుమార్, కర్నాటి రాములు, శ్రీ గంజి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
దసరా వరకు చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES