Saturday, October 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఏడాది దాటినా చేనేతలకు అందని రుణమాఫీ

ఏడాది దాటినా చేనేతలకు అందని రుణమాఫీ

- Advertisement -

మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
మంత్రి తుమ్మలకు వినతిపత్రం అందజేత

నవతెలంగాణ-హయత్‌నగర్‌
చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఏడాది దాటినా అది అమలు కాలేదని చేనేత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం ఆయన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, చేనేత కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ను వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. చేనేత కార్మికులకు రుణ మాఫీ చేయాలని, సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్‌ రుణాలు రద్దు చేయాలని, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, అలాగే చేనేత భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. హ్యాండ్‌ లూమ్‌ టెక్స్‌టైల్‌ శాఖకు ప్రభుత్వం నిధులు జమ చేయగానే చేనేత కార్మికుల అకౌంట్‌ల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. త్రిఫ్ట్‌ పథకంలో ప్రభుత్వం విడుదల చేయాల్సిన రూ.7 కోట్లు విడుదల కాగానే ఆ నిధులను కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. అలాగే సబ్సిడీ నూలు స్థానంలో తీసుకొని వచ్చే చేనేత కార్మికుల భరోసా పథకానికి జియో టాగ్‌ ఉన్న చేనేత కార్మికులు వ్యక్తిగత ప్రకటన ఇస్తే సరిపోతుందని, వాళ్ళ ఫోటోలు అప్‌ లోడ్‌ చేయాలని కమిషనర్‌ అన్నారు.

అనంతరం చెరుపల్లి మాట్లాడుతూ.. సిరిసిల్లలో అమలవుతున్న వర్క్‌ టూ ఓనర్‌ పథకంలో ప్రతి కార్మికుడికీ 4 పవర్‌ లూమ్స్‌ కేటాయిస్తే వాటి ధర సుమారు రూ.16 లక్షలు అవుతుందని, అందులో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వగా మిగిలిన రూ.8 లక్షలు బ్యాంకు రుణంగా పొందాల్సి ఉంటుందని తెలిపారు. కానీ బ్యాంకులు ముందుకు రావడం లేదని, పెట్టుబడి-మార్కెటింగ్‌ లోపంతో పథకం ముందుకు సాగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ పథకాన్ని అపారెల్‌ ఇండిస్టీస్‌కు అనుసంధానం చేసి, చేనేత కుటుంబాల మహిళలకు శిక్షణ ఇస్తూ ముందుకు తీసుకెళ్లడం మంచిదని సూచించారు. చేనేత సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్‌ ఋణం విషయంలో, సహకార సంఘాల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వనం శాంతి కుమార్‌, ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్‌, కార్యదర్శి ముషం నరహరి, వర్కాల చంద్ర శేఖర్‌, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -