Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయందౌత్యం కోసం లాబీయింగ్‌

దౌత్యం కోసం లాబీయింగ్‌

- Advertisement -

– ట్రంప్‌ సీనియర్‌ సలహాదారుకు కాంట్రాక్ట్‌
– వాణిజ్య చర్చలే ప్రధానంగా సంప్రదింపులు
– పాక్‌తో ఘర్షణలపై కూడా…
– పలు సమావేశాలకూ సంధానకర్త
– ఆరు నెలల సేవలకు 9 లక్షల డాలర్ల చెల్లింపు


అమెరికాతో దౌత్య సంబంధాలు నెరపడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ లాబీయింగ్‌ సంస్థను నియమించుకుంది. ఆరు నెలల పాటు సేవలు అందించినందుకు ఆ సంస్థకు తొమ్మిది లక్షల డాలర్లు చెల్లించింది. భారత్‌-పాక్‌ సైనిక ఘర్షణ మొదలు కొని భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య చర్చల వరకూ అన్ని వ్యవహారాలపై ఈ సంస్థ రెండు దేశాల మధ్య సంబంధాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు…భారత అధికారులు, మంత్రులు, అఖిలపక్ష బృందాలు అక్కడికి వెళ్లినప్పుడు సమావేశాలు కూడా ఏర్పాటు చేసింది. దీనిపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధిని సంప్రదిస్తే ఇదంతా మామూలేనని, 1950వ దశకం నుంచి భారత ప్రభుత్వాలు లాబీయిస్టులు, కన్సల్టెంట్లను నియమించుకుంటూనే ఉన్నాయని చెప్పింది.

న్యూఢిల్లీ : గత సంవత్సరం జూన్‌లో విదేశాంగ మంత్రి జైశంకర్‌ సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌తో సమావేశం కావాల్సి వచ్చింది. ఇందుకోసం సాధారణంగా భారత రాయబారి ద్వారా అభ్యర్థన పంపాల్సి ఉంటుంది. అయితే అలా జరగలేదు. అలాగే వివిధ పార్టీల నాయకులతో కూడిన ప్రతినిధి బృందం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ మంత్రి మార్కో రుబియాలను కలవాలని అనుకున్నప్పుడు భారత దౌత్యవేత్తల నుంచి ఫోన్‌ వెళ్లలేదు. ప్రధాని నరేంద్ర మోడీ సోషల్‌ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ పెట్టినప్పుడు దానిని అమెరికా అధ్యక్షుడి కమ్యూనికేషన్ల బృందానికి చేరవేసింది మన రాయబార కార్యాలయ సిబ్బంది కాదు. ఈ పనులన్నీ చేసింది ఎవరో తెలుసా? ట్రంప్‌ ప్రచారకుడు జాసన్‌ మిల్లర్‌. ఆయన ఎస్‌హెచ్‌డబ్ల్యూ పార్టనర్స్‌ ఎల్‌ఎల్‌సీ అనే చిన్న అర్లింగ్టన్‌ లాబీయింగ్‌ సంస్థను నడుపుతున్నారు.

ఆరు నెలలు…60 కాంటాక్ట్‌లు
పాకిస్తాన్‌తో జరిగిన సైనిక ఘర్షణ మొదలుకొని ట్రంప్‌ ప్రభుత్వంతో జరుపు తున్న వాణిజ్య చర్చల వరకూ…ఆరు నెలల పాటు అమెరికాతో నెరపిన అన్ని దౌత్య వ్యవహారాలనూ భారత రాయబార కార్యాలయం ఓ లాబీయింగ్‌ సంస్థకు ఔట్‌సోర్సింగ్‌ ఇచ్చింది. గత సంవత్సరం డిసెంబర్‌ 7న ఒక విదేశీ ఏజెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ చట్టం ఫైలింగ్‌ ఈ విషయాన్ని బయటపెట్టింది. మిల్లర్‌కు చెందిన సంస్థ, అమెరికా ప్రభుత్వ అధికారుల మధ్య కనీసం 60 సంప్రదింపులు జరి గాయని ఫైలింగ్‌ పత్రాలు వెల్లడించాయి.
క్యాబినెట్‌ మంత్రుల నుంచి శ్వేతసౌధం చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌, ఫాక్స్‌ న్యూస్‌ యాంకర్ల వరకూ ఆ సంస్థ భారత రాయబార కార్యాలయం తరఫున సంప్రదింపులు జరిపిందని వివరించాయి. ఈ ఫైలింగ్స్‌ ను తొలుత ఈ నెల 4వ తేదీన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌్‌కు చెందిన ఓ యూజర్‌ పోస్ట్‌ చేశారు.

ఎవరీ మిల్లర్‌?
దౌత్య వ్యవహారాలలో లాబీయింగ్‌ చేసినందుకు (ఆరు నెలల కాలానికి) ఇప్పటి వరకూ మన దేశం మిల్లర్‌ సంస్థకు తొమ్మిది లక్షల డాలర్లు చెల్లించింది. ఈ చెల్లింపులు రెండు దఫాలుగా జరిగాయి. ఏప్రిల్‌ 25న, జూలై 28న నాలుగున్నర లక్షల డాలర్ల చొప్పున చెల్లించారు. సంవత్సర కాలం కోసం కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ మొత్తం విలువ 1.8 మిలియన్‌ డాలర్లు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో మిల్లర్‌ సీనియర్‌ కమ్యూనికేషన్స్‌ సలహాదారుగా వ్యవహరించారు. ట్రంప్‌ తరఫున ప్రతినిధులుగా పనిచేసిన వారిలో ఆయన ఒకరు. ఆ తర్వాత 2020, 2024 ఎన్నికలలో ట్రంప్‌కు సీనియర్‌ సలహాదారుగా పనిచేశారు. గత సంవత్సరం ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిల్లర్‌ తన మొదటి, ఏకైక క్లయింటుగా భారత ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -