‘పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలు’ అని పాలకులు ఊదరగొడుతుంటారు. కానీ వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేస్తారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల గడువు ముగిసి పదహారు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. గతంలో బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, పార్టీ ఏదైనా వారి అనుకూల వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నది. లేదంటే ప్రత్యేకాధికారుల పాలనతో నెట్టుకొస్తున్నది. సర్పంచులకున్న జవాబుదారితనం ప్రభుత్వ అధికారులకు తక్కువ! ఎందుకంటే ఉన్నఊళ్లో గ్రామస్తుల స్థితిగతులు, అక్కడి పరిస్థితులు తెలిసినవారు సర్పంచులు మాత్రమే. వారే లేనప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఏడాదిన్నరగా అదిగో ఇదిగో, అప్పుడు ఇప్పుడు అంటూ ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు ప్రకటనలు చేస్తున్నారు. సిద్ధంగా ఉండాలని వారి పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. కానీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుందా, లేదా అనే అనుమానం ప్రజల్లో నెలకొంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు గతంలో పంచాయతీల అభివృద్ధికి చేసిన నిధులు విడుదల చేయకపోవడంతో చాలామంది సర్పంచుల కుటుంబాలు అప్పులపాలయ్యాయి. వాటిని తీర్చడానికి వారికున్న ఆస్తుల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.కొంతమందైతే వడ్డీలు కట్టలేక తనువు చాలించే దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పంచాయతీలు ఎన్నికలు జరగడమే కాదు, వాటికి కావల్సిన నిధుల్ని ఇవ్వడం, పేరుకుపోయిన బకాయిల్ని తీర్చడం ప్రస్తుత సర్కార్ బాధ్యతగా ఉండాలి.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల గడువు జనవరి 2024తో ముగిసింది. నేటికీ పదిహేను మాసాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని శాసనసభలో అమోదించినప్పటికీ, కేంద్రం అంగీకరించనందున ఎన్నికలు వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతున్నది. 1956 నుంచి 2025 ఏప్రిల్ వరకు 70 ఏండ్లలో పంచాయతీ ఎన్నికలు ఎనిమిదిసార్లు మాత్రమే నిర్వహించారు. వాస్తవానికి ప్రతి ఐదేండ్లకోసారి ఇప్పటివరకు పదమూడుసార్లు ఎన్నికలు జరగాలి. ఉమ్మడి రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రంలో గానీ పాలకులు తమ రాజకీయ ప్రయోజనాలను అశించి, తమకు అనుకూల పరిస్థితులు ఉంటెనే ఎన్నికలు జరుపుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్థానిక సంస్థల చట్టాలను మార్పు చేయడం ఆనవాయితీగా వస్తున్నాయి. 30మే1994 నుండి రాజ్యాంగ సవరణ 73 ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా ఐదేండ్లకోసారి ఎన్నికలు కచ్చితంగా నిర్వహించాలి. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం మున్సిపాల్టీల, కార్పోరేషన్‌ల ఎన్నికలు జరపాలి. ఈ స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం పెరగడమేకాక తమ సమస్యలను తామే పరిష్కరించుకునే అవకాశం వస్తుంది.
1957లో బల్వంతరారు మేహతా కమిటీ పంచాయతీ ఎన్నికలపై పలు సూచనలు చేసింది. 1959 అక్టోబర్ రెండున మూడంచెల గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రయోగాత్మకంగా మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో మూడంచెల విధానాన్ని ప్రారంభించారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాగానే 1986లో బ్లాక్ వ్యవస్థను, మండల వ్యవస్థగా మార్చారు. ఆ తర్వాత 1994లో ప్రధాని రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణ 73,74 ప్రకారం తప్పనిసరిగా ఎన్నికలు జరగాలని చట్టం రూపొందించారు. ఈ సవరణ ప్రకారం 2005లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖా మాత్యులు మణిశంకర్ అయ్యర్, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి 29 అంశాలను పంచాయతీలకు బదిలీ చేయాలని అదేశించారు. 2006లో పది అంశాలను, 2007లో మిగిలిన పందొమ్మిది అంశాలను బదిలీ చేస్తానని కేంద్రమంత్రికి రాతపూర్వకంగా హామీనిచ్చారు. ఇన్ని రాజకీయ పార్టీలు మారిన రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రంలో రాష్ట్ర అధికారంలో ఉన్న అంశాల్లో ఏ ఒక్కటి గ్రామ పంచాయతీలకు, సమితీలకు, మండలాలకు బదలాయించలేదు. పైగా ఎన్నికలకు ముందు సవరణ చేసిన పంచాయతీ చట్టాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ”సర్పంచ్‌లను ఏ కారణం లేకున్న తొలగించే హక్కు కలెక్టర్‌కు” కల్పించారు. ఆ విధంగా పంచాయతీలను కలెక్టర్‌ల ద్వారా తమ అధీనంలో ఉంచుకున్నారు. 2018లో కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన పంచాయతీ సెక్షన్ 37 ప్రకారం సర్పంచ్‌లను తొలగించే హక్కు కలెక్టర్‌కు కలిపించారు. సర్పంచ్‌కు ప్రత్యేక్ష ఎన్నిక కావడం వల్ల ఉపసర్పంచ్‌పై ఆవిశ్వాసం పెట్టవచ్చు.2004లో కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం గానీ, సర్పంచ్‌లను తొల గించే హక్కును కలెక్టర్‌లకు అప్పగించారు. పదవి రక్షణ భయంతో పాలక వర్గాలకు అణిగి, మణిగి ఉండటం అలవాటు చేసుకున్నారు.
పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపురలలో మాత్రం 73వ రాజ్యాంగ సవరణ (1994) రాకముందు 1956 నుండి కేరళలో, 1977లో బెంగాల్, త్రిపురలోను ప్రతి ఐదేండ్లకోసారి పంచాయతీ ఎన్నికలు జరిపారు. అంతేగాక రాష్ట్ర బడ్జెట్‌లో నలభై శాతం నిధులు స్థానిక సంస్థల ద్వారానే వ్యయం చేశారు. ఆ విధంగా స్థానిక సంస్థలు రాష్ట్ర బడ్జెట్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థలు (14,15) ఇచ్చే నిధులను వారి పంచాయతీ కమిటీ నిర్ణయం మేరకు ఖర్చుచేశారు. విద్య, ఆరోగ్యం, రహదారులు, తాగునీరు, ఆవాసాలు, తదితర అభివృద్ధి కార్యక్రమాలన్ని సొంతంగా చేసుకున్నారు. అందువల్ల ఆ రాష్ట్రాల్లో అక్షరాస్యత 95శాతం వరకు పెరిగింది. ప్రసూతి మరణాలు, రక్త హీనత మరణాలు గణనీయంగా తగ్గాయి. ప్రజల చైతన్యం పెరిగింది. ఆ రాష్ట్రాల అభివృద్ధి గురించి దేశంలోని సంస్థలు, ప్రపంచ సంస్థలు అభినందించాయి. అదే సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ గ్రామ పంచాయతీలకు నామమాత్రపు నిధులు కేటాయించారు. చివరకు కేంద్ర ఆర్థిక సంస్థల నిధులను కూడా వారికి సకాలంలో ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుండి 2026 వరకు గ్రామ పంచాయతీలకు రూ. 1,32,352 కోట్లు కేటాయించారు. వాస్తవానికి వ్యయం చేసింది. రూ.92 వేల కోట్లు మాత్రమే మిగిలిన నిధులు దారి మళ్లించారు. గ్రామ పంచాయితీలకు చట్టబద్దంగా కల్పించాల్సిన అధికారాలను కల్పించలేదు.
తెలంగాణలో 2018 తర్వాత ఏర్పడిన పంచాయతీల్లో ”పల్లె ప్రకృతివనం పెంపు, గ్రామ పారిశుధ్యం, శ్మశానవాటికల నిర్వహణ, తాగునీటి సరఫరా, పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజన నిర్వహణ, గ్రామంలో వ్యవసాయ రంగం అభివృద్ధి” తదితర బాధ్యతలను సర్పంచ్‌కు అప్పగించారు. కానీ, నిధులివ్వకపోవడంతో తమ స్వంత డబ్బులతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పదవి కాలం ముగిసే నాటికి (12జనవరి2019 నుండి 12జనవరి 2023 వరకు) లక్షల రూపాయలు అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధికి వ్యయం చేశారు. ఒక వైపున బడ్జెట్ నిధులు, మరో వైపున కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకపోయిన సర్పంచ్‌లు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రజల పదవి వ్యామోహాన్ని తగ్గించడానికి రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలకు 12,769 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. 612 మండలాలకు విస్తరించారు. వీటి నిర్వహణ, సిబ్బంది ఖర్చు భరించలేక చాలామంది సర్పంచులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయారు. పశ్చిమ బెంగాళ్‌లో పది కోట్ల మంది ప్రజలకు 3,339 గ్రామ పంచాయతీలు, 344 మధ్య తరహా కమిటీలు, 22 జిల్లా పరిషత్ మాత్రమే నిర్ణయించి నిధులు కేటాయిస్తున్నారు. 3.6 కోట్ల మంది ప్రజలు ఉన్న కేరళలో 941 గ్రామ పంచాయతీలు152 బ్లాక్ కమిటీలు 14 జిల్లా కమిటీలుగా విభజించారు. త్రిపురలో 42 లక్షల జనాభాకు 606 గ్రామ పంచాయతీలు , 40 బ్లాక్‌లు, 8 జిల్లా పరిషత్‌లు మాత్రమే ఉన్నాయి. నిధుల కేటాయింపులో చూపని చొరవను పంచాయతీల ఏర్పాటులో ఎక్కువ ఉత్సాహం చూపడంవల్ల నిర్వహణ వ్యయం పెరిగిపోయింది.
ఆత్మహత్యలకు పాల్పడిన సర్పంచులు, వారి కుటుంబాల్ని చూస్తే చాలా బాధగా ఉంది. ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నఊరిలో పలుకుబడి పోవద్దని అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ సర్కార్ తగిన నిధులు విడుదల చేయలేదు. దీంతో చాలామంది అప్పులు తీర్చే స్తోమత లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో పదమూడు మంది కుటుంబాల పరిస్థితి చాలా దయానీయంగా ఉంది. ఇంకా గణాంకాలకు రాని ఆత్మహత్యలు చాలానే ఉన్నాయి. ప్రజలకు సేవ చేద్దామని అత్యంత ఉత్సాహంతో వచ్చిన యువకులు పాలకుల విధానాలవల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. తమ గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా చేయడానికి అప్పులు తెచ్చి వ్యయం చేసినప్పటికీ ప్రభుత్వం నిధులివ్వకపోగా పనులు చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, తమ చేతిలో ఉన్న 29 అధికారాలను గ్రామ పంచాయతీలకు, నాలుగు అధికారాలను మండల పరిషత్‌లకు బదలాయించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకత చూపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయో తెలియని అగమ్య గోచర పరిస్థితి కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించటానికి చర్యలు చేపట్టాలి. ప్రజల ద్వారా పాలన కొనసాగించాలి. అప్పుడే పల్లెలు అభివృద్ధిబాట పడతాయి.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666
స్థానిక సంస్థల ఎన్నికలు-సర్కార్ కాలయాపన!
- Advertisement -
RELATED ARTICLES