ఎన్నికల షెడ్యూల్ వచ్చినా తొలగని టెన్షన్..
8న వచ్చే కోర్టు తీర్పుపైనే అందరి దృష్టి
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆశావహులు
నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక ఎన్నికలపై ఆశావహుల్లో అనిశ్చితి నెలకొంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ, స్థానిక పదవుల కోసం ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న వారిలో ఉత్సాహం కనిపించడం లేదు. రాజ్యాంగపరమైన సమస్యలతో ముడిపడిన ఈ పరిస్థితిలో ఎన్నికలు జరుగుతాయా లేదా, జరిగితే ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమా లేక పాత విధానంతోనా అన్న చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు కొందరికి నిరుత్సాహంగా,మరి కొందరికి అనుకూలంగా వచ్చినప్పటికీ ఆశావాహులు ధైర్యం గా అడుగులు వేయడం లేదు. కోర్టు తీర్పు వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై స్పష్టత కోసం మరో మూడు రోజులు ఆగాల్సిందే. అనుకూల ఫలితాలు వచ్చినవారు కూడా తదుపరి అడుగులు ఎలా వేయాలో తెలియక గందరగోళం లో పడ్డారు.
తీర్పు ప్రతికూలమైతే..
మండలంలో 1 జెడ్పీటీసీ స్థానం, 7 ఎంపీటీసీ స్థానాలు,15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పార్టీ గుర్తులపై జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల నుంచి అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. వీరితో పాటు స్వతంత్రులు కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక్కో స్థానానికి కనీసం నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు. పార్టీ గుర్తులకు అతీతంగా జరిగే సర్పంచ్ స్థానాలకు ముగ్గురు నుంచి నలుగురు చొప్పున సుమారు 45మంది పోటీచేసే అవకాశం ఉంది.
మరో నాలుగు రోజులు..
స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాది కాలంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు షెడ్యూల్ వచ్చేసింది. అన్నీ సవ్యంగా జరిగితే మొదటి దశ నామినేషన్లు మరో నాలుగు రోజుల్లో ప్రారంభమవుతాయి. రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో ఆశావహులు అక్టోబర్ 8 వరకు వేచి ఉండాలి. ఈ పరిస్థితిలో ముందుకు అడుగేయడమే సరైనదని కొందరు భావిస్తున్నారు. ఖర్చుల విషయంలో కూడా జాగ్ర త్తగా ఉంటున్నారు. ఇప్పటి నుంచి పెట్టుబడి పెడితే, పరిస్థితి ప్రతికూలమైతే నష్టపోతామని కొం దరు భావిస్తున్నారు.