ఎన్నికల కోడ్ పై సర్వత్రా చర్చ.
దరఖాస్తుదారుల్లో మొదలైన ఆందోళన
నవతెలంగాణ – మల్హర్ రావు.
అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో పేదల్లో సంతోషం ఎంతోకాలం నిలిచేలా లేదు.కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకుంది.ఎన్నికల కోడ్ రూపంలో అడ్డుతగిలేలా ఉందనే చర్చ దరఖాస్తుదారుల్లో జోరుగా సాగుతోంది.మండలంలో ఇప్పటికే 8,906 రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో అంత్యోదయ కార్డులు 1,385,పోను 7,521 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. గత జనవరి నుంచి ఇప్పటి వరకు 582 కొత్తకార్డులు మంజూరయ్యాయి.1740 మంది పేర్లు కొత్తగా కార్డుల్లో చేరాయి.కాగా, రేషన్ కార్డుల కోసం 813 వరకు దరఖాస్తులు రాగా,211 పైగా దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల మీ సేవ కేంద్రాల్లో కార్డుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో పది రోజులపాటు వెబ్సైట్ను బంద్ ఉంచారు.దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తహసీల్దార్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే డీఎస్ఓ లాగిన్కు ఫార్వార్డ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో దరఖా స్తులపై రీసర్వే చేసి,నిబంధనల ప్రకారం ఉంటేనే డీఎస్ఓ లాగిన్కు ఫార్వార్డ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే రిజెక్ట్ చేస్తున్నారు.
కోడ్ వర్తిస్తుందా..
రేషన్ కార్డుల దరఖాస్తు నిరంతరం ప్రక్రియ అంటూ ప్రభుత్వ పెద్దలు ఒకవైపు ప్రకటనలు చేస్తున్నా…మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ తో దరఖాస్తుల మంజూరు నిలిసిపోనుందా…అనే చర్చ జోరుగా సాగుతోంది.రేషన్ కార్డుల మంజూరుకు స్థానిక ఎన్నికల కోడ్ వర్తిస్తుందా.?లేదా.? అనేదానిపై అటు అధికార వర్గాల్లో ఇటు ప్రభుత్వ పెద్దల్లో స్పష్టత కరువైంది.
స్పష్టత లేదు..
రవికుమార్ తహశీల్దార్
రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లోగా మంజూరు చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కార్డుల మంజూరుకు వర్తి స్తుందా? లేదా అనేది స్పష్టత లేదు. ప్రభుత్వ పరిధిలోని అంశం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ముందుకు సాగుతాం.