ప్లాన్-ఏ కాకపోతే ప్లాన్-బీకి సన్నాహాలు
కోర్టుల్లో అఫిడవిట్ల నేపథ్యంలో సర్కారు నిర్ణయం…
అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలి : మంత్రులకు సీఎం దిశా నిర్దేశం
బి.వి.యన్.పద్మరాజు
‘ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందువల్ల ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు సాధ్యం కాకపోతే.. పార్టీ పరంగానైనా ముందుకెళ్లాలి. కానీ ఎన్నికలకు వెళ్లి తీరాలి.. అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలి…’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు తాజాగా చేసిన దిశా నిర్దేశం ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కొందరు హైకోర్టుకు వెళ్లటం, ఈనెల 8న దానిపై తీర్పు వెలువడనుండటం, మరికొందరు ఇదే అంశంపై సుప్రీంకోర్టు గడపతొక్కటం తదితర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు సీఎం ఈ రకంగా ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌తో కూడా ఆయన పలు దఫాలు సమాలోచనలు చేశారు. వాస్తవానికి బీఆర్‌ఎస్ హయాంలో స్థానిక సంస్థల్లో 22.78 శాతం మేర రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు.
రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అప్పట్లో ఆ మేరకు అసెంబ్లీ తీర్మానించింది. తద్వారా రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా జాగ్రత్తపడ్డారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్… బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామంటూ కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఆ మేరకు ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీల్లో రిజర్వేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. దాంతోపాటే ఎలక్షన్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఆ తర్వాత కొందరు ఇటు హైకోర్టును, అటు సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో… ‘ప్లాన్-ఏను అమలు చేయలేకపోతే ప్లాన్-బీకు వెళదాం…’ అనే సంకేతాలను సీఎం రేవంత్ కాంగ్రెస్ శ్రేణులకు ఇచ్చారు. న్యాయస్థానాల్లో తీర్పులు ఎలా వచ్చినా… ఎన్నికలను ఆపకుండా ‘ముందుకే వెళ్లేలా…’ ప్లాన్‌ను అమలు చేయాలంటూ ఆయన వారికి మార్గదర్శనం చేశారు.
ప్లాన్-బీ అంటే ఇదే…
గతంలో కేసీఆర్ సర్కారు ఇచ్చిన 22.78 (ఇంచుమించు 23 శాతం) శాతం రిజర్వేషన్లకు అదనంగా ఇప్పుడు 19 శాతం స్థానాలను బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి విదితమే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుల గణన ప్రకారం వీటిని ఖరారు చేసినట్టు రేవంత్ సర్కారు చెబుతోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు కూడా కింది స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టు, సుప్రీం కోర్టులు… అందుకనుగుణంగా తీర్పులను వెలువరిస్తే, కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవు. ఒకేవేళ దానికి భిన్నమైన తీర్పులు వెలువడితే ఏం చేయాలన్నదే ప్లాన్-బి. అలాంటి క్లిష్ట పరిస్థితే ఎదురైతే బీఆర్‌ఎస్ హయాం లో ఖరారు చేసిన 23 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా ఇచ్చి…మిగతా 19 శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ 19 శాతాన్ని కూడా కలిపి రిజర్వేషన్లను ఖరారు చేసిన నేపథ్యంలో… అది తమకు సానుకూలంగా మారుతుందని ఆయన భావిస్తున్నారు. ’42 శాతం రిజర్వేషన్లు ఇవ్వటానికి మేం చేయాల్సిన ప్రయత్నమంతా చేశాం. అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపాం, కానీ దానిపై మోడీ సర్కార్ ఏమీ తేల్చటం లేదు, ఇక్కడ బిల్లు పాస్ చేసి, గవర్నర్‌కు పంపితే, ఆయనా ఎటూ తేల్చటం లేదు, ఈ రకంగా ప్రభుత్వపరంగా రిజర్వేషన్లను అమలు చేయటానికి మాకు అనేక ప్రతిబంధకాలున్నాయి. అందుకే ఇచ్చిన మాట ప్రకారం, కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం…’ అంటూ ఆయన ప్రచారం చేయనున్నారు. తద్వారా ప్రతిపక్ష పార్టీలను సందిగ్దంలో పడేయాలన్నది ఆయన వ్యూహంగా కనబడుతున్నది.
పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు…
‘మనం అనుకున్నట్టు ప్లాన్-ఏ అమలైతే ఓకే.. లేదంటే ప్లాన్-బీకు కూడా వెళ్లేందుకు సంసిద్ధంగా ఉండండి.. ఆ రకంగా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయండి…’ అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు తాజాగా ఆదేశాలు వెళ్లాయి. ఆ మేరకు వారు ఆ ప్రయ్నతాల్లో నిమగమై ఉన్నారు. ఒకవేళ ప్లాన్-బీని అమలు చేయాల్సి వస్తే, అందుకోసం ఇటు క్షేత్రస్థాయి అధికారులను, అటు కాంగ్రెస్ శ్రేణులను సిద్ధం చేసేందుకు వీలుగా ఇప్పుడు విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశముందని పంచాయతీరాజ్‌శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. అదే జరిగితే జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు ఒక వారంపాటు వాయిదా పడతాయి.. అంతేతప్ప కచ్చితంగా ఎన్నికలు జరిగి తీరతాయని ఆయన స్పష్టం చేశారు.