Thursday, October 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'స్థానికం' చట్టబద్ధత!

‘స్థానికం’ చట్టబద్ధత!

- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు సర్కారు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనేక అడ్డంకుల మధ్య షెడ్యూల్‌ను ప్రకటించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలను వేర్వేరుగా రెండు దశల్లో నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీచేసింది. న్యాయపరమైన, సాంకేతిక అంశాలు పరిష్కారం కాకుండానే గతంలో హైకోర్టుకు హామీనిచ్చినట్టుగా ప్రభుత్వం ఎన్నికల నగారా మోగించింది. చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్ల సమస్య కొలిక్కి రాకముందే జీవో జారీచేయడం ద్వారా ఎన్నికల నిర్వహణకు సై అంది. పంచాయతీరాజ్‌ సంస్థలకు పాలకవర్గాల్లేక దాదాపు రెండేండ్లయింది. దీంతో స్థానికాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. కేంద్రం నిధులు నిలిపేసింది. రూ. వందల కోట్ల మేర స్థానిక బిల్లులు పెండింగ్‌ పడ్డాయి. ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడం స్వాగతించదగినది. అయితే రిజర్వేషన్ల ఖరారు న్యాయ బద్ధంగాగా జరగలేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్‌ సర్కారు జీవో 9ని జారీచేసింది. సామాజిక, రాజకీయ అంశాల్లో బీసీలకు ప్రయోజనం కలిగేలా ఈ రిజర్వేషన్లు ఉపయోగ పడతాయని జీవోలో పేర్కొన్నది. అంతేగాక రాజ్యాంగంలో చెప్పినట్టుగా సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు బీసీలకు రిజర్వేషన్లు అవసరం. తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తేనే చట్టబద్దత వస్తుంది. జీవో ఆధారంగా రిజర్వేషన్లు అమలయ్యేలా ఉంటే, అసెంబ్లీలో తీర్మానమెందుకు? బిల్లును గవర్నర్‌, రాష్ట్రపతికి పంపాల్సిన అవసరమేంటి? అనే సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మహారాష్ట్రలో ఈ తరహా జీవో తెచ్చి ఎన్నికలు నిర్వహిస్తే సుప్రీంకోర్టు కోట్టేసింది. తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చే అవకాశం లేకపోలేదని న్యాయనిపుణుల అభిప్రాయం. పైగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243డి(6) ప్రకారం పంచాయతీలు, చైర్‌పర్సన్‌ల ఖాళీల్లో, ఆర్టికల్‌ 243టీ(6) ప్రకారం మున్సిపాల్టీల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై ఈనెల ఎనిమిదిన హైకోర్టులో హియరింగ్‌ ఉండగానే సర్కార్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించింది.

కాగా అనేక కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో గిరిజనేతరులకు రిజర్వేషన్లు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశ మవుతున్నది. ఏజెన్సీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గిరిజనులకు మాత్రమే రిజర్వు చేయకుండా ఇతరులకు అవకాశమివ్వడం పట్ల అభ్యంతరం, ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన గిరిజనేతర రిజర్వేషన్లను మినహాయించాలంటూ, ఈ రోటేషన్‌ పద్ధతిని కచ్చితంగా ఆపాలని ప్రజాసంఘాల డిమాండ్‌. అధిక జనాభా కలిగిన జెడ్పీటీసీ స్థానాలకు ఎస్టీ రిజర్వేషన్‌ ఉండేలా చేయాలని కోరుతున్నాయి. లేకపోతే గిరిజేతరులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది కూడా ఆలోచించాల్సిందే. ఆదివాసీలు అధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాలను జనరల్‌ స్థానాలుగా ప్రకటించారు. ఈ చర్య ఆదివాసీల హక్కులను ప్రశ్నార్థకం చేయడమే. అలాగే ‘పీసా’చట్టాల ఉనికిని నీరుగార్చడమే. ఎస్సీలకు సైతం రిజర్వేషన్ల విభజన సరిగ్గా జరగలేదు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూరు గ్రామ ఎంపీటీసీ, సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీచేసేందుకు రిజర్వేషన్లు కల్పించలేదు. దీంతో అక్కడ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకుండానే జీవో ఎలా ఇస్తారని హైకోర్టు సైతం ప్రశ్నించింది. చట్టం తెచ్చే అధికారాన్ని ఎవరూ ప్రశ్నించలేరని పేర్కొంది. 53 శాతం బీసీ జనాభాకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం మంచిదే, అయినా రిజర్వేషన్ల పెంపు చట్ట ప్రకారం జరగాలని వాదనల సందర్భంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. జీవో తొమ్మిదితో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరతాయనీ, ఇది పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285’ఎ’కు విరుద్ధమని చెప్పింది. ”రిజర్వేషన్లు 50శాతానికి మించరాదు. రాజ్యాంగంలోని 200 అధికరణను ఎలా అధిగమిస్తారో చెప్పండి..బిల్లు పెండింగ్‌లో పెట్టుకుని ఎలా ముందుకెళ్లచ్చో కూడా చెప్పాలి” అని హైకోర్టు సర్కారును నిలదీసింది. రెండు నెలలు ఆపి నవంబరులో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే కొంపలేమీ మునిగిపోవు’ అని హైకోర్టు బెంచీ వ్యాఖ్యానించడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -