Saturday, July 5, 2025
E-PAPER
HomeNewsకాంగ్రెస్‌లో 'స్థానిక' జోష్‌..

కాంగ్రెస్‌లో ‘స్థానిక’ జోష్‌..

- Advertisement -

– లోకల్‌లో మరింత పట్టుకోసం హస్తం వ్యూహం
– అందులో భాగంగానే ‘సామాజిక’ సభ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ శుక్రవారం నిర్వహించిన ‘గ్రామాధ్యక్షులతో ఖర్గే ముఖాముఖి’ సభ ఆ పార్టీలో జోష్‌ నింపింది. త్వరలో నిర్వహించాలనుకుంటున్న పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్‌ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారు. ఒకేరోజు హైదరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహావిష్కరణ, ఆ తర్వాత గాంధీ భవన్‌లో పీసీసీ కార్యవర్గం, అనంతరం ఎల్బీ స్టేడియంలో ‘సామాజిక సమరభేరి’ పేరిట బహిరంగ సభను నిర్వహించిన హస్తం పార్టీ…క్షేత్రస్థాయిలోని క్యాడర్‌ను కార్యోన్ముఖులను చేసిందని గాంధీభవన్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొన్నటి వరకు రైతు భరోసా (రైతు బంధు), రైతు రుణమాఫీ, రైతు బీమా తదితరాంశాల అమల్లో అధికార పార్టీ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ విమర్శలను తిప్పికొడుతూ తొమ్మిది రోజుల్లోనే రైతు రుణమాఫీని పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేశామని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పుకొచ్చారు. ఇదీ తమ ప్రభుత్వ ఘనతంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కితాబిచ్చుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌ సైతం… ‘అమలు చేస్తున్న పథకాల గురించి ఎక్కువగా చెప్పుకోలేకపోతున్నాం, చేసిన పనులను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాం…’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బలహీనతను అధిగమించాలంటూ ఆయన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మీదే…’ అంటూ ‘లోకల్‌ ఫైట్‌’కు సైరన్‌ మోగించారు. దీన్నిబట్టి త్వరలోనే స్థానిక సంస్థలు రాబోతున్నాయనీ, ఆ క్రమంలోనే సీఎం రేవంత్‌ వ్యూహాత్మకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సభను నిర్వహించారనే ప్రచారం జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -