– గ్రామానికి ప్రధమ పౌరుడు సర్పంచ్ విధులు, విధానాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మన కోసం, మన చేత ఎన్నుకోబడిన మనలో ఒకరైన స్థానిక పాలకులు నేటి నుంచి పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. ఎవరికి వారు తమ ఆచార సంప్రదాయాల ప్రకారం సోమవారం ముహూర్తం చూసుకుని సర్పంచ్ లు తమ కార్యాలయాల్లో విధుల్లో చేరనున్నారు. స్థానిక కార్యదర్శులచే ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈసారి అధికంగా యువతరం, ప్రజాప్రాతినిధ్యానికి కొత్తవారే సర్పంచ్ లుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ విధులు–విధానాలు పై నవతెలంగాణ ప్రత్యేక కధనం.
సర్పంచ్ అంటే ఎవరు?
సర్పంచ్ అంటే గ్రామాలలో గ్రామ పంచాయతీకి ఎన్నికైన అధిపతి (ప్రెసిడెంట్/గ్రామ ప్రధాన్). వీరు గ్రామ స్థాయి స్థానిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ గ్రామాభివృద్ధి, సంక్షేమానికి బాధ్యత వహిస్తారు. ప్రభుత్వ అధికారులకు–గ్రామ ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తారు. సర్పంచ్ పంచాయతీ సభ్యులతో కలిసి గ్రామ పాలనను నడిపిస్తారు. వీరి పదవీకాలం ఐదేళ్లు.
సర్పంచ్ ప్రధాన బాధ్యతలు
గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించడం, గ్రామాభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రజా ప్రతినిధిగా గ్రామ సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయించడం,,పంచాయతీ ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పనుల అమలులో కీలక పాత్ర.
చట్టపరమైన విధులు
2018 చట్టం నెంబర్–5, షెడ్యూల్–7, సెక్షన్–6(13) ప్రకారం సర్పంచ్ చేయాల్సిన ముఖ్యమైన విధులు:
గ్రామసభ నిర్వహణ
పాలకవర్గం తీర్మానాల అమలు
ప్రజల దరఖాస్తుల పరిశీలన, సంబంధిత శాఖలకు సిఫార్సులు
పారిశుధ్యం, నిరంతర త్రాగునీటి సరఫరా
వీధి లైట్లు నిర్వహణ
హరిత హారం పర్యవేక్షణ
ఇవి కాకుండా మొత్తం 17 ప్రధాన విధులు
క్షేత్రస్థాయిలో సర్పంచ్ పాత్ర
గ్రామంలో అక్షరాస్యత పెంపొందించడం
వ్యవసాయ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం
గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు పౌష్టికాహారం అందేలా అంగన్‌వాడీ సిబ్బందితో చర్చలు
అంటువ్యాధులు, తరుణ్ వ్యాధుల నివారణకు ఆరోగ్య సిబ్బందిని సమాయత్తం చేయడం
కుంటలు, చెరువుల్లో మత్స్య సంపద అభివృద్ధి
స్థానిక అటవీ సంపద పరిరక్షణ
రేషన్ కార్డ్ లేనివారికి కార్డులు ఇప్పించడం, నాణ్యమైన సరుకులు అందేలా చూడటం
స్వయం సహాయక సమూహాల ఏర్పాటు
పశు వైద్య శిబిరాల నిర్వహణ
పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన
ప్రభుత్వ భూముల రక్షణ
దళిత, గిరిజన ప్రజానీకం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
ఉప సర్పంచ్ పాత్ర
సర్పంచ్ అందుబాటులో లేనప్పుడు లేదా పదవి ఖాళీ అయినప్పుడు ఉప సర్పంచ్ సర్పంచ్ అధికారాలు, విధులను నిర్వహిస్తారు. పాలనలో నిరంతరం ఉండేలా కీలక బాధ్యత వహిస్తారు.
గ్రామ అభివృద్ధి దిశగా తొలి అడుగు సర్పంచ్ చేతుల్లోనే మొదలవుతుంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, చట్టబద్ధంగా, పారదర్శకంగా పాలన సాగించడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం.



