Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుస్థానికంపై సెర్చ్‌ కమిటీ

స్థానికంపై సెర్చ్‌ కమిటీ

- Advertisement -

– 28లోపు రిపోర్ట్‌
– పార్టీపరంగా బీసీలకు 42 శాతం టిక్కెట్లు
– బీసీ రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల కమిటీ
– ‘స్థానికం’కు పార్టీని సిద్ధం చేద్దాం

– 26న బీహార్‌కు సీఎం
– 29న మంత్రివర్గ సమావేశం
– ఛాలెంజ్‌గా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక
– యూరియాపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
– టీపీసీసీ పీఏసీ సమావేశంలో నిర్ణయాలు
– హాజరైన సీఎం, మంత్రులు, మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షులు

‘ఓట్‌ చోరీ’ ప్రచార లోగో ఆవిష్కరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పార్టీపరంగా సెర్చ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నిర్ణయించింది. ఆ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్‌ను సభ్యులుగా నియమించారు. ఈనెల 28వ తేదీలోపు ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్టీపరంగా బీసీలకు 42 శాతం టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలా…వద్దా అనే అంశాన్ని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ఈనెల 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

శనివారం హైదరాబాద్‌ లోని గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, డిప్యూటీసీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్‌ 30లోపు స్థానిక ఎన్నికలను నిర్వహించాలనే హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. తాజా రాజకీయ పరిణామాల పై చర్చించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీపై సుదీర్ఘంగా చర్చించింది. యావత్తు పార్టీని స్థానిక ఎన్నికలకు సంసిద్ధం చేయాలని దిశానిర్దేశం చేసింది. ఈ ఎన్నికలతో ముడి పడి ఉన్న బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలని భేటీలో నిర్ణయించారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన ప్రజాస్వామ్య వాది, రాజ్యాంగ నిపుణులు జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల పీఏసీ సమావేశం హర్షం వ్యక్తం చేసింది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్ని కలను ఎదుర్కొంటూనే… జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. అభ్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా ముందుకు పోవాలని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌ వెంకటస్వామి ఇప్పటికే జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని క్యాడర్‌ను ఇప్పటికే సమాయత్తం చేస్తున్నారనీ, దాన్ని మరింత విస్తృతం చేయాలని సూచించారు. ముఖ్యంగా నాయకుల మధ్య ఐక్యతను సాధించే దిశగా కృషి చేయాలని సమావేశం ఆదేశించింది.

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతుంటే, మరో వైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బదనాం చేసేలా వ్యవహరిస్తున్నాయని సమావేశం అభి ప్రాయపడింది. రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం కారణమైతే… రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ, బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం చేస్తున్నాయనీ, ఈ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో పార్టీ నాయకులు విఫలమవుతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తంచేసినట్టు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఉన్న ఫిర్యాదులను స్పీకర్‌ పరిశీలించి, ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చించారు.

ఓట్‌ చోరీ ప్రచారలోగో ఆవిష్కరణ
పీఏసీ సమావేశంలో ‘ఓట్‌ చోరీ’ ప్రచార లోగోను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈనెల 26న ఓట్‌ చోరీపై ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి బీహార్‌లో పర్యటించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడమనేది కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లక్ష్యమని చెప్పారు. అందువల్ల బీసీలకు మేలు జరగాల్సిందేనన్నారు. రాహుల్‌గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టామని తెలిపారు. బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రి వర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసుకున్నామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా కేసీఆర్‌ చట్టం తీసుకొచ్చారని గుఉ్త చేశారు. దీని ప్రకారం బీసీలకు ఒక శాతం కూడా రిజర్వేషన్లు రావని తెలిపారు. ఈ అడ్డంకిని తొలగించేందుకు తాము ఆర్డినెన్స్‌ తెచ్చామన్నారు. కేసీఆర్‌ తెచ్చిన చట్టాన్ని సవరించేందుకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన గవర్నర్‌కు పంపితే, ఆయన కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. 90 రోజుల్లో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశంపైన సుప్రీం కోర్టులో రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించినట్టు తెలిపారు. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుందన్నారు. విడిగా సుప్రీం కోర్టుకు వెళ్తే కేసు లిస్ట్‌ కావడానికి ఎక్కువ సమయం పడుతోందన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad