Saturday, September 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుస్థానికానికి సై

స్థానికానికి సై

- Advertisement -

42 శాతం బీసీ రిజర్వేషన్లపై జీవో జారీ
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్రఎన్నికల సంఘం
నేడో, రేపో నోటిఫికేషన్‌
నేడు సీఎస్‌తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఎన్నికల సమావేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసింది. సుదీర్ఘకాలంగా ఈ ఎన్నికలపై డోలాయమానంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయించింది. దానికి అనుగుణంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. దీనితో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల జాబితాలు మొదలు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సమాచారం ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లపై జీవో నెంబర్‌ 09ని ప్రభుత్వ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై సమీక్షించేందుకు డీజీపీతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ అయ్యింది. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 డి(6), ఆర్టికల్‌ 243 టి(6) ప్రకారం సీట్ల రిజర్వేషన్‌ కోసం నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ డాక్టర్‌ బుసాని వెంకటేశ్వరరావు ప్రత్యేక కమిషన్‌, తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 2024లో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల(ఎస్‌ఈఈఈపీసీ) సర్వేలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతంతో పోలిస్తే రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయని ఎత్తిచూపుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కనీసం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వన్‌మెన్‌ కమిషన్‌ నివేదిక సమర్పించిన విషయాన్ని ప్రస్తావిం చారు. బీసీ జనాభాకు తగ్గట్టుగా రాజకీయ ప్రాతినిధ్యం లేనందున వారి సంక్షేమం, అభివృద్ధి కోణంలో స్థానిక సంస్థల్లో ప్రస్తుత రిజర్వేషన్‌ స్థాయిని 42 శాతానికి పెంచాలని కమిషన్‌ చేసిన సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు. ”తెలంగాణ వెనుకబడిన తరగతులు (గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్లు) బిల్లు, 2025 (ఎల్‌.ఎ.బిల్‌. నం.04 ఆఫ్‌ 2025)”ను అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ, శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదించాయ ని ప్రస్తావించారు. జీవోకు అనుగుణంగా నడుచుకోవాల ని ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీ రిజర్వేషన్లను ఎస్‌ఈఈఈపీసీ-2024 ప్రకారం ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రాథమికంగా ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలోనూ మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించారు.

నేడు ఉన్నతస్థాయి సమావేశం
స్థానిక ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని శాఖలతో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు దీన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ, పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొంటారు.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చిస్తారు. అదేరోజు సాయంత్రంగానీ, ఆదివారం గానీ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశాన్ని నిర్వహించి నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసే అవకాశముంది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ పదవులకు రిజర్వేషన్లు ఖరారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వర్తింపజేస్తూ జీవో నెంబర్‌ 41ని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ పదవులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు, ఎస్‌ఈఈఈపీసీ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో అన్ని రిజర్వేషన్ల కోటాలోనూ మహిళలకు 50 శాతం వర్తింపజేయనున్నది. జిల్లా పరిషత్‌ చైర్మెన్‌/చైర్‌పర్సన్‌, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల కేటాయింపు నిర్ణయాన్ని కలెక్టర్లకు అప్పగించింది.

ఈసీతో డీజీపీ భేటీ
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదినితో డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ శుక్రవారం భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య స్థానిక ఎన్నికలకు సబంధించి భద్రతా ఏర్పాట్లపైనే ప్రధాన చర్చ నడిచినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ తెలిపారు. రాజకీయంగా సున్నితంగా ఉండే పలు ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ఎన్నికల సమయంలో పోలీసుల పాత్రపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. మావోయిస్టుల ప్రభావం రాష్ట్రంపై లేదనీ, సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని ఎన్నికల సంఘానికి డీజీపీ జితేందర్‌ హామీ ఇచ్చినట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -