”ఏమోయ్ ఎక్కడున్నావ్?” అంటూ ఇంట్లోకి వచ్చాడు కమలేష్.
”ఏమిటండీ?” అంటూ వంటింట్లోంచి హాల్లోకి వచ్చింది వందన.
”ఇదిగో స్వీటు తీసుకో, పుల్లారెడ్డి షాపు నుండి ఆర్డర్ చేసి స్పెషల్‌గా తెప్పించాను” అంటూనే ఒక స్వీటు తీసి భార్య నోట్లో పెట్టాడు కమలేష్.
”అంతగా ఆనందపడుతున్నారు! ఏమిటీ విశేషం?” అడిగింది వందన స్వీటు నములుతూ.
”అమెరికా నుండి నా కొడుకు ఈ నెల లక్ష రూపాయలు పంపాడు!” అంతా మన పెద్దాయన దయ!” అన్నాడు కమలేష్ అరమోడ్పు కన్నులతో.
”ఏం మాట్లాడుతున్నారండీ! మన అబ్బాయి కష్టపడి సంపాదించి అమెరికా నుండి డబ్బులు పంపిస్తే పెద్దాయన దయ అంటారేమిటి?” చిరాగ్గా అన్నది వందన.
”ఓసి పిచ్చి మొఖమా! ఇంతకు ముందు డెబ్బై వేలు మాత్రమే మన అబ్బాయి పంపించాడు. ఈసారి లక్ష రూపాయలు ఎలా పంపించాడు అనుకున్నావు! మన అబ్బాయికి జీతం కూడా పెరగలేదు. ఇదంతా పెద్దాయన దయ!” అన్నాడు మళ్లీ కమలేష్ కండ్లు మూసుకుంటూ.
”అసలు విషయం ఏమిటో నాన్చకుండా చెప్పండి!” అన్నది వందన విసుగ్గా.
”మన రూపాయి విలువ పడిపోయింది కదా! అందుకే మన అబ్బాయి ఇంతకు ముందు పంపినన్ని డాలర్లే పంపినా మన రూపాయిలు ఎక్కువ వచ్చాయి! అంటే రూపాయి విలువ పడిపోలేదు! ఎక్కువ రూపాయలు వచ్చాయంటే రూపాయి విలువ పెరిగిందన్న మాట! గత డెబ్బయి వేలతో పోల్చుకుంటే ఇప్పుడు ముప్ఫై వేలు అధికంగా వచ్చాయి. అందుకే ఇదంతా పెద్దాయన దయ అంటున్నాను” అన్నాడు తన్మయంగా కమలేష్.
”ఓహో మీకు అలా అర్థమయ్యిందా! సరే డబ్బులున్నాయి కదా! షాపింగ్‌కి తీసుకెళ్లండి!” అన్నది వందన.
”దానికేం భాగ్యం పద వెళదాం!” అంటూ కమలేష్ బండి తీశాడు.
”మన ఇంట్లో టీవీ, ఫ్రిజ్ చాలా పాతదైపోయాయి. మళ్లీ మళ్లీ రిపేర్లు వస్తున్నాయి. కొత్తవి తీసుకుందాం!” అన్నది వందన.
ఇద్దరూ షాపులోకి వెళ్లారు.
ఒక టీవీ సెలక్ట్ చేశారు. రూ.యాభై వేలు చెప్పాడు షాపు ఓనరు. అదిరిపడ్డాడు కమలేష్.
”అదేంటయ్యా! ఇదే టీవీ రెండు నెలల కింద అడిగితే నలభై వేలే అన్నావు. రెండు నెలల్లో పదివేలు పెంచావేంటి?” అడిగాడు కమలేష్.
”అంతా పెద్దాయన దయ సార్!” అంటూ షాపులోని పెద్డాయన ఫొటో వైపు చూపాడు ఓనరు.
”ఏమండి ఫ్రిజ్ ఇదే తీసకుందాం! బాగుంది!” అంటూ ఫ్రిజ్ వద్దకు పిలిచింది వందన.
అటువైపు వెళ్లాడు కమలేష్.
”దీని ధర ఎంత?” అడిగాడు మల్లేష్ తన వెనకే వచ్చిన షాపు ఓనర్‌తో.
”ఈ ఫ్రిజ్ నలభై వేలు సార్! ఇంతకు ముందు నెలలో దీని ధర ముప్ఫై వేలు సార్! ఇది కూడా పెద్దాయన దయే సార్!” అడక్కుండానే చెప్పేశాడు షాపు ఓనర్!.
”ఏమయ్యా మీరు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి దానికి పెద్దాయన పేరు చెబుతారా? ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా, మీరు ధరలు ఏమీ తగ్గించలేదు. పైగా పెంచి అమ్ముతున్నారు. మీరు పాకిస్తాన్ ఏజెంట్లు! మీ మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాను!” అన్నాడు కమలేష్ ఆవేశంగా. ”కోపం తెచ్చుకోకండి సార్! నేను పక్కా లోకల్. మీ పక్క గల్లీలోనే ఉంటాను.మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అతను బాగా సంపాదిస్తున్నాడు కద సార్!” అన్నాడు షాపు ఓనర్.
”ఏం మాట్లాడుతున్నావయ్యా! మా అబ్బాయి బాగా సంపాదిస్తుంటే అదంతా నీకు ధారపోయాలా? ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి, ఎదవ లాజిక్కులు మాట్లాడుతున్నావా?” అన్నాడు కమలేష్ మరింత కోపంగా.
”సార్! మన రూపాయి విలువ తగ్గింది కదా! అందుకే మీ అబ్బాయి సంపాదించే డాలర్లకి ఎక్కువ రూపాయలు వస్తాయి కదా! అని మీ అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడని అన్నాను!” అన్నాడు ఓనర్.
”నీ షాపులోని సరుకుల ధరలు పెంచి, దానితో మా అబ్బాయి సంపాదనకు ఎందుకు లింక్ పెడతావు!” అంటూ ఓనర్ మీదికి దూసుకెళ్లబోయాడు కమలేష్. వందన చెయ్యి పట్టుకుని ఆపింది.
”సార్! మీరు అర్థం చేసుకుంటారని అనుకున్నాను. మీరు కొంటున్న టీవీ, ఫ్రిజ్ అన్నీ మనం దిగుమతి చేసుకున్నవే సార్. మరికొన్నింటికి విడి భాగాలు దిగుమతి చేసుకొని ఇండియాలో అసెంబుల్ చేసుకొని ‘మెకిన్ ఇండియా’ అంటున్నాము. మనం విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఏ సరుకుకైనా డాలర్లే చెల్లించాలి! మన రూపాయి విలువ పడిపోయినందువల్ల ఎక్కువ రూపాయిలు చెల్లించి, డాలర్లు కొని ఆ డాలర్లతో సరుకులు దిగుమతి చేసుకోవాలి! మీ అబ్బాయికి వచ్చే డాలర్లకి మన రూపాయి విలువ తగ్గినందున ఎక్కువ రూపాయిలు ఇవ్వాల్సి వస్తుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు సార్!” అన్నాడు షాపు ఓనర్.
జేబుల్లో చేతులు పెట్టుకుని మౌనంగా నిలబడి పోయాడు కమలేష్. రూపాయి విలువ తగ్గితే దేశానికి మంచిదంటూ వాట్సప్‌లో వస్తుంటే నిజమేననుకున్నాడు! దేశానికి ఏది మంచిదైతే అదే పెద్దాయన అమలు చేస్తాడని, అందుకే రూపాయి విలువ తగ్గుతున్నా పట్టించుకోవటం లేదని, ఆయన దేశానికి చౌకీదార్ గాబట్టి దేశాన్ని కాపాడుతాడని గట్టిగా విశ్వసించాడు. పెద్దాయనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ్లంతా దేశద్రోహులు అని, వారిపై కసిపెంచుకున్నాడు.
ఇంతకీ ఎవరో తమ మొబైల్ ఫోన్‌ను టీవీకి కనెక్టు చేశారు.
”శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ రూపాయి విలువ పడిపోవటం లేదు. కాని హిందుస్తాన్ రూపాయి విలువ మాత్రమే ఎందుకు పడిపోతుంది. ప్రధానమంత్రీజీ సమాధానం చెప్పండి నాకు!” అని ప్రధాన మంత్రిని టీవీలో ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నిలదీస్తున్నారు!
ఉషాకిరణ్
లాజిక్ మిస్సయ్యాడు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



