నవతెలంగాణ-హైదరాబాద్
లోక్ అదాలత్‌లో కేసులను రాజీ చేసుకునేందుకు వీలుగా పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటీవ్ చైర్మెన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్‌కోషి సూచించారు. మంగళవారం హైకోర్టు ఆవరణలోని లోక్ అదాలత్ అథారిటీ ఆఫీసులో పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. చీఫ్ జస్టిస్ ఏకే సింగ్ సూచనల మేరకు నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. క్రిమినల్ కాంపౌండబుల్ కేసుల(జరిమానా విధింపుతో పరిష్కారమయ్యే కేసులు)ను అధిక సంఖ్యలో పరిష్కరించేందుకు పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల కోర్టులపై కేసుల భారం తగ్గుతుందన్నారు. ఈ మేరకు సహకారం అందిస్తామనీ, పోలీసులకు తగిన ఆదేశాలిస్తామని డీజీపీ బి.శివధర్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారులు మహేశ్ భగవత్, చారు సిన్హా, అథారిటీ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఇతరులు హాజరయ్యారు.
పీడీ యాక్ట్ కరెక్టే
చట్ట వ్యతిరేకంగా గంజాయి అమ్మకాలు చేయడం, పోలీసులకు పట్టుబడటం, బెయిల్‌పై బయటకు వచ్చాక మళ్లీ అదే నేరం చేసే అరుణాబాయి అలియాస్ అంగూరీబాయిని పీడీ యాక్ట్ కింద పోలీసులు ముందస్తు నిర్భంధంలోకి తీసుకోవడాన్ని హైకోర్టు సమర్ధించింది. గంజాయి అమ్మకానికి అలవాటు పడిన ఆమె గంజాయి అమ్మకం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తోందని చెప్పింది. అంగూరీబాయిపై పీడీ యాక్ట్ అమలు చేయడాన్ని కుమార్తె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. అదే పనిగా గంజాయి అమ్మకాలు చేయడం వల్ల పీడీ యాక్ట్ నమోదు చేశారని ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టపరంగానే పీడీ యాక్ట్ అమలు చేసినందున హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లదని హైకోర్టు తీర్పులో పేర్కొంది.
లావాదేవీలను చెప్పకుండా అప్పీల్ చెల్లదు
భూమిపై హక్కులున్నాయంటూ 1967నాటి లావాదేవీల గురించి గోప్యంగా ఉంచి 2020లో సూట్ వేయడం కుదరదని హైకోర్టు తీర్పు చెప్పింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలోని సివిల్ కోర్టు తీర్పును రద్దు చేసింది. కింది కోర్టు ఆర్డర్‌ను సవాల్ చేస్తూ 22 సెంచరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్టు లిమిటెడ్ వేసిన అప్పీల్‌ను జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారించి తీర్పు చెప్పారు. సివిల్ వివాదంపై ఆలస్యంగా అప్పీల్ చేయడం చెల్లదన్నారు.
నవంబర్ 15న లోక్‌అదాలత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



