నవతెలంగాణ-హైదరాబాద్ : నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతం పోలేపల్లి గ్రామ రైతు లోకసాని పద్మా రెడ్డికి జాతీయస్థాయిలో అవార్డు వచ్చింది. ఈనెల 24 , 25 తేదీల్లో ఘజియాబాద్ లో నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నాచురల్ ఫార్మింగ్ సెంటర్లో జరిగిన రెండు రోజుల సెమినార్ మరియు ఎగ్జిబిషన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు చాంపియన్ ఫార్మర్ అవార్డును ప్రకటించింది. పోలేపల్లి లో తన వ్యవసాయ క్షేత్రంలో 12 ఎకరాల విస్తీర్ణంలో కుంకుడు సాగు చేయడం ద్వారా లోకసాని పద్మా రెడ్డికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది . కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘజియాబాద్ లో రెండు రోజులపాటు ఆర్గానిక్, న్యాచురల్ ఫామింగ్ పై జరిగిన సెమినార్ లోనూ ఆయన మాస్టర్ ట్రైనర్ గా వ్యవహరించారు. మొదటి నుంచి సహజ వ్యవసాయం ద్వారానే, ఆయన ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు వినియోగించకుండా బత్తాయి , జామ, కుంకుడు , ఉసిరి , సీతాఫలం , కొబ్బరి తోటలను సాగు చేస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ లో లోకసాని పద్మా రెడ్డి చేస్తున్న కృషిని గుర్తించి కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ రీసర్చ్ సెంటర్ ఆయనకు జాతీయస్థాయిలో ఛాంపియన్ ఫార్మర్ అవార్డును ప్రకటించింది . ఇప్పటికే లోకసాని పద్మా రెడ్డికి మిలియనీర్ ఫార్మర్ అవార్డ్ , వనమాలి అవార్డులు వచ్చాయి. జాతీయస్థాయిలో ఛాంపియన్ ఫార్మర్ అవార్డు అందుకున్న లోకసాని పద్మా రెడ్డికి స్నేహితులు, బంధువులు అభినందనలు తెలిపారు.





