– సంగారెడ్డి జిల్లా రుక్మాపూర్ గ్రామంలో ఘటన
నవతెలంగాణ-జహీరాబాద్/న్యాల్‌కల్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన బోరంచ రాణమ్మ (50)ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ముక్కు నోరు మూసి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశారు. సీఐ హనుమంతు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఒంటరి మహిళగా జీవిస్తున్న రాణమ్మకు ఒక కూతురు ఉంది. కూతురికి వివాహం చేసి, తాను ఒంటరిగానే జీవిస్తున్నది. కాగా, సోమవారం ఉదయం రాణమ్మ ఇంటి తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారు ఇంటి తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్లి చూడగా రాణమ్మ విగతజీవిగా పడి ఉంది. వెంటనే వారు పోలీసులకు సమాచారమందించారు. పోలీస్ జగిలాలతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రాణమ్మ మెడలో ఉన్న అరతులం బంగారు నగలను సైతం దుండగులు దోచుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ హనుమంతు తెలిపారు.
నిమ్జ్ డబ్బుల కోసమే హత్య జరిగిందా..?
రాణమ్మకు గ్రామంలోని సర్వే నంబర్ 48లో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ పొలం ఇటీవలే నిమ్జ్ నందు అక్వేర్ చేశారు. మొదటి విడత డబ్బులు కూడా రాణమ్మ తీసుకున్నట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది. అందరితో కలిసిపోయి ఉండే రాణమ్మ హత్యకు నిమ్జ్ డబ్బులే కారణమా.. అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పోలీసులు తమ విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, రాణమ్మ కూతురు స్వాతి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒంటరి మహిళ దారుణ హత్య
- Advertisement -
- Advertisement -